సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్
ఎం.వేణుగోపాల్ రావు
ఉత్తర్వులు జారీ చేసిన కమిషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీజీఈఆర్సీ) 21 మందితో రాష్ట్ర సలహా కమిటీని (ఎస్ఏసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ వి.రాంచందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీఈఆర్సీ తన విధులను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి విద్యుత్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై ఈ కమిటీ కమిషన్కు సలహాలు, సూచనలు అందించనుంది. వినియోగదారులకు లభించే విద్యుత్ సరఫరా నాణ్యత, నిరంతరాయత సేవల విస్తరణను పర్యవేక్షించడం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), ఇతర లైసెన్స్ దారులు తమ నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని చూడటం. విద్యుత్ వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడటం. విద్యుత్ సంస్థల పనితీరు, సేవా ప్రమాణాలను మెరుగు పర్చడం తదితర అంశాలను సలహా కమిటీ పర్యవేక్షిస్తుంది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 87 (3) నిబంధన ప్రకారం టీజీఈఆర్సీ చైర్మెన్ సలహా కమిటీకి కూడా చైర్మెన్గా వ్యవహరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల కార్యదర్శి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కమిషన్ కార్యదర్శి సలహా కమిటీకి కూడా కార్యదర్శిగా ఉంటారు. సభ్యుల పదవీకాలం 16 అక్టోబర్ 2026 నుంచి 3 సంవత్సరాల కాలానికి ఉంటుంది. సలహా కమిటీలో సభ్యులుగా ఉన్న వారు తమ సంస్థను విడిచిపెట్టడం వలన ఏర్పడే ఖాళీని, ఆయా సంస్థల అధిపతి నామినేట్ చేసిన సభ్యునితో భర్తీ చేయబడుతుంది. ఎస్ఏసీ సమావేశాన్ని నిబంధనల ప్రకారం కమిషన్ ఏర్పాటు చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.






కామెంట్లు (0)