న్యూఢిల్లీ: రెగ్యూలేటరీ నిబంధనలు పాటించలేదనే కారణంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ కొరఢా ఝుళిపించింది. బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్‌లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఖాతాదారుల భద్రతకు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్టు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు గాను ఎస్బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధించింది. బ్యాంకిం గ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు రూ.1 కోటి జరిమానా వేసినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్యలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పని చేస్తాయని పేర్కొంది.