రూ.150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధుల మంజూరు : మంత్రి సీతక్క
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయానికి చేరుకోగానే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అంశాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా, స్వయంగా సీఎం, మంత్రులు హాజరై పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఆదివాసీ పూజారులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల పునర్నిర్మాణం చేపట్టామని, వందల ఏండ్ల పాటు నిలిచేలా రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని వివరించారు.
ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. 19న జాతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మేడారం జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే తాను వేములవాడకు వచ్చినట్టు చెప్పారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభారు, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, పట్టణ సీఐ వీరప్రసాద్, వివిధ శాఖల అధికారుల, సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



