అయినా కోతల్లేవ్.. :
డిప్యూటీ సీఎం భట్టి
పులిచింతలలో 70శాతం తగ్గిన ఉత్పత్తి :
భారీ నీటి పారుదలశాఖ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -చింతలపాలెం
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడంతో 8 వేల మెగావాట్ల అదనపు భారం అయినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతోపాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు.
వర్షాభావ పరిస్థితులతో నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తంగా 8 వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఉన్న నీటిని మనుషులు, పశువులు, పక్షుల తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న జెన్‌కో సిబ్బందికి అభినందనలు తెలిపారు. సామాజిక అభివృద్ధి (సిఎస్ఆర్ ఫండ్స్) ప్రాజెక్ట్ పరిధిలోని మండలాల్లో ఉన్న గ్రామాల్లో సామాజిక న్యాయం, అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్స్ మంజూరు చేసేందుకు డిప్యూటీ సీఎం అంగీకారం తెలిపారు.
భూనిర్వాసిత రైతులకు ఉద్యోగాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని భారీ నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీనిచ్చారు. పులించింతల ప్రాజెక్ట్ 120 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉందని, సాధారణంగా ప్రతి సంవత్సరమూ సుమారు 4,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పత్తి 70శాతం వరకు తగ్గిందని వివరించారు. గతంలో పలు కారణాల వల్ల తొలగించిన కాంట్రాక్ట్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, వారిని పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు.
మునగాలలో కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన
మునగాల మండలం యస్ ఎం పేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. 1,020 పాఠశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు పరిశుభ్రమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందించేందుకు ఈ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ అందించే పథకానికి సంబంధించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ కార్యక్రమం చేపట్టామని చెప్పారు.అదేవిధంగా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో 200కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం, మంత్రి పరిశీలించారు. వారి వెంట కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, ఎస్పీ నరసింహ, పులిచింతల జెన్కో ఎస్ఈ దేశ్య నాయక్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.







కామెంట్‌లు (0)