లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా :
సింగరేణి భవన్ ముట్టడి, ధర్నాలో
కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెండు నెలల్లో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ముట్టడితో దిగొచ్చిన సింగరేణి యాజమాన్యం తరపున అధికారులు ఆమె చర్చలకు వచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రెండు నెలల్లోగా అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ప్రారంభం కావాలని కోరారు. లేకుంటే సింగరేణి గేటు ఎదుటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిని అన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇచ్చామని ఆమె గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ సర్కార్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదని ఆమె విమర్శించారు. సింగరేణి లాభాల్లో 35 శాతం కార్మికులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టటంతోనే సంస్థ ఇబ్బందుల్లో ఉందన్నారు. వెంటనే ఆ బకాయిలను చెల్లించి సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ ద్రోహుల చేతిలో బందీ అయ్యిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన సింగరేణిని మంత్రుల చేతిలో కీలుబొమ్మగా మార్చేశారని విమర్శించారు. కొత్త బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కాకుండా సింగరేణి ద్వారా నిర్వహించాలని.. నైనీ బ్లాక్ లో కూడా సింగరేణి నుంచి కార్మికులను నియమించాలని కోరారు.
రెండు నెలల్లో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
48 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)