Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువచ్చే నెల నుంచి కొత్త 'కార్డులకు' రేషన్‌ పంపిణీ

వచ్చే నెల నుంచి కొత్త ‘కార్డులకు’ రేషన్‌ పంపిణీ

- Advertisement -

– కొత్తగా పది లక్షల రేషన్‌ కార్డులు
– మొత్తం లబ్దిదారులు 3.21 కోట్లు
– వారికి సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.17,994 కోట్లు ఆదా
– ఏటా కుటుంబానికి రూ.18వేలకు పైగా మిగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కొత్తగా జారీ అయిన రేషన్‌కార్డులకు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి సన్నబియ్యం అందించనున్నట్టు పౌరసంబంధాల శాఖ అధికారులు తెలిపారు. వాటితో పాటు రూ.50 విలువైన చేతిసంచిని కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 10 లక్షల రేషన్‌ కార్డుల్ని మంజూరు చేసింది. గతంలో 89.95 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులతో కలిపి ఈ సంఖ్య 99.97 లక్షలకు చేరింది. ప్రస్తుత లబ్దిదారుల సంఖ్య 2.81 కోట్లు కాగా, కొత్త రేషన్‌కార్డుల ద్వారా లబ్దిదారుల సంఖ్య 40 లక్షలకు పెరిగి మొత్తం లబ్దిదారుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డుదారుల్లో ఒక్కో లబ్దిదారుడికి 6 కేజీల దొడ్డు బియ్యం ఇస్తుండటం, అవి పక్కదారి పడుతుండటాన్ని సర్కారు గమనించింది. దీనితో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు సన్న బియ్యం పంపిణీని ఈ ఏడాది మార్చి చివరిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉచితంగా సన్నబియ్యం పంపిణీతో లబ్దిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కార్యక్రమంలో, మీ-సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసింది. దీంతో రేషన్‌ కార్డుల సంఖ్య, లబ్దిదారుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జులై హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. కొత్తగా 9.97 లక్షల మంది కొత్త రేషన్‌ కార్డుల ద్వారా 26 లక్షల మంది, పాతకార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల నమోదుతో 12.86 లక్షల మంది లబ్దిపొందుతున్నారు. లబ్దిదారుల సంఖ్య పెరగడంతో, గతంలో రేషన్‌ షాపులకు నెలవారీ కోటా కింద 1.68 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా, సెప్టెంబర్‌ నుంచి ఆ కోటాను 1.92 లక్షల టన్నులకు పెంచినట్టు సమాచారం. ఈ రకంగా 99.97 లక్షల కుటుంబాలకుగాను ఒక్కో కుటుంబానికి సగటున ఏటా రూ.18 వేలు చొప్పునా ఆదా కానుంది. మొత్తంగా ప్రజలు ఏటా సన్నబియ్యంపై ఖర్చు చేస్తున్న రూ.17,994 కోట్లు ఆదా కానున్నాయి.

సంచి కూడా ఫ్రీ
కార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన సంచులను కూడా అందించాలని నిర్ణ యించింది. వైట్‌ కలర్‌లో ఉన్న ఈ బ్యాగ్‌ పైన సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకాల వివరాలు ముద్రించారు. రూ.50 విలువ చేసే ఈ సంచిని బియ్యంతో పాటు ఉచితంగా అందజేయనున్నారు. ఇప్పటికే ఈ బ్యాగులు ఆయా జిల్లాలకు చేరుకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad