సర్ పేరుతో లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్,
బీఆర్‌ఎస్ డైవర్షన్ రాజకీయం
ఖమ్మంలో మీట్ ది ప్రెస్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ
సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేవలం రాజకీయాధికారం కోసమే కాకుండా, భారతీయ సమాజ స్వరూపాన్నే మార్చే దుర్మార్గమైన సిద్ధాంతపరమైన కుట్రలకు పాల్పడుతున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను సమానంగా మోసం చేస్తున్నాయని విమర్శించారు. సోమవారం ఖమ్మంలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేండ్ల్లకోసారి ఓటు వేసి శాసించే హక్కు ఇవ్వడం మాత్రమే కాదని, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు.. ప్రజల నిత్య జీవిత అవసరాలకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య హక్కులపై దాడి
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్వయంప్రతి పత్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని తమ్మినేని అన్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామిగా ఉన్న ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తొలగించి, ప్రధాని, ఆయన సూచించిన కేంద్ర మంత్రితో కమిటీని ఏర్పాటు
(మొదటి పేజీ తరువాయి) చేయడం నిష్పాక్షికతను దెబ్బతీయడమేనని తెలిపారు. లక్షల ఓట్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తాతల కాలం నాటి పత్రాలు, సంక్లిష్టమైన వివరాలు అడగటం ద్వారా సాధారణ పేదలు, నిరక్ష్యరాస్యులు తమ ఓటు హక్కును కోల్పోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వారి ఓట్లను తొలగించే కుట్రలు సాగుతున్నాయని హెచ్చరించారు. ఓట్లు కొనడం, ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించడం వంటి చర్యలు విఫలమయ్యాకే ఎస్‌ఐఆర్ వంటి ప్రక్రియను తెరపైకి తెచ్చారని విమర్శించారు. సమాజంలో ప్రశ్నించే గొంతులను ‘దిమాగీ నక్సల్స్’ అని ముద్రవేస్తూ అణచివేస్తున్నారని, గతంలో సాగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం, పౌరసత్వ హక్కుల ఉద్యమం (షాహీన్ బాగ్) కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కు తగ్గించి దేశానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని గుర్తుచేశారు. ఎలక్షన్ కమిషనర్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమాలకు తలొగ్గి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ పరిణామాలు -
కేంద్ర ప్రభుత్వ ద్విముఖ వైఖరి
ప్రపంచ రాజకీయాల్లో 21వ శతాబ్దంలో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తోందని తమ్మినేని అన్నారు. ఇరాన్ దాడులతో అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతింటున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలను ఖాళీ చేయాలనే డిమాండ్ బలపడుతోందన్నారు. ఒకవేళ ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం విస్తరిస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి, పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరతతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత బలహీనపడిన వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఈ అంతర్జాతీయ పరిణామాలు కొత్త ఊపిరి పోస్తాయని అన్నారు. భారత ప్రధాని మోడీ విదేశాంగ విధానంలో ద్విముఖ వైఖరి అవలంబిస్తున్నారని, ఒకవైపు క్వాడ్ కూటమిలో అమెరికాకు మద్దతు ఇస్తూనే, మరోవైపు బ్రిక్స్, ఎస్‌సీఓలో చైనా, రష్యాతో వేదికలు పంచుకోవడం ఆయన అసమగ్ర విధానానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని తమ్మినేని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ. 2500, కల్యాణ లక్ష్మి బంగారం, రైతు భరోసా వంటి వాగ్దానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అధికార, ప్రతిపక్ష నాయకులు దిగజారిన భాషతో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలా మాట్లాడటం మాని, తన వద్ద ఉన్న అధికారంతో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లు, అక్రమ భూములు లేదా తన సోదరుల భూకబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష చర్యలు చేపడితే వామపక్షాలుగా తాము కూడా ఆ పోరాటంలో భాగస్వాములవుతామని, కానీ కేవలం ప్రకటనలకే పరిమితం కావడం సరికాదన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ కూడా ప్రజాసమస్యలపై వీధుల్లోకి వచ్చి పోరాడకుండా కేవలం ప్రెస్ మీట్‌లకు, నాయకుల ప్రకటనలకే పరిమితమవుతోందని విమర్శించారు. ప్రతి రాజకీయ పార్టీలోనూ అవినీతి ఒక వ్యవస్థాగతమైన సమస్యగా మారిందని, ఆర్థిక పరిమితులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రజలకు నిజాయితీగా వివరించాలని సూచించారు.
కమ్యూనిస్టుల పాత్ర - పొత్తులు, వామపక్ష ఐక్యత
ఎన్నికల్లో గెలుపోటములు, పొత్తులతోనే కమ్యూనిస్టుల బలాన్ని అంచనా వేయలేమని, ప్రజా క్షేత్రంలో నిరంతరం చేసే పోరాటాలే తమ అసలైన బలమని తమ్మినేని స్పష్టం చేశారు. నేటి ఎన్నికల్లో ధనబలం, మద్యం ప్రవాహం పెరిగిపోయాయని, బూర్జువా పార్టీలతో సమానంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి పేద ప్రజలకు, ఉద్యమ పార్టీలకు లేకపోవడం వల్లే ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలత ఎదురవుతోందన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు సందర్భంగా కేవలం పాలేరు సీటు కోసమే పట్టుబట్టి పొత్తు చెడగొట్టుకోలేదని, పాలేరుతో పాటు వైరా, మిర్యాలగూడ వంటి స్థానాలపై సుదీర్ఘ చర్చలు జరిగినా అవగాహన కుదరకపోవడం వల్లే విడివిడిగా పోటీ చేశామని వివరించారు. సీపీఐ(ఎం), సీపీఐ విలీనం కేవలం భావోద్వేగాల అంశం కాదని, సిద్ధాంతపరమైన స్పష్టత అవసరమని తెలిపారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం పాదయాత్ర, భూపోరాటాలు, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల సాధన ఉద్యమం, గోదావరి జలాల సాధన కోసం సీపీఐ(ఎం) చేసిన సుదీర్ఘ పోరాటాలే జిల్లా రూపురేఖలను మార్చాయని గుర్తుచేశారు. భద్రాచలం వంటి స్థానాల్లో కమ్యూనిస్టులు ఏడుసార్లు గెలిచిన ఘన చరిత్ర ఉందని, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సందర్బంగా జర్నలిస్టులు, తమ్మినేని వీరభద్రంను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ మీట్ ది ప్రెస్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, ఐజేయూ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.రాంనారాయణ, జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)