14 లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్
జిల్లాకు ఇద్దరు మంత్రులున్నా సోయిలే
దు
వాళ్లు నీళ్లు తాగుతున్నారా? క్వార్టర్లు తాగుతున్నారా?
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం :
మిర్యాలగూడలో రైతు ధర్నా అనంతరం సభలో కేటీఆర్
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టుకు ఈనెల 14 వరకు నీటి విడుదలపై షెడ్యూల్ విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోదాడ నుంచి నాగార్జునసాగర్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడ్తానని తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘రైతు ధర్నా’ సందర్భంగా స్థానిక ఫ్లైఓవర్ నుంచి ఎన్ఎసీపీ క్యాంపు గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వెయ్యి పడగల పాములాగా పరిపాలన సాగిందని విమర్శించారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నపూర్ణగా, ధాన్యాగారంగా పేరుగాంచిందన్నారు. అందులో నలగొండ జిల్లా వరి పంటను పండించడంలో ప్రధానమైనదని తెలిపారు.
సాగర్ లో నీళ్లు ఉన్నప్పటికీ విడుదల విషయంలో జిల్లాలోని ఇద్దరు మంత్రులు దోబూచులాడుతున్నారని, వారికి రైతుల పట్ల సోయిలేదని విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు చేయకపోవడం రైతుల్ని మోసగించడమేనని ఆరోపించారు. సన్న ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్, మద్దతు ధర వచ్చేలా చూస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 575 అడుగుల వరకు నీరు ఉందని, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రులు నీళ్లు తాగుతున్నారో లేక క్వార్టర్లు తాగుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సాగర్ నీటి కోసం 2003లో పాదయాత్ర చేసి పోరాటాలకు బాటలు వేశారన్నారు.
అదే క్రమంలో రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రాలో పోతిరెడ్డిపాడుకు, వెలిగొండ ప్రాజెక్టులకు యథేచ్ఛగా నీరు వెళ్తున్నా సీఎం మెదలకపోవడానికి కారణం.. ఓటుకు నోటు కేసును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెలికి తీస్తారన్న భయం ఆయనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, గాదరి కిషోర్ కుమార్, విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్ యువ నాయకులు సిద్దు, రంగారెడ్డి, నాగార్జునాచారి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)