ఫ్యూచర్ సిటీ విస్తరణకు పక్కా ప్రణాళిక
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గ్లోబల్ సమ్మిట్
రూ.200 కోట్లతో ఎన్‌ఐయూఎం క్యాంపస్ నిర్మాణం
రెండేండ్లలో పూర్తి చేస్తాం : భారత్ ఫ్యూచర్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ –
రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/బ్యూరో
రాష్ర్టంలో పారిశ్రామికాభివృద్ధికి శాంతిభద్ర తలే ప్రధాన కారణమని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో కూడిన ప్రభుత్వ విధాన నిర్ణయాలు, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థలు బాగుంటేనే ప్రపంచ పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని చెప్పారు. డిసెంబర్‌లో నిర్వహించే తెలంగాణ ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు హాజరవు తున్నారని వివరించారు. దానిలో భాగంగానే రాష్ర్టంలో ఆధునిక పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) నూతన ప్రాంగణం రూపుదిద్దుకోనుందని, సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తామని వివరించారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో ఎన్‌ఐయూఎం ప్రాంగణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, వేగవంతమైన పోలీసు సేవలు అందించడమే కమిషనరేట్ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ ఆధారాల విశ్లేషణ, మహిళల భద్రత వంటి అంశాలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ఇప్పటికే 210 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఏఐ ఛాంపియన్స్ శిక్షణ పూర్తి చేశారని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాంత విస్తరణకు అనుగుణంగా పోలీసు జోన్లు, డివిజన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం జరిగిన మరో సభలో సీఎం మాట్లాడుతూ ఎన్‌ఐయూఎం ప్రాంగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించిందని తెలిపారు. 2028 జూన్ 2 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద 2009లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీ ప్రక్రియ ద్వారా ఈ సంస్థ ఎంపికైందని గుర్తుచేశారు.
అదే ఏడాది డిసెంబర్ 30న జరిగిన కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ 75వ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలనే షరతుతో రూ.50 కోట్ల కేంద్ర సహాయానికి హామీ లభించిందన్నారు. భూకేటాయింపు జరగక పోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమిని కేటాయించడంతో నిర్మాణ ప్రక్రియకు మార్గం సుగమ మైందన్నారు. నూతన ప్రాంగణాన్ని పర్యావరణహితంగా, నెట్‌జీరో లక్ష్యంతో నిర్మించనున్నట్టు తెలిపారు. నాలుగు ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థల నుంచి ఎంపికైన సంజయ్ పూరీ ఆర్కిటెక్ట్స్ దీనికి రూపకల్పన చేసిందని తెలిపారు. భవనాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు, నీటిని వేడి చేసేందుకు సౌరశక్తి వినియోగం, ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నారన్నారు.
ఆరు పరిశోధనా కేంద్రాలు
ఈ ప్రాంగణంలో పట్టణ పాలన, ఆర్థిక వనరుల సమీకరణ, పట్టణ మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్), పట్టణ రవాణా, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు, అనుకూలన వంటి అంశాలపై పరిశోధనలు చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. నూతన ఆలోచనలను ప్రోత్సహిం చేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సామర్థ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణార్థులు, పరిశోధకులు, సందర్శక నిపుణుల వసతి కోసం 122 నివాస యూనిట్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర
2013 జూలై 29న స్థాపించిన ఎన్‌ఐయూఎం తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పన, కార్యాచరణ ఆధారిత పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం అన్నారు. ఇప్పటివరకు 6,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ అందించింద న్నారు. 54 పట్టణ స్థానిక సంస్థలకు జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్లు, 57 పట్టణ స్థానిక సంస్థలకు ఘన వ్యర్థాల నిర్వహణపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రూపొందించిందని తెలిపారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ సింగిల్ విండో భవన అనుమతుల వ్యవస్థ రూపకల్పన, నిర్వహణలోనూ భాగస్వామ్యమైందన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, 26 పట్టణ స్థానిక సంస్థల కోసం కృత్రిమ మేధ ఆధారిత సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఈ సంస్థ సహకారం అందిస్తోందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జైకా, జీఐజెడ్, యూనిసెఫ్ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పట్టణ పాలనలో పరిశోధనలు, శిక్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించనుందన్నారు.
స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో పనుల్లో వేగం పెంచాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. నిర్దేశిత గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచాలని తెలిపారు. నవంబరు నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 7 నుండి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ ఏర్పాట్లపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి సమ్మిట్ ఏర్పాట్లపై కసరత్తు చేయాలన్నారు.
దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా ఆ స్థాయిలో సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కేవలం వ్యాపార సదస్సు మాత్రమే కాదని, తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే చారిత్రక వేదికగా నిలుస్తుందని సీఎం అన్నారు. అందుకే సమ్మిట్ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఒక కమిటీని నియమించుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, డీజీ అభిలాషా బిస్త్, మహేశ్ భగవత్, జాయింట్ పోలీస్ కమిషనర్ జి. చందనా దీప్తి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)