‘అన్నం తినటానికి టైం లేదు, నీళ్ళు తాగటానికి టైం లేదు’… బిజీలైఫ్‌లో దేనికీ టైం దొరకదు. అందరికీ ఉండేవి 24 గంటలే. కానీ కొందరే ఆ గంటలను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని సమయపాలనను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారు. ఆ కొందరిలో మీరూ ఒకరు ఎందుకు కాకూడదు…?
బిజీ లైఫ్… నిత్యం పరుగుతో కూడుకున్న లైఫ్, పైగా పోటీ ప్రపంచం. అనుకున్నది సాధించటానికి, సవాళ్ళను ఎదుర్కొనటానికి, కావల్సిన గమ్యాన్ని చేరుకోవటానికి మనకున్న వ్యవధి తక్కువ. ఆశయాలు, ఆశలు కొండంత. చేతిలోవున్న టైమ్ పిడికెడంత. అందుకే ‘అయాం బిజీ… అస్సలు టైమ్ లేదు’ అనే మాట ప్రతినోటా మనకు తరచూ వినిపిస్తుంటుంది. విద్యార్ధుల విషయమే తీసుకుంటే ఈ ‘టైమ్’ సమస్య అంతా ఇంతాకాదు. టన్నుల కొద్దీ పెరిగిపోతున్న చదువు విద్యార్థులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఏం చేయాలో ఎటునుంచి మొదలు పెట్టాలో తెలియక, ‘ప్రస్తుతానికి వాయిదా వేద్దాం’ అనే స్థితికి చేరుకుంటున్నారు.
పనులు వాయిదా వేయకండి :
విద్యార్థి దశలో ముఖ్యంగా రెండు సమస్యలు పీడిస్తుంటాయి. ఒకటి చదువు కోవడం, రెండోది నేర్చుకోవడం. క్లాసులకు వెళ్ళడం, పుస్తకాలు తిరగెయ్యడం, ప్రాక్టికల్స్ చేయడం, పేపర్లు రాసి ప్రొఫెసర్లకు అందజేయడం, ఇవన్నీ చదువుకోవడంలో భాగాలు కాగా, వాటి సారాన్ని ఆకళింపు చేసుకోవడం, నేర్చుకోవడంలో ముఖ్యమైన అంశం. చిట్టచివరకు పరీక్షలకు ప్రిపేర్ కావడం. ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కడా విరామం లేదు. వ్యక్తిగత జీవితం గడపటానికి వెసులుబాటు అసలే లేదు. అందుకే మీ పనులను వాయిదా వేయకండి.
పరీక్షలు దగ్గర పడటానికి చాలా ముందరే మీరు చేయవల్సిన చదువుకి సంబంధించిన పనుల్ని పూర్తి చేయండి. అపుడే నేర్చుకోవటానికి మీకు సమయం దొరుకుతుంది. ఏం చదువుతున్నారో దానిమీద దష్టిపెడితే అభ్యసించడం సాధ్యమౌతుంది. ప్రతిరోజూ ఒక టైమ్ టేబుల్ ప్రకారం చదవండి. నోట్సు రాయండి. క్లాసులకు హాజరుకండి. నేర్చుకోండి. ఇవ్వాళి పనిని రేపటికి వాయిదా వేయకండి. రేపు చేయవల్సిన దాన్ని ఇవ్వాళే చేయండి. ఈరోజు చేయాల్సినదాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. కాలాన్ని ఎప్పుడూ ఆదా చేయండి. సెమిస్టర్ చివరన మీకు ఒత్తిడి ఏర్పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
ఎకడమిక్ పనికే ఇంపార్టెన్స్ ఇవ్వండి :
ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం పరీక్షల్లో సరిగ్గా రాయలేకపోవడమనే దుస్థితిని తప్పిస్తుంది అంటాడు జూరీ ఫెడర్స్. లండన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఈయన విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. జీవితంలో అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కానీ విద్యార్ధి దశలో వున్నప్పుడు మీరు అధికంగా ప్రాధాన్యత నివ్వాల్సింది మీ ఎకడమిక్ పనులకేనన్న సంగతి గుర్తించండి.
ఎ.బి.సి. లిస్టు :
మీరు ఇవ్వాళే పూర్తి చేయాల్సిన పనులను ‘ఎ’ లిస్టులో వేయండి. ఈ లిస్టులో మీరు చేర్చిన పనులు పూర్తి అయిన పిమ్మట చేయవల్సిన వాటిని ‘బి’ లిస్టులో చేర్చండి. ఇంకా మిగిలిపోయిన వాటిని ‘సి’ లిస్టులో చేర్చండి. సాధారణంగా మనం మన విద్యార్జన పనులన్నిటినీ ఈ ఆర్డర్ లోనే చేద్దామని గట్టిగా అనుకుంటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా, అంతగా అవసరంలేని ‘సి’ లిస్టులోని పనుల్ని ముందుగా చేస్తుంటాం. దాంతో క్రమంతప్పి ఒక్కసారిగా మనో భారం పెరిగిపోతుంది.
స్టడీ అలవాట్లు మార్చుకోండి:
కాలేజీలోకి అడుగుపెట్టిన తరువాత, ఎప్పుడో పరీక్షల తేదీ నిర్ణయించాక పుస్తకం తెరుద్దామనుకుంటే చెల్లదు. మీరు ఎప్పుడు ఎలా ఏ విధంగా చదువుతున్నారనేది చాలా ముఖ్యం. చదివే కార్యక్రమం నిత్యం విరామం లేకుండా జరిగి పోతూనే వుండాలి. అందుకే మీరు మీ స్టడీ అలవాట్లను మార్చుకోవాలి. ఆ మార్పేదో రేపటి రోజున కాదు. ఇవ్వాళే రావాలి. ఇప్పుడే రావాలి. ఏం చదువుకోవాలో సరిగ్గా తేల్చుకోండి. ఎవరూ లేనిచోట ప్రశాంతంగ కూర్చుని చదవండి. విద్యార్థి దశలో మీకు మీ కాలాన్ని హరించేసే కాల రాక్షసులు వుంటారు. (వీరినే ఆంగ్లంలో టైమ్ కిల్లర్స్ అని కూడా అంటారు) అట్లాంటి వారికి దూరంగా గడపండి. మీరు పెట్టుకున్న టైమ్ టేబుల్ని కఠినంగా అనుసరించండి.
విభజించి చదువుకోండి :
కోర్సు కొండంత కన్పించవచ్చు. ఎంత పెద్ద కొండనైనా రోజుకు ‘కొంత’ చొప్పున ముక్కలు చేయడం మొదలుపెడితే, అనుకున్న దానికన్నా ఎక్కువ వేగంగా ఆ పనుల్ని చేయగల్గుతారు. రానున్న ఎస్సైన్‌మెంట్‌కు నిర్ధారించబడిన సిలబస్ పెద్దదే కావచ్చు. కానీ ప్రతిరోజూ చదవటానికి వీలుగా దాన్ని విభజించి చదివితే, పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇందుకు మీరు రాసుకున్న ఎ.బి.సి. లిస్టు కూడా ఎంతగానో వుపయోగపడుతుంది.
వ్యవస్థీకతం కండి :
పదిమంది ఉద్యోగులు పని చేసే సంస్థ ఎంత వ్యవస్థీకతంగా వుంటుందో మీ చదువు కార్యక్రమం కూడా అంతే వ్యవస్థీకతంగా సాగాలి. విద్యార్థిగా మీ ప్రతి రోజుని 3 ప్రధాన భాగాలుగా విడదీయాలి. హాజరు కావడం, స్టడీ చేయడం, ఇతర పనులు చేయడం, టైమ్ ప్రకారం క్లాసులకు హాజరు కావాలి. అట్లాగే నియమిత టైం ప్రకారం మాత్రమే చదవాలి. అట్లాగే విద్యేతర కార్యక్రమాలకు కూడా ప్రాముఖ్యత నిస్తూ తగినకాలాన్ని కేటాయించాలి. ఆ కాసేపు ఆనందంగా గడిపి రిఫ్రెష్ అయి మళ్ళీ చదువు మొదలు పెట్టాలి.
టైమ్ మేనేజ్ మెంట్ మీ బాధ్యత :
డబ్బు సంపాదించేటప్పుడు వ్యాపార లావాదేవీలకు టైం మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో, విద్యార్ధి దశలో కూడా అంతే ముఖ్యం. చదువుకోవడం అంటే చదువుతూ గడిపెయ్యటం కాదు. నేర్చుకుంటూ గడపటం. నేర్చుకోవడం మీ భవిష్యత్తుకు పెట్టుబడి. పెట్టుబడి సరిగ్గా పెడితేనే, ఫలితాలు బాగుంటాయి. ఈ మేరకు మీ కార్యక్రమాలను సరిగ్గా షెడ్యూల్ రూపంలో చేసుకువెళ్ళడం చాలా అవసరం. సమయ పాలనపట్ల అవగాహన, విద్యార్ధిగా మీ కెరీర్ పట్ల బాధ్యతాయుతమైన స్పందన మీకు చాలా అవసరం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్



