Monday, February 9, 2026
E-PAPER
Homeఆటలురసపట్టులో రంజీ క్వార్టర్స్‌

రసపట్టులో రంజీ క్వార్టర్స్‌

- Advertisement -

జార్ఖండ్‌పై ఉత్తరాఖాండ్‌ గెలుపు

ముంబయి : కర్నాటక, ముంబయి రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌ ఉత్కంఠకు చేరుకుంది. నాల్గో రోజు ఆటలోనే ఫలితం తేలే అవకాశం అధికంగా కనిపిస్తోంది. కర్టాటక విజయానికి మరో 212 పరుగుల దూరంలో నిలువగా.. ముంబయికి మరో 8 వికెట్లు అవసరం. తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేసిన ముంబయి.. రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులు చేసింది. ఆకాశ్‌ ఆనంద్‌ (70), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి (36), అఖిల్‌ (33), సిద్దేశ్‌ (25), సూర్యాన్షు (25) సహా తనుశ్‌ కొటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులు చేసిన కర్నాటక… ఛేదనలో 113/2తో ఆడుతోంది. కెఎల్‌ రాహుల్‌ (60 నాటౌట్‌), కరుణ్‌ నాయర్‌ (9 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. మయాంక్‌ అగర్వాల్‌ (3), దేవదత్‌ పడిక్కల్‌ (39) అవుటయ్యారు.

ఆంధ్ర, బెంగాల్‌ క్వార్టర్‌ఫైనల్లో.. ఆంధ్ర వెనుకంజలో నిలిచింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌట్‌ కాగా.. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 418/6 పరుగులతో ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 123 పరుగుల ముందంజలో నిలిచింది. సుదిప్‌ కుమార్‌ (216 నాటౌట్‌, 451 బంతుల్లో 27 ఫోర్లు) ద్వి శతకంతో కదం తొక్కాడు. సుమంత గుప్తా (81), హబిబ్‌ గాంధీ (45 నాటౌట్‌) రాణించారు. సుదిప్‌, హబిబ్‌ క్రీజులో అజేయంగా నిలిచారు. మరో క్వార్టర్‌ఫైనల్లో జార్ఖండ్‌పై ఉత్తరాఖాండ్‌ ఇన్నింగ్స్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఉత్తరాఖాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేయగా.. జార్ఖండ్‌ వరుసగా 235, 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడో రోజే ఉత్తరాఖాండ్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌ ఎదురీదుతోంది. జమ్మూ కశ్మీర్‌ వరుసగా 194, 248 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులే చేసింది. 291 పరుగుల ఛేదనలో మధ్యప్రదేశ్‌ 87/5తో కష్టాల్లో కూరుకుంది. జమ్మూకశ్మీర్‌కు మరో ఐదు వికెట్లు అవసరం కాగా.. మధ్యప్రదేశ్‌ విజయానికి మరో 204 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -