ఈ పాపం...అధికారులదా? పాలకులదా? 4 యూనిట్ల సామర్థ్యం 3,200 మెగావాట్లు
1,600 నుంచి 2 వేల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి
ఎల్ నినో కష్ట కాలంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించడంలో విఫలమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 ప్లాంట్లు రోజుకు 3,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 1,600 నుంచి 2 వేల మెగావాట్లకు మించి ఉత్పత్తి చేయడం లేదు. కావాల్సిన బొగ్గును సేకరించడంలో విఫలం కావడం వల్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. బొగ్గు నిల్వలను సమకూర్చడంలో సర్కార్‌కు ముందస్తు ప్రణాళిక లేక పోవడం మూలంగా, అవకాశం ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. సర్కార్ నిర్లక్ష్యం రాష్ర్ట ప్రజలకు శాపంగా మారింది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం వద్ద 4వేల మెగావాట్ల సామర్థ్యంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 ప్లాంట్లను తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీజెన్కో) నిర్మించింది. ఇందులో ప్రస్తుతం నాలుగు 4 యూనిట్లు (3,200 మెగావాట్లు) అందుబాటులోకి వచ్చాయి. 5వ యూనిట్ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్లాంట్‌కు అవసరమైన నీటిని సమీపంలోని కృష్ణా నది నుండి సేకరిస్తున్నారు. కావలసిన బొగ్గును సింగరేణి సంస్థ నుండి రైల్వే కారిడార్ ద్వారా సరఫరాకు చివరి సారిగా 2022లో ఒప్పందం కుదిరింది. అయితే తగినంత బొగ్గును ఒప్పందం ప్రకారం సింగరేణి సరఫరా చేయడం లేదు. రోజుకు 40 వేల టన్నుల చొప్పున ఏడాదికి సుమారు 14 మిలియన్ టన్నుల గ్రేడ్-9 బొగ్గు అవసరం. ప్రతి రోజు 40 వేల టన్నులు అందుబాటులో ఉంటేనే అవి పూర్తి స్థాయి విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తాయి.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నాలుగు యూనిట్లు ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో 3,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రోజుకు 30 వేల టన్నుల గ్రేడ్-9 బొగ్గు అవసరం. కాని సింగరేణి ఏటా 2 లక్షల టన్నులకు మించి గ్రేడ్-9 బొగ్గు ఉత్పత్తి చేయడం లేదు. అందులోనూ పూర్తి స్థాయిలో యాదాద్రికి సరఫరా కావడం లేదు. గతంలో సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఎన్టీపీసీ, ఇతర సంస్థలకు కూడా సరఫరా చేస్తోంది. దాంతో సింగరేణిలో లభించే గ్రేడ్-12, గ్రేడ్-13తో పాటు నైనీ బొగ్గును గ్రేడ్-9 బొగ్గులో మిక్స్ చేసి వాడుతున్నారు. నిబంధనల ప్రకారం కనిష్టంగా 21 రోజులకు సరిపడే బొగ్గును థర్మల్ కేంద్రాలు నిల్వ చేసుకోవాలి. కాని ప్రస్తుతం యదాద్రిలో మూడు, నాలుగు రోజులకు సరిపోయే నిల్వలు మాత్రమే ఉంటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్లాంట్ పూర్తిగా షట్ డవున్ అయ్యే ప్రమాదం కూడా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బొగ్గు సేకరణలో సర్కార్ నిర్లక్ష్యం...
థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సేకరణలో రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యం ఉత్పత్తిపై పడింది. గత సర్కార్ పలు సందర్భాల్లో చేసిన ఒప్పందాలపై మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ సమీక్షించిన దాఖలాలు లేవు. విద్యుత్ సంక్షోభం తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో బొగ్గు కోసం యాజమాన్యం నానా తిప్పలు పడుతోంది. 2016 డిసెంబర్ 9న మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్‌టీసీ)తో సింగరేణి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటా 7 మిలియన్ టన్నుల G-9 గ్రేడ్ బొగ్గును సరఫరా చేయాలి. 2018 ఫిబ్రవరిలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ కోసం సింగరేణి గనుల నుండి ఏటా 14 మిలియన్ టన్నుల G-9 గ్రేడ్ బొగ్గును కేటాయించింది.ఇదే అంశపైనా ఏప్రిల్ 2022 ప్లాంట్ యొక్క డిజైన్ అవసరాలను తీర్చడానికి మరో ఒప్పందం కుదుర్చుకోబడింది. మూడు ఒప్పందాలు కుదిరినా ప్లాంట్‌కు సరిపడా బొగ్గును ఎన్నడూ సరఫరా చేయలేదు. అయితే సరఫరా వైఫల్యం నేపథ్యంలో సర్కార్ కొత్త బొగ్గు ఒప్పందాలపై దృష్టి పెట్టక పోవంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి.
అధికారులపై ప్రతాపం..
ఆడలేక మద్దెల ఓడినట్టు... కావాల్సిన బొగ్గులేక విద్యుత్ ఉత్పత్తి తగ్గితే అధికారులను బాధ్యులను చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ ఇంజినీర్ బి.సురేశ్ నాయక్‌ను ఈ నెల 15 విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిం చాడని తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ జెన్కో) సీఎమ్‌డీ హరీశ్ జారీ చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. బొగ్గు ఒప్పందాలు, బకాయిల చెల్లింపులు సర్కార్ ఆదేశాల మేరకే జరుగుతుంటా యని గుర్తు చేస్తున్నారు. సింగరేణి సంస్థకు జెన్కో బకాయిలు, డిస్కంలకు సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు ముడిపడి ఉందని వారు పేర్కొంటున్నారు. సర్కార్ చేసిన పొరపాట్లను, తప్పిదాలను ఉద్యోగులపై చూపించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.






కామెంట్‌లు (0)