Sunday, March 22, 2026
E-PAPER
Homeసోపతిరంగస్థల సేవలో 'రసరంజని'

రంగస్థల సేవలో ‘రసరంజని’

- Advertisement -

నాటక రంగ వికాసానికై ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తతంగా ప్రదర్శించబడాలి. నాటకం ప్రజల మధ్యలోకి వెళ్లాలి, నాటకం ద్వారా సమాజం చైతన్యం అవ్వాలనీ, ముఖ్యంగా టిక్కెట్టుకొని నాటకం చూడటం అనే అలవాటు ప్రజలకు కలగాలనే ఉద్దేశ్యాలతో 1993లో ‘రస రంజని’ స్థాపించారు. మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కళారంగం కోసం రసరంజని సంస్థ చేస్తున్న సేవ గురించి తెలుసుకుందాం…

రంగస్థల ప్రముఖులు చాట్ల శ్రీరాములు, డాక్టర్‌ మొదలి నాగభూషణశర్మ, గరిమెళ్ల రామ్మూర్తి, దుగ్గిరాల సోమేశ్వరరావు, జె.వి.సోమయాజులు, జెవి రమణమూర్తి గార్లు ‘రసరంజని’ స్థాపనలో ముఖ్యలు. వీరే కాక ఈ సంస్థకు అన్ని విధాల అండదండలు, సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణా ప్రభుత్వ పూర్వ సాంస్కతిక సలహాదారు కెవి రమణాచారి (రిటైర్డ్‌ ఐఎఎస్‌) గారు, అప్పటి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌హెచ్‌జె దొర గారు ఎంతో ముఖ్యులు. వీరందరి ఆలోచన, కార్యదక్షత, అనుభవం, పట్టుదల ఇంధనాలుగా సమకూరి రసరంజని సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇప్పటికి 33 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఇన్నేండ్లలో రసరంజని తన అస్తిత్వాన్ని, ఉనికిని నిల్పుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ కాలంలో దాదాపు 700 నాటకాలు, 3000 ప్రదర్శనలు తమ ఆర్టిస్టుల చేగానీ, బయట సమాజాల వారిచే గానీ ప్రదర్శించింది.

‘రసరంజని’ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, ముంబై, చెన్నై , కోల్‌కతా లాంటి మహానగరాల్లో కూడా తన ఉనికిని చాటుకుంది. అంతేకాక నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, సౌత్‌జోన్‌ కల్చరల్‌ సెంటర్‌ లాంటి జాతీయ సంస్థల్లో కూడా ప్రదర్శనలిచ్చింది. నాటకం సమగ్ర స్వరూపం, ఎంచుకున్న కథను బట్టి దాని సంపూర్ణ స్వరూపాన్ని, ఇతర కళారూపాలైన సంగీతం, నాట్యం వంటి వాటిని కలగలిపి సమగ్రంగా జనరంజకంగా ప్రదర్శించటానికి వీలుంటుంది. నాటక వ్యవధి కూడా దాదాపు గంటన్నర ఉంటుంది. నిడివి కూడా ఎక్కువ. రసరంజని ఎప్పుడూ నాటకాలపైనే దృష్టిపెట్టి కచ్చితమైన సమయపాలన పాటిస్తూ ప్రదర్శనా యోగ్యమైన సమకాలీన సమస్యల్ని ప్రస్తావిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

‘కన్యాశుల్కం’ నాటకంతో ప్రథమ ప్రదర్శన ప్రారంభించి చాట్ల గారి దర్శకత్వంలో ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’, సత్యానంద్‌ రచన ‘బొమ్మలాట’, రెంటాల గోపాలకృష్ణ రచన ‘ఇనస్పెక్టర్‌ జనరల్‌’, అబ్బూరి గోపాలకృష్ణ రచన ‘త్రిజాకీ యమదర్శనం’, ‘మూడు ప్రశ్నలు’గా ప్రదర్శించటం జరిగింది. తర్వాత కె.శ్రీహరిమూర్తి గారి ‘సంధ్యాఛాయ’, ఎల్‌.బి.శ్రీరామ్‌ గారి ‘ఒంటెద్దుబండి’, డాక్టర్‌ మొదలి నాగభూషణ శర్మ గారి దర్శకత్వంలో విశాఖ దత్తుడి ‘ముద్రా రాక్షసం’, ‘కాగితం పులి’, తాళ్లూరి శివరామకృష్ణ గారి దర్శకత్వంలో చిట్టా శంకర్‌ గారి రచనలు ‘నిజం చెప్పకు’, ‘వారం వారం’ ప్రదర్శించబడ్డాయి. ప్రఖ్యాత దర్శకులు ఉదయభాను దర్శకత్వంలో ‘కాకి బంగారం’, ‘ఓ సినీ భస్మాసుర’, ‘చరణ్‌దాస్‌’ వంటి నాటకాలు, తల్లావజఝల సుందరం గారి దర్శకత్వంలో ‘దొంగలబండి’, ‘ప్రసన్నకు ప్రేమతో’, ‘ఈహామగం’ వంటి నాటకాలు,

దుగ్గిరాల సోమేశ్వరరావు గారి దర్శకత్వంలో ‘ఇదేమిటి’, ‘పుట్ట’, దివంగత నటులు, ప్రయోక్త మిక్కిలి ఫ్రాన్సిస్‌ గారి దర్శకత్వంలో ‘చో’, రామస్వామి గారి రచన ‘తుగ్లక్‌’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నాటకాలు, ఎన్నో ప్రదర్శనలు రసరంజని వేదికగా ప్రదర్శించబడ్డాయి. తెలుగు నాటక రంగంలో క్లాసిక్‌గా పిలువబడే కన్యాశుల్కం, ముద్రా రాక్షసం, ప్రతాప రుద్రీయం, కాళ్లకూరి నారాయణరావు గారి వరవిక్రయం, మధు సేవ, చింతామణి వంటి నాటకాలే కాక, ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి రచన ‘సత్య కామేష్టి’, గణేష్‌పాత్రో ‘తరంగాలు’ గొల్లపూడి మారుతీరావు ‘లావాలో, ఎర్రగులాబి’, ‘రాగ రాగిణి’, ‘జగన్నాటకం’, మొదలి నాగభూషణ శర్మగారి ‘ప్రజానాయకుడు ప్రకాశం’, దాదాపు 25 మంది కళాకారులతో చాలా ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది.

ఇంకా శ్రీశైలమూర్తి గారి ‘దేవుడు చేసిన బొమ్మ’, ‘పులి మళ్లీ వస్తుందా?’, ‘అమతం తాగిన రాక్షసులు’, ‘ఐ.పి.ఎం’, తల్లా వజఝల సుందరం గారి దర్శకత్వంలో తారక రామారావు గారి ‘జనమే జయం’. ఎన్‌.ఆర్‌. నంది ‘మరో మొహెంజోదారు’, రావి కొండలరావు గారి ‘నాలుగిళ్ల చావిడి’, ప్రఖ్యాత దర్శకులు, ప్రయోక్త గిరీష్‌ కర్నాడ్‌ గారి అగ్నివర్షం, హయవదన, ‘నాగమండల’, డాక్టర్‌ డి.ఎస్‌.ఎన్‌ మూర్తి దర్శకత్వంలో ‘బకాసుర’, ఇలా వైవిధ్యమైన, సమకాలీన సమస్యల్ని ప్రస్తావించిన ఎన్నో నాటకాలను, రసరంజని తన సంస్థ ద్వారా అనేక ప్రదర్శనలు, హైదరాబాద్‌ నగరంలోనూ, ఇతర ప్రదేశాల్లోనూ ప్రదర్శించి రసరంజని అంటే మంచి నాటకాలు చూడొచ్చు అనే పేరు సంపాదించుకుంది.

జీవితాన్ని ప్రతిబింబించే సమకాలీన సమస్యలు ఇతివత్తంగా సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసినా రసరంజని ప్రసిద్ధమైన పౌరాణిక, చారిత్రక, పద్యనాటకాలను మర్చిపోలేదు. అనేక పౌరాణిక, చారిత్రక, పద్యనాటకాలను, పాతతరం నటుల నుంచి ఇప్పుడిప్పుడే నాటకాలు వేస్తున్న అనేక పౌరాణిక, నూతన నటుల ప్రదర్శనలు కూడా అవకాశం కల్పించింది. ఆ వరుసలో ముందుగా శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి గారి సత్య హరిశ్చంద్ర , చిత్ర నళీయం, తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డి.ఎస్‌. దీక్షిత్‌ దర్శకత్వంలో పాండవోద్యోగ విజయాలు, పల్లేటి లక్ష్మీకులశేఖర్‌ పంచవటి, సంస్కార భారతి ఆధ్వర్యంలో ‘మహాకవి కాళిదాసు’, మున్నంగి భాస్కర్‌ చే ‘శ్రీకృష్ణ రాయబారం’, ఎ.వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ‘శ్రీ కృష్ణ తులాభారం’, వేమూరి రామయ్యగారి ‘మహారధికర్ణ’, కొప్పరపు సుబ్బారావు గారి ‘తారాశశాంకము’,

యువ కళా వాహిని వారి ‘స్వామి వివేకానంద’, జి.ఎస్‌.ఎన్‌. శాస్త్రి గారి దర్శకత్వంలో ‘చింతామణి’, ‘అల్లసాని పెద్దన’, గుమ్మడి గోపాలకష్ణ గారి ‘శ్రీకృష్ణ తులాభారం’, రసరంజని స్వయంగా తయారుచేసిన ‘శ్రీ నాథుడు’. ఇలా ఎన్నో నాటకాలు, ఎన్నో ప్రదర్శనలు రసరంజని ప్రయాణంలో మైలురాళ్లు. రసరంజని తన వేదిక ద్వారా సురభి కళా సమాజాల వారిచే ‘మాయాబజార్‌’, ‘కృష్ణలీలలు’, ‘లవకుశ’, ‘వీరబ్రహ్మంగారి చరిత్ర’, ‘బాలనాగమ్మ’, ‘షిరిడీ సాయిబాబా’, ‘సతీ అనసూయ’, ‘చింతామణి’, ‘పాతాళబైరవి’, ”శ్రీనివాస కళ్యాణం’ వంటి నాటకాలు ప్రదర్శింపజేసి సురభి వారి నాటకాలకు కూడా ప్రాచుర్యం కల్పించింది. తద్వారా సురభి సమాజాల వారు కూడా తమకి ఉన్న గుర్తింపును, పేరును మరింత పెంచుకోవటానికి దోహదపడింది.

రసరంజని తన సొంత రిపర్టరీని స్థాపించుకుని ఎంతోమంది నటులకు, రచయితలకు, దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి వారు నాటక రంగంలో స్థిరపడటానికి వీలు కల్పించింది. నటులకు, రచయితలకు వర్క్‌ షాపులు నిర్వహించింది. తద్వారా నేడు చాలామంది నటులు, టి.వి, సినిమాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ మధ్యనే కరోనా సమయంలో కరీంనగర్‌లో అనాథలకు నట శిక్షణా శిబిరం నెలరోజులపాటు నిర్వహించింది. ‘అమ్మ అవని’ అనే నాటకాన్ని తయారుచేసి కరీంనగర్‌, హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఇది రసరంజని ఓ ప్రయోగం. కథానాటక సప్తాహం శీర్షికన 1997 మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు గురజాడ- దిద్దుబాటు, శ్రీపాద – కలుపుమొక్కలు, బాలగంగాధర్‌తిలక్‌ – దేవుడ్ని చూసినవాడు, కాళీపట్నం రామారావు – చావు, డాక్టర్‌ కేశవరెడ్డి – ఊరి చివరి గుడిసె, రావిశాస్త్రి – సారాంశం, త్రిపురనేని గోపీచంద్‌ – పతితులు, కథలని, నాటకీకరించి నాటక రంగప్రముఖ దర్శకుల దర్శకత్వంలో ప్రదర్శించారు. ఇది రస రంజని చేసిన మరో ప్రయోగం.

కథా నాటక శరన్నవరాత్రులు పేరిట 1998 సెప్టెంబర్‌ 21 నుంచి 29 వరకు పాతతరం కథకుల నుంచి, కొత్త కథకుల వరకు వారు రాసిన కథలను, నాటకీకరించి ప్రదర్శించారు. వాటిలో చలం ‘త్యాగం’, శ్రీపాద ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, గోపీచంద్‌ ‘కార్యశూరుడు’, ‘అసమర్ధుని జీవితయాత్ర’, భూపాల్‌ ‘అంబల్లబండ’ మొదలైనవి ఉన్నాయి. అలాగే ‘ఈ తరం ప్రేక్షకులకు కిందటితరం నాటకాలు’ శీర్షికన జూన్‌ 20, 2005 నుంచి 26వ తేదీ వరకు సప్తాహం నిర్వహించింది. ఈ వారం రోజుల్లో సుంకర సత్యనారాయణ ‘మా భూమి’, ‘పల్లెపడుచు’, డి.వి.నరస రాజు ‘నాటకం’, ఆత్రేయ ‘భయం’, భమిడిపాటి రాధాకృష్ణ ‘కీర్తిశేషులు’ మొదలైన నాటకాలు ప్రదర్శించబడ్డాయి.

అలాగే జాతీయ నాటకోత్సవాల సందర్భంగా 22.7.2007 నుంచి అదేనెల 28 వరకు వారం రోజుల పాటు, జాతీయ హిందీ నాటకోత్సవాలు నాలుగు రోజుల పాటు ఏప్రిల్‌ 1, 2001 నుంచి జరిగాయి. ఈ కార్యక్రమంలో హిందీ నాటకాలు ప్రసిద్ధ రచయితలచే, దర్శకులచే ప్రదర్శించబడ్డాయి. ఇలా ఎంతో వైవిధ్యమైన కార్యక్రమాలతో, నాటకాలతో రసరంజని తన ప్రత్యేకతను నిలుపుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరొక ప్రత్యేకమైన కార్యక్రమానికి తన వంతు కృషిగా సురభి సమాజాల వారికి రెండు నెలలపాటు వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ శిక్షణా శిబిరంలో సురభి కళాకారులు తరతరాలుగా వస్తున్న తమ పద్ధతులకు భిన్నంగా, రాగాలాపనలకు భిన్నంగా, నూతన పోకడలను, ధోరణులను ఆకళింపుచేసుకుని, తదనుగుణంగా కొత్త కొత్త ధోరణులతో మరింత మెరుగైన పద్ధతులతో ప్రదర్శనలు ఇవ్వటానికి వీలుగా వారికి శిక్షణ ఇస్తుంది.

ఈ నట శిక్షణా శిబిరానికి దర్శకులుగా, ప్రఖ్యాత రంగ స్థల ప్రయోక్త, దర్శకులు, రచయిత బి.వి.కారంత్‌ గారిని నియమించుకుని వారి సహకారంతో బస్తీ దేవత యాదమ్మ, చండీప్రియ వంటి నాటకాలు వెలికితీసి, శిక్షణ ఇచ్చి ఎంతో మంది సురభి కళాకారులచే రసరంజని వేదికమీద ప్రదర్శనలివ్వడం జరిగింది. ఇది రసరంజని కిరీటంలో మరో మరకతం, విశిష్టమైన ఒక కార్యక్రమం.
ఈరోజుకు కూడా రసరంజని ప్రతినెలా నియమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ సంస్థ సభ్యులచే కానీ, ఇతరులచేత కానీ తగిన ఆర్థిక వనరులు అందజేస్తూ నాటక ప్రదర్శనలు నిరంతరంగా సాగిస్తూనే ఉంది. అంతేకాక ప్రతి ఏడాది గరిమెళ్ల రామ్మూర్తి జయంతి వేడుకలు (జులై 1న), చాట్ల వారి జయంతి వేడుకలు (డిసెంబర్‌ 5న)నిర్వహిస్తూ, నాటక రంగానికి సంబంధించి వివిధ శాఖల్లో కషిచేస్తున్న వ్యక్తులకు అవార్డుల ప్రదానంతోపాటు, నగదు బహుమతి కూడా ఇవ్వటం జరుగుతోంది. ప్రతి ఏడాది వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహించి నాటకాలు ప్రదర్శిస్తున్నారు.

కొత్త నాటక రచయితలకు, నాటకాలకు, సమాజాలకు ‘రసరంజని’ అంటే ఒక ధీమా. ప్రదర్శన తప్పనిసరిగా ఇవ్వగలం అనే నమ్మకం. అలాగే వివిధ నాటక సమాజాల వారిని ఆహ్వానించి నాటకాలు ప్రదర్శింపజేసే స్థాయి నుంచి రసరంజనిలో నాటకం వేస్తే చాలు అనే గుర్తింపు తెచ్చుకునే స్థాయి వరకూ రసరంజని ప్రయాణం సాగింది. 33 ఏండ్లుగా నాటకం రంగంపై మక్కువతో దాని కోసం పాటుపడే సభ్యుల నిర్విరామకృషితో, తన కోసం నాటక రంగ స్వయంపోషకం కావడానికి, అభివృద్ధికి, కొన్ని గమ్యాలు ఏర్పర్చుకుని, గమ్యం చేరే మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించుకుంటూ రసరంజని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

తెలంగాణ పూర్వ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కె.వి.రమణాచారి గారి నేతృత్వంలో డి.రామకోటేశ్వరరావు, డాక్టర్‌ డి.విజయభాస్కర్‌, డాక్టర్‌ కోట్ల హనుమంతరావు, కె.నటరాజ్‌, మోహన్‌ సేనాపతి, తంగిరాల అరుణ కుమార్‌, నారాయణ స్వామి, రామ శాస్త్రి, వెంపటి రాధాకృష్ణ, పుండరీక శర్మ, కెకె రెడ్డి కార్యనిర్వాహకవర్గంగా అశేష ప్రేక్షకులు, నాటకాభిమానుల ఆదరణతో ముఖ్యంగా టిక్కెట్టుకొని నాటకం చూసే వదాన్యుల సహకారంతో ‘రసరంజని’ నాటకరంగ వికాసానికి తన వంతు కృషిచేస్తూనే ఉంటుంది.
‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’

  • టి.అరుణ్‌ కుమార్‌,
  • డి.రామ కోటేశ్వరరావు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -