రాజుండాడు రాజ్యముండాది. రాజుకో కోట ఉండాది, కోటలో తోట వుండాది. పన్నులు వసూలు చేసి ఖజానా నింపేసినట్టే, ఏది పడితే అది, ఎట్టా పడితే అట్టా, మెక్కేసినాడు గందా. రాజాగాడికి ఒళ్లు కొవ్వెక్కినాది, పొట్ట బరువైనాది. పొట్ట బరువు తగ్గేదానికి రాజేం చేసేవాడంటే పొద్దుపొద్దుగాల్నే నిద్దర లేచి తోటలో తిరుక్కొచ్చేవాడు. ఇదిలాగ రోజూ పొద్దుటేల జరిగే తంతే.
ఓనాడు రాజు తోటలో కడుపేసుకు తిరుగుతావుంటే సుడిగాలికొట్టినాది. ఎండిన ఆకులు గాల్లో రింగురింగు తిరుగుతూ రాజును కమ్మేసినాయి. చేత్తో ఆకుల్ని దులపతా వుంటే, ఓ ఆకు చేతికి బిగుతుగా అంటుకుంది. గాలి అసుంటా ఇసుంటా ఎల్లిపోయింది కాని, రాజు చేతిలో ఆకు అట్నే వుండిపోయింది. ఏందీ తమాష అని గట్టిగ లాక్కొని చూసినాడు గదా, దాని మీదేటో రాసుంది. ఏంటా ఇదని కళ్లు చిట్లించి చూసినాడు. దాని మీద రెండే రెండు మాటలు అగుపడ్డయి. ఏటా ఇవన్ని చదువొచ్చినోడు కాబట్టి చదివేసినాడు. ఆకు మీద వున్న రెండు పదాలు ‘రప్పా… రప్పా’ అని మల్లమల్ల చదివినాడు కాని ఏటో తెల్వకపోయింది.
ఆకట్టుకుని, సభకుపోయి ఆకు మంత్రి చేతిలో ఎట్టి ‘రప్పా రప్పా’ అంటే ఏందప్పా? అనడినాడు. మంత్రి ‘రప్పారప్పా’ అని ఒక్కసారి కాదు పదిసార్లు సదివినాడు. బుర్ర గోక్కున్నాడు. ఏటో మారాజ ఈ ‘రప్పారప్పా’ నా బుర్రలో ఏడ ఎతికినా ఏందో తెల్వకపాయె అంటూ ఆకును సేనాపతికిచ్చినాడు. సేనాపతి ఆకుమీద రాసున్న ‘రప్పారప్పా’ను పైకీ కిందకీ తిప్పితిప్పి చూసినాడు. ‘రప్పారప్పా’ అంటేంటి ‘రప్పారప్పా’ నే మల్ల అనేసి నాడు.
గిట్టయితె లాభమేలేదని రాజైనోడు రాజ్యమంతట డప్పు వాయిపించాడు. మూతిమీద మీసమున్నోడు, తొడగొట్టుడు చేతనయినోడు ఎవడైనాసరే, ఈ ‘రప్పారప్పా’కు అర్థం చెపితే లక్ష వరహాలు బహుమానం అని టముకేయించాడు. జనం చాంతాడంత లైనుకట్టి, ఎవని బుర్రల జొర్రిన అర్థం వాడు చెప్తడేమోనని ముందు జాగర్త కోసం, ‘రప్పారప్పా’కు సరైన అర్థం ఇప్పలేనోడి తల కోట గుమ్మానికి వేలాడదీస్తనని గూడ చెప్పించాడు. జనం బుగులుపడిపోయి ముందుకు రాలేదు. ఇగరాజైనోడికి నిద్రనేదే లేదు. ఆ ఆకు యాడికెల్లి ఎగిరొచ్చినాదో తెల్వలే. ఇగ దానిమీద ఉన్న ‘రప్పారప్పా’ ఏంటో ఎరుకనే కాలేదు. ఈ ‘రప్పారప్పా’ ఏంటో తెల్వకనే పైకి పైకిపోతనేమో అనుకున్న రాజు ‘రప్పారప్పా’కు వివరం చెప్తే అర్థ రాజ్యం ఇచ్చేస్తానని మల్లమల్ల డప్పేయించిండు.
ఈ లెక్కన ‘రప్పారప్పా’కు రాజు పురాగ రాజ్యెం గూడ ఇచ్చేటట్టున్నడు, వీని నిద్రకోసం, మా నిద్ర చెడగొట్టి అందర్ని ఆగం చేసెటట్టున్నడని మంత్రి గుర్రమెక్కిండు. దునియంత తిరిగైనా ‘రప్పారప్పా’ ఏంటో తెల్సుకోవాలె అనుకుండు. అట్ట తిరగతా తిరగతా ఓ రాజ్జెం పోయిండు. ఆడ ఓ చోట జనం గుంపుగుంటె పొయ్యి పరకాయించి జూసిండు. వాల్ల చేతుల్ల పెద్ద అట్టబోర్డులున్నాయి. వీటి మీద అచ్చరాలు చదివిండు. అదిరిపడ్డడు. ఆటిమీద ‘రప్పారప్పా నరుకుతా’ అని వుండె. అమ్మ ఇగ దొరికిందిరా ‘రప్పా రప్పా’ అనుకున్నాడు. ఓ అట్టబోర్డు పట్టుకున్నోన్ని గడ్డం పట్టుకోని బతిమాలి తన రాజ్జెం తెచ్చి రాజు ముందల నిలబెట్టిండు.
తోటల నడవకుండనే పొట్టలోపల్కి పొయ్యి డొక్క బైటికి వచ్చిన రాజు ఆ అట్టమీద అచ్చరాలు చదివి మంత్రి ఏ మాదిరిగ అదిరిపడ్డడో, అట్టనే పడిపోయిలేచి ‘అరె! ఎవడవురా నువ్వు గందం చెట్లు నరికెటోని తీరుగున్నవు. నువ్వెవరైతేమి, ‘రప్పారప్పా నరుకుతా’ అన్న అట్ట వున్నది నీకాడ. నరుకుడు సంగతేంటోగాని ‘రప్పారప్పా’ అంటె ఏంటో చెప్పురా అప్పా! పున్నెం వుంటది అన్నాడు.
పిల్లోడు వుషారైండు, ‘గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్పారప్పా నరుకుతా’ అని వుండాలెగాని అట్ట చిన్నదయింది మల్ల అని ‘రప్పా రప్పా నరుకుతా’ వరకే ఉన్నదని అన్నడు.
పూర్తి సంగతి నాకొద్దురా బుడ్డోడా. ‘రప్పారప్పా’ వరకే సాలు. చెప్పి వెయ్యి వరాలు తీస్కపో అన్నడు రాజు. అర్థరాజ్యపు హామీని తుంగలో తొక్కేసి.. సచ్చినోడి లగ్గానికి వచ్చిందె కట్నం అనుకున్న ఆ కుర్రోడు అరచేతిని మెడకింది నుంచి కుడి నుంచి ఎడమకి, ఎడమనుంచి కుడికి తిప్పుతూ ‘తగ్గేదేలే’ అన్నాడు. తగ్గకురో నువ్వు తగ్గకుండ ‘రప్పారప్పా’ ఏంటో చెప్పి ఐదొందల వరాలు తీస్కపో అన్నడు మంత్రి. మంత్రులెవరు మాట మీద వుండరు అన్న మాట నిజం చేసిండు. ‘రప్పారప్పా’ అంటే గంగమ్మ జాతర్లో పొట్టేలు తల నరుకుతా వుంటే వచ్చే చప్పడు మారాజా!’ అన్నడు అట్టపట్టుకున్నోడు.
రాజు కత్తితో నరికే చప్పుడును కళ్లు మూసుకుని ఊహించుకున్నాడు. ‘రప్పారప్పా!’ అప్పా బలే చెప్పినవప్పా ‘రప్పారప్పా’ అని, పట్టరాని ఆనందంలో ‘యురేకా యురేకా! రప్పారప్పా’ అంటూ గంతులేశాడు. మంత్రీ, సేనాపతీ ‘రప్పారప్పా’ అంటూ గుండ్రాలు తిరిగారు చప్పట్లు కొడుతూ.
– చింతపట్ల సుదర్శన్
9299809212