ఫిజియోథెరపీ సెంటర్‌కు లైసెన్స్ కోసం రూ.లక్ష లంచం
మరో అధికారి హెల్త్ ఇన్‌స్పెక్టర్
శ్రీనివాస్, కార్ డ్రైవర్ కస్టడీ
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో
సుదీర్ఘంగా ఫైళ్ల తనిఖీ
నవతెలంగాణ-రంగారెడ్డి పాంత్రీయ ప్రతినిధి/
రాజేంద్రనగర్
ఫిజియోథెరపీ సెంటర్‌కు సంబంధించిన వ్యవహారంలో రూ.లక్ష లంచం తీసుకున్న కేసులో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ఓ ప్రయివేట్ డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, డీఎంహెచ్‌ఓ కార్యాలయ హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ సూచనల మేరకు వారి వద్ద ప్రయివేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దూరి కృష్ణయ్య ఫిర్యాదుదారుడిని రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.లక్ష తీసుకునేందుకు అంగీకరించాడు. సీజ్ చేసిన ఫిజియోథెరపీ సెంటర్ తాళాలను తిరిగి ఇవ్వడం, డీఎంహెచ్‌ఓ లైసెన్స్ లేకుండా కేంద్రం నిర్వహిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండటం, అలాగే కొత్త డీఎంహెచ్‌ఓ లైసెన్స్ ఇప్పించేందుకు ఈ మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసినట్టు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి తీసుకున్న రూ.1,00,000 నగదును మద్దూరి కృష్ణయ్య వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, ప్రయివేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. కాగా, కొంతకాలంగా శివరాంపల్లిలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రయివేట్ ఆస్పత్రులకు అనుమతుల విషయంలో లంచం ఇవ్వనిదే ఫైల్ ముందుకు సాగడం లేదని అనేక ఆరోపణలు రావడంతో అధికారులు పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.







కామెంట్‌లు (0)