ఎల్‌నినోతో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా చూడాలి
అక్రమ నీటి మోటార్ల ఏరివేత
తాగునీటి అవసరాలకే బోరుబావుల తవ్వకం
నిబంధనల మేరకే అనుమతి : అధికారులకు ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశం
సీనియర్ ఐఏఎస్‌లతో వీడియోకాన్ఫరెన్స్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.ఈ ప్రణాళికలు జిల్లాతోపాటు మండల స్థాయిలోనూ ఉండాల ని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల తో సోమవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించా రు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో ఏర్పడనున్న తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవడా నికి రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల వారీగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు
జారీ చేస్తున్నామని చెప్పారు. అలాగే సూక్ష్మ స్థాయిలోనూ అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విధ్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేనప్పటికీ వ్యవసాయానికి, గృహోపయోగ అవసరాలకు అందిస్తున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ కోతలు విధించడంలేదని అన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. పగటి పూట అత్యవసర పరిస్థితుల్లో మాత్రం 25 డిగ్రీల పరిమితిలో ఏసీలను వాడాలనీ, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏసీల వాడకం పూర్తిగా తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ స్టేషన్లలో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. యాదాద్రి థర్మల్ కేంద్రంలో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి ఈ కేంద్రానికి ప్రత్యేకంగా కేటాయించిన ఐదుగురు స్పెషల్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎల్ నినో ప్రభావాన్ని తెలియచేసేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా ఉంటుందని వివరించారు. వ్యవసాయ అవసరాలకు స్థానికంగా ఉండే నీటి వనరుల నుంచి అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారని చెప్పారు.
దీనిద్వారా అధిక లోడ్ పడి స్థానికంగా ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. మంజీరా, సింగూరు ద్వారా నీటి సరఫరా లేనికారణంగా, ఈ జలాశయాల నుంచి వచ్చే 110 ఎంజీడీల నీటిని, ప్రత్యామ్నాయ మార్గాలైన మిషన్ భగీరథ నుంచి 60 ఎంజీడీలను , కృష్ణా ఇతర సోర్సులా ద్వారా నీటిని తీసుకుంటున్నామని తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో, కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నిబంధనలను అనుసరించి బోరు బావుల తవ్వకానికి అనుమతించాలని చెప్పారు. నిర్మాణ ఇతర పనులకు మాత్రం కొత్తగా బోరుబావుల తవ్వకానికి అనుమతించవద్దన్నారు. కేవలం తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బోరుబావులను మరింత లోతుగా తవ్వడానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి భారీగా నీటిని తోడే విధానంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు హైడ్రా తదితర ఏజెన్సీలతో కలసి అక్రమ నీటి మోటార్లను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
నవంబర్ ఒకటవ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో నిర్మాణ పనులకు ఎస్టీపీల ద్వారా వచ్చే ట్రీట్మెంట్ వాటర్ ను గ్రీన్ ట్యాంకర్ల ద్వారా అందచేయనున్నట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో భూ గర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోతున్నందున, తాగునీటికి ఏవిధమైన సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు.
నల్గొండ జిల్లాలో ఉపాధి హామీ పనులను మరింత ముమ్మరంగా చేస్తున్నామని ప్రత్యేక కార్యదర్శి హరిచందన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే జూన్ మాసం వరకు తాగు నీటి సమస్య లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీడీ ఎక్కా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాలికను రూపోంచదించి అమలు చేస్తున్నామని కార్యదర్శి ఇలంబర్తి చెప్పారు. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు జూన్ వరకు తాగు నీరు అందించాలంటే పాలేరు రిజర్వాయర్ లో నాలుగు టీఎంసీల మేలరకు జలాలు కావాలనీ, ప్రస్తుతం ఈ జలాశయంలో రెండు టీఎంసీలు మాత్రమే ఉన్నాయని ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)