– అనధికారిక పోస్టుతో కొందరి అడ్డగోలు దోపిడీ
– సీనియార్టీని విస్మరించి ప్రిన్సిపాల్స్‌కు ప్రమోషన్
– ఔట్‌సోర్సింగ్ జాబ్‌ల విషయంలో ఏజెన్సీలతో కుమ్మక్కు
– ఒక్కో తాత్కాలిక ఉద్యోగానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వసూలు
– పట్టించుకోని సెక్రెటరీలు.. ప్రాంతీయ కోఆర్డినేటర్ల ఇష్టారాజ్యం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీసీ గురుకులాల్లో ప్రాంతీయ సమన్వయ అధికారులు (ఆర్సీవోలు) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీనియార్టీని విస్మరించి ఆ జిల్లాల పరిధిలో నచ్చిన వారిని ఆర్సీవోలుగా సెక్రెటరీలు నియమిస్తున్నారు. అనధికారిక ఆర్సీవో పోస్టులో రిక్రూట్ అయిన ఆ రీజియన్ పరిధిలోని ప్రిన్సిపాల్స్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న విమర్శలున్నాయి. మొదట్లో కాస్త నిజాయితీగా ఉన్నా నిలదొక్కుకోవటమే ఆలస్యం అక్రమార్జనకు దిగుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించే ఔట్‌సోర్సింగ్ పోస్టుల విషయంలో ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రూ.2 లక్షలు ఏజెన్సీకి ఇవ్వాల్సిన పోస్టుపై రూ.50వేల నుంచి రూ.లక్ష అదనంగా వసూలు చేసి తమకు ఇస్తేనే జాబ్‌లో జాయినింగ్ అని ఏజెన్సీ నిర్వాహకులతో తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ముట్టచెప్పిన వారికే పోస్టు కేటాయిస్తున్నారనే చర్చ బీసీ గురుకుల ఉద్యోగవర్గాల్లో గుప్పుమంటోంది.
అనధికారిక పోస్టైనా అడ్డగోలు దోపిడీ
మొదట్లో సెక్రెటరీలే పర్యవేక్షణంతా సాగించేవారు. ఎప్పుడైతే ఆర్సీవోల నియామకం జరిగిందో అడ్మీషన్లు మొదలు జాబ్‌ల వరకు ప్రతి దానికీ కొందరు ప్రాంతీయ సమన్వయ అధికారులు పైసలతోనే ముడిపెడుతున్నారు. ఒకప్పుడు అడ్మీషన్ రావాలంటే సెక్రటరీల ద్వారానే జరిగేది. ఒకవేళ ఎవరికైనా అడ్మీషన్ ఇవ్వాల్సి వస్తే సెక్రటరీ నుంచి స్కూల్ మెయిల్‌కు సంబంధిత వివరాలు పోస్టు చేసేవారు. స్కూల్/ కళాశాలలో అన్నీ పరిశీలించి ఆ విద్యార్థి అడ్మీషన్‌కు అర్హుడా? కాదా? నిర్ధారించేవారు. కానీ ఇప్పుడు అడ్మీషన్స్ విషయంలోనూ ఆర్సీవోల దందా సాగుతోంది. ఒక్కో అడ్మీషన్‌కు రూ.5వేల నుంచి రూ.10వేలకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలున్నాయి. వాస్తవానికి బీసీ గురుకులాల్లో తప్ప ఎక్కడా ఆర్సీవో పోస్టులు లేవు. అదీ అనధికారికమే. కాబట్టి ఉన్నన్ని రోజులు సంపాదించుకోవాలనే ధ్యాసతో కొందరు ఆర్సీవోలు అక్రమార్జనకు దిగుతున్నారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో ఉంది.
సాంఘిక సంక్షేమ శాఖలో ఆర్సీవోల బదులు జోనల్ ఆఫీసర్స్, మైనార్టీ శాఖలో ఆర్‌ఎల్‌సీలు, గిరిజన సంక్షేమ శాఖలో ఆర్సీవో పోస్టు ఉన్నా ఇవి రెగ్యులర్‌తోపాటు అధికారిక (ఓచర్) పోస్టులే కావటం గమనార్హం. ఈ రెండు డిపార్ట్‌మెంట్లలోనూ సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపడుతున్నారు. బీసీ గురుకులాల్లో పోస్టు అనధికారికమే అయినా గ్రేడ్-1 ప్రిన్సిపాల్స్‌ను సీనియార్టీ ప్రకారం ఆర్సీవోలుగా నియమించాలి. కానీ సెక్రటరీలు నచ్చిన వారిని ఎంపిక చేస్తుండటం వివాదాస్పదం అవుతోంది. అవినీతి ఆరోపణలున్న ప్రిన్సిపాల్స్‌ను సైతం ఆర్సీవోలుగా నియమిస్తుండటాన్ని ఉద్యోగవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌పై అవినీతి ఆరోపణలున్నట్టు ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, మరుసటి రోజే ఆ ప్రిన్సిపాల్‌కు ఆర్సీవోగా ప్రమోషన్ ఇవ్వటం అప్పట్లో చర్చనీయాంశమైంది.
పోస్టులు ఎలా నింపుతున్నారు?
ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఎలా నింపుతున్నారు? మీడియా నోటిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా? ఈ ఏడాదిలో ఎక్కడైనా పోస్టు నింపుతున్నట్టు నోటిఫికేషన్ వచ్చిందా? ఇలాంటివేవీ లేకుండానే రిక్రూట్‌మెంట్‌లు చేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. గతంలో పూర్తిస్థాయి పర్యవేక్షణ సెక్రటరీలు నిర్వహించేవారు. ఆ సమయంలోనే అవకత వకలు తక్కువగా ఉండేవని, కొందరు సెక్రటరీలకు ఏ స్కూల్‌లో ఏ సమస్య ఉందో.. ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ బోధిస్తు న్నారో కూడా సూక్ష్మస్థాయి పర్యవేక్షణ ఉండేదని చెబుతు న్నారు. ప్రస్తుతం ఆర్సీవోలను కాదని నేరుగా సెక్రటరీల దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారనే వాదన ఉంది.
ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్సీవోలు
రాష్ట్రవ్యాప్తంగా 310 బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో 6వేల మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కో స్కూల్‌లో సుమారు 400 మంది విద్యార్థుల చొప్పున రెండు లక్షల మంది వరకు అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా పది మంది ఆర్సీవోలు పనిచేస్తున్నారు.
సెక్రెటరీలకు తెలిసే జరుగుతుందా?
కొందరు ఆర్సీవోలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నా సెక్రెటరీలు పట్టించుకోకపోవడంతో వారికి తెలిసే జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులాల్లో సమస్యలను పట్టించుకోకపోవటం, టైం టేబుల్ మార్చకపోవడం, ఆర్సీవోలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎలాంటి ఫిర్యాదు చేసినా సెక్రెటరీలు పట్టనట్టే ఉండటంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఆర్సీవోల దందా వ్యవహారాలు బీసీ వెల్ఫేర్ సొసైటీకి, సెక్రెటరీకి చేరుతున్నాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా ఉందని ఉద్యోగుల మాట.
బీసీ గురుకులాల్లో ఆర్సీవోల పెత్తనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES