కేంద్రంలో బీజేపీ తెస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేయడమేంటి?
రాజీవ్ గాంధీ తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని సీఎం అమలు చేయరా?
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ప్రయివేటు బిల్లు
ఆమోదించని కేంద్రం
ఇదీ మోడీ సర్కారు తీరు : ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్షలో ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2020ను రద్దు చేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పిలుపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ అధ్యక్షతన ఉపాధ్యాయుల చేపట్టిన సామూహిక నిరాహారదీక్షను రవి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను విద్యకు దూరం చేసేలా బీజేపీ తెచ్చిన ఎన్ఈపీని ఎప్పుడూ ఆ పార్టీతో ఉప్పు-నిప్పులా ఉంటున్నట్టు వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేయడమేంటని ప్రశ్నించారు. 1986లో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తెచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం...ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దివగంత పీఎం తెచ్చిన దాన్ని కాదనీ, సైద్ధాంతికంగా కాంగ్రెస్ వ్యతిరేకించే బీజేపీ తెచ్చిన ఎన్ఈపీని అమలు చేస్తున్నారని తప్పుపట్టారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెచ్చిన ఎన్ఈపీతో విద్యారంగంలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతీకరణ పెరిగిపోతున్నదని చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతో తెచ్చుకున్న విద్యా హక్కు చట్టాన్ని పక్కన పెట్టి బీజేపీ విద్యలో అంతరాలను పెంచిందని విమర్శించారు. ఒకే దేశం ఒకే పరీక్ష పేరుతో నిర్వహించిన నీట్ పరీక్షలతో 22 లక్షల మంది విద్యార్థుల ఉసురుపోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరేండ్లలో 93 వేల స్కూళ్లను మూసేశారనీ, దీంతో 2.15 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను విడిచిపెట్టారని తెలిపారు. ఎన్ఈపీ అమలులో భాగంగా రాష్ట్రంలో జీవో 25ను తెచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెళ్తున్న దారిలోనే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని చెబుతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వం కులాల వారీగా గురుకులాలను ఏర్పాటు చేస్తే, రేవంత్ సర్కార్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక టీచర్ 18 సబ్జెక్టులను ఎలా బోధిస్తారని ఆయన ప్రశ్నించారు. 50 మంది విద్యార్థులుంటే తరగతికో టీచర్ లేదా సబ్జెక్ట్ కు ఒక టీచర్ చొప్పున ఉండాలే చూడాలని కోరారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. టెట్ తప్పనిసరి నుంచి మినహాయించేలా పార్లమెంటులో సవరణ చేయాలని కోరితే బీజేపీ ససేమిరా అంటున్నదనీ, ఈ విషయంలో సీపీఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ పార్లమెంటులో ప్రైయివేటు బిల్లు పెట్టినా ఆమోదించలేదని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ తెచ్చిన సీపీఎస్ ను రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్నదని రవి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని తెలిపారు. జీఎస్టీ కడుతున్న ఉపాధ్యాయులకు ఐటీ పేరుతో డబుల్ ట్యాక్స్ లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలనీ, ఇప్పటికే కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్షలో పని చేస్తున్న వారందరిని క్రమబద్ధీకరించాలని చావ రవి డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్స్, గురుకులాలకు 010 పద్దును అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8వ, 2వ పే కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్ కార్డులను మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో తదితరులందరికి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ధర్నాచౌక్ ఎత్తేసిన పాలకులకు పట్టిన గతే, న్యూఢిల్లీలో జంతర్ మంతర్ ఎత్తేసిన బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ పునరుద్ధరణ పోరాటంలో భాగస్వాములమవుతామని వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం చలో పార్లమెంట్ నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.
సీపీఎస్ సంఘాలు కలిసి రావాలి : ఏలూరి శ్రీనివాసరావు
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో సీపీఎస్ ప్రధానమైందనీ, దీని రద్దు కోసం సీపీఎస్ సంఘాలు ఐక్యపోరాటానికి కలిసి రావాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ సామూహిక నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన ఆయన, ఇప్పటికే 206 సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చేస్తున్న పోరాటంలో సీపీఎస్ సంఘాలు కూడా భాగం కావాలన్నారు. దసరా తర్వాత జేఏసీ సమావేశంలో పీఆర్సీ రిపోర్ట్ తెప్పించే విషయంపై చర్చించి కార్యాచరణ తీసుకుంటుందని ప్రకటించారు. ఈహెచ్ఎస్ అమలుకు ప్రత్యేక కార్యాలయం, కనీసం 40 మంది సొంత సిబ్బంది ఉంటే తప్ప పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు.
మూసివేతకే టీపీఎస్ లు : ఎ.వెంకట్
గ్రామీణ పాఠశాలలను మూసివేసేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను అందుబాటులో లేకుండా చేసి అనివార్యంగా ప్రయివేటు విద్యను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన 32 జిల్లాల్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు (యుఆర్ఎస్)లకు కనీసం తరగతి గదులు, భవనాలు లేకున్నా పట్టించునేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డమొస్తున్నాయనీ, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.200 కోట్ల నిధులెలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు సుముఖంగా లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపైనా నిధులివ్వకుండా ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.టీజీఓ ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, టాప్రా ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అజీజ్, కె. రామారావు, ఎల్ అరుణమ్మ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కాంత్, టీఎస్ యుటీఎఫ్ సీనియర్ నాయకులు పి.మాణిక్ రెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షలో టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతి కుమారి, సత్యానంద్, రంజిత్ కుమార్, రవికుమార్, శ్రీధర్, సింహాచలం, వెంకటప్ప, విశాలి, నాగేశ్వరరావు, వెంకటేశం, సోమయ్య, యాకయ్య, ఎల్లయ్య వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వందలాది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)