ఈ-వేస్ట్ నుంచి రేర్‌ఎర్త్ మాగెట్స్
దేశ భద్రత, శక్తి స్వావలంబనకు మార్గం
భారత్‌కు వ్యూహాత్మక బలం
న్యూఢిల్లీ : మన ఇండ్లలో పాతబడిన స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇకపై సాధారణమైన ఈ-వేస్ట్‌గా చూడొద్దు. ఎందుకంటే అవి అరుదైన భూధాతువుల నిల్వలుగా మారుతున్నాయి. ఈ పరికరాల్లోని నియోడియమ్ అయస్కాంతాలు, లిథియం-కోబాల్ట్ వంటి ఖనిజాలను తిరిగి పొందడం ద్వారా దేశ భద్రత, శక్తి స్వావలంబనకు భారతీయ శాస్త్రవేత్తలు బాటలు వేస్తున్నారు. ఒక గని ద్వారా లభించే, ఉత్పత్తి అయ్యే దానితో పోలిస్తే.. ఈ-వేస్ట్ నుంచే ఎక్కువ గా కీలకమైన ఖనిజాలు, అరుదైన భూధాతువుల లభ్యత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
పాత ఫోన్‌లలో ఉన్న అసలు సంపద ఏమిటి?
ప్రతి పాత ఫోన్‌లో నియోడియమ్ వంటి అరుదైన భూధాతువులతో తయారైన శక్తివంతమైన అయస్కాంతాలు ఉంటాయి. ఇవి ఫైటర్ జెట్స్, క్షిపణులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌లో కీలకం. గ్రేటర్ నోయిడాలోని లోహమ్ సంస్థ రీసైక్లింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ సయ్యద్ గజన్ఫర్ అబ్బాస్ మాట్లాడుతూ… ”ఒక టన్ను కోబాల్ట్ గనిలో 1-2 కిలోల కోబాల్ట్ మాత్రమే లభిస్తుంది. కానీ ఉపయోగించిన బ్యాటరీ వ్యర్థాల్లో మాత్రం ఇది 50-80 కిలోల వరకు ఉంటుంది” అని వివరించారు. దీనిని బట్టి చూస్తే.. పాత బ్యాటరీలు అనేవి గనుల కంటే 80 రెట్లు అధిక సాంద్రత కలిగిన ఖనిజ వనరులుగా మారాయని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ అరుదైన భూధాతువల శుద్ధిలో చైనా దాదాపు 90 శాతం ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలో వ్యర్థాల నుంచి ఖనిజాల పునర్వినియోగం భారత్‌కు వ్యూహాత్మక మార్గంగా మారిందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
900 డిగ్రీల అటామిక్ రీసెట్ అంటే..?
భారత ల్యాబ్‌లలో 900 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ రక్షిత గదిలో అయస్కాంతాలను శుద్ధి చేస్తారు. నియోడియమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను ఇస్తుంది. డైస్ప్రోసియమ్ వేడి నిరోధకతను అందిస్తుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద అయస్కాంతంలోని సూక్ష్మ పగుళ్లు నయం అవుతాయి. అయితే ‘క్యూరీ పాయింట్’ (310- 400 డిగ్రీల సెల్సియస్) దాటితే అయస్కాంత శక్తి శాశ్వతంగా కోల్పోతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఖచ్చితమైన, వేగవంతమైన తాపన విధానాన్ని అనుసరిస్తారు. సరైన నియంత్రణ లేకపోతే అయస్కాంతం పొడిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ ముందున్న సవాళ్లు
ప్రస్తుతం భారత్ ఎక్కువగా ‘మెకానికల్ సెపరేషన్’ (పరికరాల నుంచి ప్లాస్టిక్, లోహాలను వేరు చేయడం) వరకు మాత్రమే పరిమితం. ‘బ్లాక్ మాస్’ అనే నల్లటి పొడిని తయారు చేస్తా రు. ఇందులో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటివి ఉంటాయి. కానీ ఈ ఖనిజాలను శుద్ధి చేసి కొత్త బ్యాటరీల తయారీలో వినియోగించే పెద్ద స్థాయి దేశీయ కర్మాగారాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. దీంతో అధిక విలువ కలిగిన పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. గ్రేటర్ నోయిడాలో 2025 చివరలో ప్రారంభించిన సమగ్ర అరుదైన భూధాతు అయస్కాంత సదుపాయం ద్వారా పూర్తిస్థాయి ఖనిజ రికవరీ చేయగలమని లోహమ్ సంస్థ చెప్తున్నది.
భారత్‌కు అణుసార్వభౌమత్వం అవసరం
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ కూడా అణుసార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలని మేధావులు చెప్తున్నారు. అణుసార్వభౌమత్వం అంటే ఖనిజాల తవ్వకాల నుంచి తుది ఉత్పత్తి వరకు ప్రతి దశనూ ఒక దేశం స్వయంగా నియంత్రించగలగడం. పాత హార్డ్‌డ్రైవ్ అయస్కాంతాన్ని కొత్త శక్తివంతమైన భాగంగా మార్చడం ద్వారా.. ఈ-వేస్టేజీ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) జాతీయ భద్రతా ఆస్తులుగా మారుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. భారత్‌లో శుద్ధి చేసిన అణువులు దేశంలోనే ఉండి, దేశ భవిష్యత్తు శక్తి అవసరాలను తీర్చాలనీ, ఇదే దేశం ముందు ఉన్న లక్ష్యమని చెప్తున్నారు.



