విస్తరిస్తున్న ఎల్నినో ప్రభావం
నత్తనడకన పనులు...ఆందోళనలో కార్మికులు
వెంటాడుతున్న నీటి కొరత
పడిపోతున్న భూగర్భ
జలాలు..లోతుల్లోకి బోర్లు
ఉపాధిపై తీవ్ర ప్రభావం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని ఎల్నివో వెంటాడుతున్నది. అనేక రంగాలపై దాని ప్రభావం తీవ్రంగా చూపుతుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నా యి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో వరి పంట వేయకుండా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. రైతులకు అవగాహన కల్పిస్తున్నది. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న భవన నిర్మాణ రంగంపై కూడా ఎల్నివో ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఈ రంగంపై లాక్డౌన్ నాటి పరిస్థితులు కనబడుతున్నా యి. భవన నిర్మాణంటే ఇంటిని నిర్మించడమే కాకుండా దాదాపు 10 నుంచి 15 విభాగాలకు చెందిన నిపుణులు పని చేయాల్సి ఉంటుంది. భవనం పునాది నుంచి మొదలు పెడితే పిల్లర్లు, స్లాబులు, ఇటుకల తయారీ, ప్లాస్టరింగ్, క్యూరింగ్ ఇలాంటి ఎన్నో పనులకు నీటి అవసరం తప్పనిసరి. ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి 500 మీటర్ల నుంచి 1500- 2 వేల మీటర్ల లోతు దాకా బోర్లు వేస్తున్నారు. పెద్ద పెద్ద పంపుల ద్వారా నీటిని తోడుతున్నారు. ఆ నీటితో భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఎల్నివో ప్రభావంతో ప్రస్తుతం ఆ బోర్లు ఎండిపోతుండటంతో భవన నిర్మాణ రంగాన్ని నీటి కొరత వెంటాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగులు, అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు వంటి భారీ ప్రాజెక్టుల పనులు మందగిస్తున్నాయి. వీటిపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం నగరాల్లో కూడా నిర్మాణ పనులు మందగమనంలో ఉన్నాయి.
ఈ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఆ భవన నిర్మాణాలకు నీటి అవసరమెంత? అనే దానిపై అధికారిక లెక్కలు మాత్రం లేవు. కానీ రోజూ లక్షల లీటర్ల నీరు కచ్చితంగా అవసరం. హైరైజ్ బిల్డింగులు నిర్మించిన ప్రాంతాల్లో నీటి అవసరం ఇంకా ఎక్కువ. హైదరాబాద్లోని సంతోష్నగర్ లో ఒకహైరైజ్ (25 అంతస్తులు) నిర్మిస్తే ఆ చుట్టు పక్కల బస్తీల్లో బోర్లు ఎండిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. అబిడ్స్లోని మరో హైరైజ్ బిల్డింగ్ నిర్మాణంతో అక్కడ తమ ఇండ్లలో బోర్లు ఎండిపోయినట్టు స్థానిక గృహ యాజమానులు రోడ్లెక్కారు. లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తుండటమే దీనికి కారణం. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదారేండ్ల కింద ప్రారంభమైన 6,065 భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిపై లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. బీహార్, యూపీ, ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు.క్రమంగా నీటి కొరత పెరగడంతో నిర్మాణ పనులు నత్తడకన సాగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. ఎల్నివో ప్రభావం తీవ్రమౌతున్న కొద్దీ నిర్మాణదారులతోపాటు కార్మికుల్లోనూ ఆందోళన మొదలైంది. బోర్లు ఎండి పోయిన అపార్టుమెంట్లు, విల్లాలకు, కాలనీలకు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి కొరత తీవ్రమవుతుంటే, భవన నిర్మాణాలను నిలిపివేసే పరిస్థితులు కూడా వస్తాయని అధికారులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే కార్మికులు, వారి కుటుంబాలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోందనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం దీనికి కచ్చితంగా ప్రత్యామ్నాయం చూపాలని భవన నిర్మాణరంగ కార్మికులు, యజమానులు కోరుతున్నారు.






కామెంట్లు (0)