Magazines

సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

1 గంట క్రితం

for militant struggles.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

ఉద్యోగ, కార్మిక హక్కులను
కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం

ఈ నెల 25, 26 తేదీల్లో 
మహాధర్నా : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌విమర్శించారు. గురువారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, ఉద్యోగ, కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికులను , యజమానులకు బానిసలుగా మార్చిందని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచకుండా, కార్మికుల శ్రమను దోచుకోడానికి పెట్టుబడిదారులకు స్వేచ్చనిచ్చిందని విమర్శిం చారు. కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్నదనీ, ఇది అప్రజా స్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు. కార్మిక ఉద్యమాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కలు, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు.

2023ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పీఆర్‌‌సీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్, స్కీమ్ వర్కర్ల, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి విఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్స్, బీడీ, ట్రాన్స్‌పోర్ట్, భవన నిర్మాణం, హమాలీ, ఆర్‌టీసీ, సింగరేణి, విద్యుత్, గ్రామ పంచాయితీ, మున్సిపల్ రంగాల వారికి జీతభత్యాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకొచ్చి రెండున్నరేండ్లు దాటినా హామీల అమలుకు పూనుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో “ఈ నెల 25, 26 తేదీల్లో మల్టీపుల్ డేస్ మహాధర్నా”ను ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో స్టేట్ ఫిక్స్‌డ్ టర్మ్, నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె. మల్లిఖార్జున్, కూర పాటి రమేష్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్, తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లా‌యీస్‌ ‌యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. ఈశ్వర్‌రావు, అంగన్‌వాడీ ‌యూనియన్ ప్రధాన కార్య దర్శి పి. జయలక్ష్మి, మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఎంప్లాయీస్‌ వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షులు ఎం. పద్మశ్రీ, పబ్లిక్, ప్రయివేట్‌ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ‌యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, తెలంగా ణ గ్రామ పంచాయితీ ఎంప్లా‌యీస్‌ వర్కర్స్ ‌యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూ రిటీ గార్డ్స్‌ ‌యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, ‌సీఐటీ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత, రొయ్యల రాజులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్