– కాళేశ్వరం ఇంజినీర్ల మాదిరిగా మీరు కావద్దు
– దోచుకుని దాచుకునే వాళ్లను నిలదీయాలి : విద్యార్థులకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సూచన
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
దేశానికి ఉపయోగపడే విద్యను చదివి ఉన్నత హౌదాలోకి రావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విద్యార్థులకు సూచించారు. కాళేశ్వరం నిర్మించిన ఇంజినీర్ల మాదిరిగా తయారవ్వొద్దని, ఎవరికీ తలవంచొద్దని, దోచుకుని దాచుకునే వాళ్లను నిలదీయాలని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం లోక్‌నాయక్ భారతరత్న జయప్రకాష్ నారాయణ స్మారక అవార్డు-2025 కార్యక్రమం చైర్మెన్ రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఈ వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న పోరాటంలో మీరందరూ కలిసి రావాలన్నారు. చదువుతూ.. ఉన్న సమయంలోనే మీరు ఎంచుకున్న మార్గం ఈ దేశ దశ దిశను మార్చే విధంగా ఉండాలన్నారు. గతంలో అనేక మంది ఇంజినీర్లు సమాజ హితం కోరి పనిచేసిన వారున్నారని, వారిని స్ఫూర్తిగా ఎంచుకోవాలని చెప్పారు. ఎవరికీ తలవంచకుండా పనిలో నిబద్ధతతో ఉండాలని, భవిష్యత్‌లో మీరు నిర్మించే ఏ ప్రాజెక్టు అయినా తరతరాలుగా మన్నికగా నిలబడే విధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఇంజినీర్ల దగ్గర సమాధానం లేదని, పెద్దాయిన చెప్పింన్రు.. చేశామని చెప్పడం తప్ప వారు చదివిన చదువుకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థలో దోచుకుని దాచుకునే వారే దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, అలాంటి వారిని నిలదీయడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు తనికెళ్ల భరణి, కళాశాల చైర్మెన్ రవికుమార్, సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి కలిసి గుమ్మడిని సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఏ.రాములు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నత హౌదాకు చేరుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES