Magazines

‌హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా పి శ్యామ్‌ కోశీ

1 గంట క్రితం

High Court
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

సుప్రీం న్యాయమూర్తిగా అపరేశ్‌ కుమార్‌‌ సింగ్‌
రాష్ట్రపతి ఆమోదం..కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ పి శ్యామ్‌ కోశీ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 223 ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు నియామక ఉత్తర్వులు అత్యవసరంగా వెలువడటంతో ఆయన దిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అయన్ను తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ శ్యామ్‌ కోశీ 1967 ఏప్రిల్‌ 30న పుట్టారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూలై 27న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. సీనియార్టీ ప్రకారం న్యాయమూర్తుల్లో సీజే తర్వాత స్థానంలో ఉన్నారు. చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు రాష్ట్రపతి ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఆయనతోపాటు గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 2012లో జార్ఖండ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు సీజేగా వచ్చారు. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తి అయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్