Magazines

‌విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు

52 నిమిషాల క్రితం

electricity charges
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను ప్రభుత్వమే భరించాలి
లేదంటే మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం
సీపీఐ(ఎం), సీపీఐ కలిసి రావాలి : మాజీమంత్రి హరీశ్‌‌రావు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
విద్యుత్‌ ‌చార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. దసరా, దీపావళి పండగల వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం, విద్యుత్ బిల్లులు పెంచి, భారాలు మోపి పిడుగు వేయొద్దని కోరారు. కరెంటు బిల్లులను పెంచితే మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్‌ ‌చార్జీలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), సీపీఐ ఉద్యమించాయని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్‌‌రెడ్డి కూడా చంద్రబాబు తరహా లోనే విద్యుత్‌ ‌చార్జీలను పెంచే ఆలోచన చేస్తున్నారనీ, దానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ‌చేపట్టే ఉద్యమంలో సీపీఐ(ఎం), సీపీఐ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.మంగళవారం హైరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు పడే పరిస్థితి ఉందని చెప్పారు. ట్రూ-అప్‌ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్దమైందని విమర్శించారు. రూ.5,420 కోట్లు ప్రజలపై భారాలు మోపాలనుకోవడం దుర్మార్గమైన నిర్ణయమని విమర్శించారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేశారు.


అనేక ఇబ్బందుల్లో ప్రజలు
ఎల్‌నినో, ధరల పెరుగుదల, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ ‌చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేశారు. పరిపాలన చాతగాక ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చేతులెత్తేశారని హరీశ్‌‌రావు విమర్శించారు. దీంతో విద్యుత్‌ ‌రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. భారం మాత్రం ప్రజలపై వేస్తున్నారని అన్నారు. 2016-17 నుంచి 2021-22 వరకు ట్రూ-అప్‌ చార్జీలు రూ.12,718.40 కోట్లు ప్రజలపై భారాలు వేయాలని ఈఆర్సీ చెప్పినా వినియోగదారులపై మోపేందుకు కేసీఆర్ అనుమతించలేదని గుర్తు చేశారు.


ఇది ప్రజాపాలన కాదు... ప్రజా పీడన
ఇది ప్రజాపాలన కాదనీ, ప్రజా పీడన అని హరీశ్‌‌రావు విమర్శించారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి రూ.91 వేల కోట్లు ఖర్చు చేసి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలను అభివృద్ది చేసిందని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌చ్చాక విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ​కరోనా, ఎల్‌‌నినో కంటే కాంగ్రెస్‌ ‌ప్రమాదం కరోనా, ఎల్‌నినో కంటే కాంగ్రెస్ ప్రమాదకరమని హరీశ్‌‌రావు అన్నారు. అవకాశం ఉండి నీళ్లీవ్వడం లేదనీ, కరెంట్ ఉత్పత్తి చేయడం లేదని చెప్పారు. ఆరు గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితి వచ్చిందన్నారు. పాలన వైఫల్యాన్ని, చాతగాని తనాన్ని ఎల్‌నినో పేరు చెప్పి, కుంటి సాకులు చెప్పి ‌ప్రభుత్వం తప్పించుకుంటున్నదని అన్నారు. ఎల్‌నినోకు బొగ్గు ఉత్పత్తికి కారణమేంటని ప్రశ్నించారు. సింగరేణిలో బొగ్గు ఉన్నా థర్మల్ పవర్‌‌ కేంద్రాలకు సరఫరా చేయలేని పరిస్థితి ఉందన్నారు. పాలన కంటే ప్రతిపక్షాల మీద బురద జల్లడం మీద సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. కరెంటు కోతలతో పాత రోజులు తెచ్చారని అన్నారు. గతంలో చంద్రబాబుకు షాక్‌ ఇచ్చారనీ, ఇప్పుడు విద్యుత్‌ ‌చార్జీలను పెంచితే రేవంత్‌‌రెడ్డికీ షాక్‌ తప్పదని హెచ్చరించారు. విద్యుత్‌ ‌రంగ ప్రయివేటీకరణను రాహుల్‌ అడ్డుకోవాలి విద్యుత్‌ ‌రంగ ప్రయివేటీకరణను రాహుల్‌‌గాంధీ అడ్డుకోవాలని హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. తొలుత ట్రాన్స్‌కో, తర్వాత జెన్‌‌కో, డిస్కంలను ప్రయివేటుపరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయొద్దని రాహుల్‌గాంధీ అంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యుత్‌ ‌రంగాన్ని ప్రయివేటుపరం చేయడంపై స్పందించాలని కోరారు.


​బషీర్‌‌బాగ్‌ ఉద్యమం కాల్పుల దాకా వెళ్లింది
26 ఏండ్ల క్రితం చంద్రబాబు అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచినందుకు బషీర్‌బాగ్ ఉద్యమం కాల్పులదాకా వెళ్లిందని ‌హరీశ్‌‌రావు గుర్తు చేశారు. నాడు విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేసిన సీపీఐ(ఎం), సీపీఐ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాల్లో భాగం కావొద్దని కోరారు. బీఆర్ఎస్ చేసే పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా పోరాటానికి సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, కాలేరు వెంకటేశ్‌, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్‌ ‌బిగాల, నాయకులు జి దేవీప్రసాద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్