ట్రంప్ టారిఫ్‌ల యూటర్న్‌కు ఇదే కీలకం
చైనా ముందు తలొగ్గక తప్పని పరిస్థితి
పలు రంగాల్లో ఈ ఖనిజాలది ముఖ్య పాత్ర
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు చైనా, అమెరికా. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక డోనాల్డ్ ట్రంప్.. తమకు పోటీగా ఉన్న దేశాలను టార్గెట్‌గా చేసుకుంటూ సుంకాలు, ఆంక్షల యుద్ధానికి దిగాడు. ప్రతి రంగంలోనూ అమెరికాకు గట్టి పోటీనిస్తూ, ప్రత్యామ్నాయంగా మారిన చైనా.. ట్రంప్‌నకు లక్ష్యంగా మారింది. ఎలాగైనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా చర్యలకు దిగాడు. ఇందులో భాగంగానే చైనాపై సుంకాలు, ఆంక్షలు అని ప్రకటనలు చేశాడు. అయితే అమెరికా చర్యలకు చైనా ఏ మాత్రమూ బెదరలేదు. ప్రతీకార సుంకాలకూ దిగింది. అయితే ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఇరు దేశాల ఆర్థిక ప్రతినిధుల మధ్య భేటీ సాఫీగా సాగి, అది ఇరు దేశాల అధ్యక్షులు ట్రంప్, జిన్‌పింగ్ మధ్య సమావేశానికి మార్గం సుగమం చేసింది. ఇందులో భాగంగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సుకు హాజరైన ఇరువురు నేతలు తమ ద్వైపాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికైంది.
చైనా ఆధిపత్యం.. అమెరికా అవసరం
అప్పటి వరకూ చైనాపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన ట్రంప్.. ఈ సమావేశం అనంతరం తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. చైనాపై సుంకాలు తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. జిన్‌పింగ్‌తో సమావేశాన్ని ‘అద్భుతమైన విజయంగా’నూ అమెరికా అధ్యక్షుడు అభివర్ణించాడు. అయితే చైనాకు ట్రంప్ తలొగ్గాడనీ, ఇందుకు అత్యంత ప్రధాన కారణం ‘రేర్ ఎర్త్ మెటీరియల్స్’ అని విశ్లేషకులు చెప్తున్నారు. దీనిని ఒక గేమ్ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. అమెరికా రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాలు ఈ ఖనిజాలు లేకుండా పని చేయలేవు. మరోపక్క ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎగుమతులపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్న చైనా దీనిని అవకాశంగా మలుచుకున్నది. మొత్తానికి ట్రంప్‌ను దిగి వచ్చేలా చేసింది. చైనాపై సుంకాలు తగ్గిస్తూ ప్రకటించాల్సిన పరిస్థితిని తీసుకు వచ్చింది.
ఏమిటి ఈ రేర్ ఎర్త్స్?
రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అరుదైన ఖనిజాలు. ప్రపంచంలో దీని ఉత్పత్తిలో 70 శాతం నియంత్రణ చైనాకే ఉన్నది. ఈ ఖనిజాలు ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, ఫైటర్ జెట్లు, అణు నౌకల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. రేర్ ఎర్త్ మెటీరియల్స్ లేకపోతే అమెరికాలోని పలు రంగాలు ప్రతికూల ప్రభావాన్ని చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఒక యూఎస్ ఎఫ్-35 ఫైటర్ జెట్ తయారీలో 418 కిలోల రేర్ ఎర్త్ మినరల్స్ వాడతారు. అలాగే నేవీ డిస్ట్రాయర్ షిప్ (అర్లీఫ్‌ు బ్రూక్ డీడీజీ 51)లో 2600 కిలోల వరకు ఈ ఖనిజాలను ఉపయోగిస్తారు. యూఎస్ రక్షణ రంగం రేర్ ఎర్త్స్‌పై ఎంత వరకు ఆధారపడుతున్నదన్న విషయాన్ని ఈ రెండు ఉదాహరణలతో అర్థం చేసుకోవచ్చు.
ఇతర రంగాలవీ ఇదే పరిస్థితి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ ఖనిజాలు లేకుండా తయారు చేయడం అసాధ్యం. ఇక తమ రేర్ ఎర్త్ ఖనిజాలను ఉపయోగించే ఏదైనా కంపెనీ లేదా దేశం తమ ఆమోదం పొందాల్సి ఉంటుందని ఇప్పటికే చైనా ఆదేశించింది. కాబట్టి చైనాతో సఖ్యత అమెరికాకు అనివార్యమైంది. ఇందులో భాగంగానే ట్రంప్.. జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా.. అమెరికాపై రేర్ ఎర్త్ నిషేధాన్ని కనీసం ఒక ఏడాది పాటు వాయిదా వేసింది. ఫలితంగా చైనాపై ట్రంప్ ప్రకటించిన వందశాతం సుంకాలు కూడా రద్దయ్యాయి.
అగ్రరాజ్యం పేరుతో పలు దేశాలను ఆంక్షల చట్రంలో బంధిస్తూ, సుంకాల పేరుతో బెదిరిస్తున్న అమెరికా.. చైనా విషయంలో మాత్రం అంత సాహసాన్ని చేయలేదని విశ్లేషకులు చెప్తున్నారు. చైనా తన రాజీలేని విధానాలతో ప్రపంచ వాణిజ్యంలో, రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకుంటున్నదని అంటున్నారు.
రేర్ ఎర్త్..గేమ్ ఛేంజర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



