రూ.12,500 కోట్ల పెట్టుబడికి ఒప్పందం
12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, మన రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2026 సదస్సులో భాగంగా దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిన మంత్రి శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ విభిన్న పరిశ్రమలతో బలమైన పారిశ్రామిక వ్యవస్థగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయాలతోపాటు బొగ్గు సరఫరా లింకేజీలను కూడా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ బృందంతో భేటీ అయ్యారు. తాము ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్, లేబర్-ఇంటెన్సివ్ తయారీ విధానంతో పనిచేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ సంజిబ్ కుమార్ చెప్పారు. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంపై కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. రష్మీ గ్రూపు ఆసియాలోని 40 దేశాలతోపాటు యూరప్, ఆఫ్రికా, ఉత్తర,దక్షిణ అమెరికా దేశాల్లో కూడా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణ…
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్… తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్‌ను మరింతగా విస్తరించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఈ కంపెనీ సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆ సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
టాటా చైర్మెన్‌తో సీఎం భేటి…
మరోవైపు టాటా చైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ విజన్ -2047 లక్ష్యాలు, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను ఆయన వివరించారు. హైదరాబాద్‌లో స్టేడియాల అభివృద్ధికి సహకరించాలంటూ కోరారు. ఇందుకు చంద్రశేఖరన్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యం పంచుకునేందుకు కూడా ఆయన ఆసక్తి చూపారు. తెలంగాణలో హోటళ్లు, రిసార్టులతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాట్లపై కూడా చర్చలు వారిరువురూ చర్చలు జరిపారు.
సిస్కో ప్రతినిధుల ప్రశంసలు…
తెలంగాణలో టాస్క్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం పట్ల సిస్కో ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. సిస్కో సీనియర్ అధికారి గై డీడ్రిచ్ మాట్లాడుతూ… 2025 మార్చిలో టాస్క్, స్కిల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందాల తర్వాత ఆశించిన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రారంభింటాన్ని ఆయన స్వాగతించారు.
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’
సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో దావోస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ‘భారత్-స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం-రెండు రాష్ట్రాల మధ్య సహకారం’పై వారు చర్చించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఈ భేటీలో ప్రతిపాదించగా, స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది.
ఆ రెండు జిల్లాల్లో పెట్టుబడులు పెట్టండి.. : సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దావోస్‌లో నిర్వహిస్తున్న డబ్ల్యూఈఎఫ్ వేదిక నుంచి ఆయన మాట్లాడుతూ…క్యూర్, ప్యూర్, రేర్ గురించి విశదీకరించారు. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆ రెండు జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అత్యధిక ప్రోత్సాహకాలను అందిస్తామని హామీనిచ్చారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పెట్టుబడులతో తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలకు పరికరాల తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రష్మి గ్రూప్ ఎంవోయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



