Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేయూ మహిళా హాస్టల్‌లో ఎలుకల వీరంగం

కేయూ మహిళా హాస్టల్‌లో ఎలుకల వీరంగం

- Advertisement -

10మందికి పైగా గాయాలు
నిద్రలేని రాత్రులు గడుపుతున్న విద్యార్థినులు
రక్షణ కల్పించకుంటే ఆందోళన చేస్తాం : విద్యార్థినులు


నవతెలంగాణ- హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) మహిళా హాస్టల్‌ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. హాస్టల్‌ గదుల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో విద్యార్థినులను ఎలుకలు కరుస్తుండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో, వారానికి సగటున పది మందికిపైగా విద్యార్థినులు ఎలుక కాటుకు గురై ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు, సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లినా నిర్లక్ష్యపు సమాధానాలు వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టల్‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. హాస్టల్‌ చుట్టూ పేరుకుపోయిన చెత్త కుప్పలు ఎలుకలకు ఆవాసంగా మారాయి.

ఎలుకలతోపాటు పాముల సంచారం కూడా పెరగడం విద్యార్థినుల ప్రాణాలకు ముప్పుగా మారింది. అలాగే, హాస్టల్‌ బయట కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో విద్యార్థినులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క హాస్టల్‌ విద్యార్థినులు మాట్లాడుతూ.. హాస్టల్‌ గదులను, పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని డిమాండ్‌ చేశారు. కిటికీలకు వెంటనే మెష్‌ డోర్లు (జాలి తలుపులు) బిగించాలని, ఎలుకలు, పాములు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌లో తగినన్ని టీటీ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్‌, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎలుకల భయానికి రాత్రిపూట నిద్రపోవడమే మానేశామని, అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించకుంటే ఆందోళనలు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -