Magazines

పత్తి రైతుకు గుబులు

50 నిమిషాల క్రితం

cotton farmers
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

సీసీఐ కేంద్రాల కోసం ఎదురుచూపులు

రాష్ట్రవ్యాప్తంగా 49 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..వర్షాభావంతో దిగుబడిపై ఆందోళన
25 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా..కొనుగోలు కేంద్రాల పూర్తి వివరాలపై స్పష్టత కరువు


నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌‌నినో ప్రభావం ఈసారి పంటల దిగుబడులపై తీవ్రంగా ఉంది. వర్షాభావంతోపంట దిగుబడిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. దానికి తోడు ఇప్పుడు మార్కెట్‌ భయం కూడా వెంటాడుతోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, జిన్నింగ్ మిల్లుల కేటాయింపు, కొనుగోలు ప్రారంభ తేదీపై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. పంటను నిల్వ చేసుకునే స్థోమత లేని రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తే మద్దతు ధర కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 25 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ప్రభుత్వం ఈ ఏడాది 133కి పైగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8,13,444 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్టు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ జిల్లాలోనే పత్తి సాగు విస్తీర్ణం భారీగా ఉంది.


పంటపై వర్షాభావ ప్రభావం
ఈ ఏడాది తొలకరి వర్షాల తర్వాత రైతులు పత్తి విత్తనాలు వేశారు. ఆ తర్వాత చాలారోజులు వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మొక్కల ఎదుగుదల మందగించింది. రైతులు ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడి పెట్టినప్పటికీ పంట చేతికందకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబరు చివరి నాటికి నల్లగొండలో వర్షపాతం లోటు సుమారు 57 శాతంగా నమోదైంది.


17 సీసీఐ కేంద్రాలు ప్రతిపాదన
2026-27 పత్తి కొనుగోలు సీజన్ కోసం ఉమ్మడి నల్లగొండ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో 17 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 9 కేంద్రాల్లో చిట్యాల, చండూరు, మాల్-ఏ, మాల్-బి మల్లేపల్లి-ఏ, మల్లేపల్లి-బి, నకిరేకల్, నల్లగొండ, శాలిగౌరారం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, వలిగొండ, భువనగిరి. సూర్యాపేట జిల్లాలలోని మూడు కేంద్రాల్లో హుజూర్‌నగర్, సూర్యాపేట, తిరుమలగిరి ఉన్నాయి.


రైతుకు కావాల్సింది భరోసా
పత్తి రైతుకు కనీసం మార్కెట్‌లో మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీసీఐ కేంద్రాలను ఆలస్యం లేకుండా ప్రారంభించి.. ప్రతి కేంద్రానికీ జిన్నింగ్ మిల్లును ముందుగానే ప్రకటించాలి. గ్రామాల వారీగా కేంద్రాలను అనుసంధానం చేయాలి. పత్తి సాగుతో ఇప్పటికే వాతావరణ నష్టాన్ని భరిస్తున్న రైతుకు మార్కెట్‌ నష్టమూ తోడు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.


దసరా తర్వాత కేంద్రాలను ప్రారంభిస్తాం : జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు జరిగాయి. మరొక సమావేశం త్వరలోనే నిర్వహించి కేంద్రాల ప్రారంభంపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందిస్తాం. దసరా తర్వాత కేంద్రాలను ప్రారంభిస్తాం.


కేంద్రాలు ఆలస్యమైతే రైతుకే నష్టం

పత్తి ఏరడం ప్రారంభమైన సమయంలో సీసీఐ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోతే రైతులు పత్తిని ఇండ్ల వద్ద నిల్వ చేసుకోవాల్సి వస్తుంది. నిల్వ సౌకర్యం లేని చిన్న, సన్నకారు రైతులు పంటను వెంటనే అమ్ముకోవడానికి సిద్ధమవుతారు. ఇదే సమయంలో గ్రామాల్లో ప్రయివేటు వ్యాపారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దూరంలోని కేంద్రాలకు పత్తిని తరలించాల్సి వస్తే రవాణా, కూలీ ఖర్చులు కూడా రైతుపైనే పడతాయి. పంట మార్కెట్‌కు వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా తేమశాతం, రంగుమారిందనే నెపంతో తక్కువ ధరకు కొనేందుకు దళారులు సిద్ధమవుతున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్