– ఎస్. నరేశ్ 9 వ తరగతి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
దేవరకద్ర, మహబూబ్ నగర్
అనగనగా కోయిలకొండ అనే ఊరిలో సాయి అనే పిల్లవాడు ఉండేవాడు. సాయి పదో తరగతి చదివేవాడు. సాయికి భక్తి కూడా ఎక్కువే. రోజూ బడికి వెళ్లేముందు ఇంట్లో దేవుడికి దండం పెట్టి వెళ్లడం, గుడికి వెళ్లడం చేస్తుండేవాడు. కానీ చదువు మాత్రం సరిగ్గా చదివేవాడు కాదు. పాఠం చెబుతుంటే ఎక్కడో ఆలోచించడం, నిద్ర పోవడం, మాట్లాడటం చేస్తుండేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా ఆడుకోవడానికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చి, కొద్దిసేపు చదువుకోగానే అలసిపోయి నిద్రపోయేవాడు.
మొదటిసారి పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి. అది చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలిస్తారు. దానికి బాధ పడతాడు సాయి. ఈసారి ఎలాగైనా ఎక్కువ మార్కులు సాధించాలని అనుకుంటాడు. ఇకనుండి బాగా చదువుకోవాలి అనుకుంటాడు. కానీ మళ్ళీ ఎప్పటిలాగే ఆటలు ఆడుకోవడం, నిద్రపోవడం చేసేవాడు. కొన్ని రోజులు గడిచాక మళ్ళీ పరీక్షలు మొదలు అవుతాయని తెలిసి గుడికి వెళ్లి ఈసారి ఎలాగైనా మంచి మార్కులు రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు.
ఆరోజు కూడా ఎప్పటిలాగే కాసేపు చదువుకోగానే నిద్రపోతాడు. ఆరోజు సాయికి కలలో దేవుడు ప్రత్యక్షమౌతాడు. దేవుణ్ణి చూసి ఆశ్చర్య పడ్డ సాయి దేవుడా ఈసారి మంచి మార్కులు వచ్చేట్లు చూడు స్వామి అని ప్రార్థిస్తాడు. అది విన్న దేవుడు నీకు ఆకలి తీరాలంటే ఏంచేస్తావు అని అడుగుతాడు, ఏమైనా తింటాను అని బదులిస్తాడు సాయి. నీకు సంతోషం వెయ్యాలంటే ఏం చేస్తావు అని మళ్ళీ అడుగుతాడు దేవుడు. ఆటలాడుతాను, టివి చూస్తాను అంటాడు సాయి. ఇంట్లో అందరూ ఎక్కడికైనా వెళ్లాలంటే ఏం చేస్తారు అని అడుగుతాడు దేవుడు, ముందు రోజు నుండే కావలసినవి అన్నీ సిద్ధం చేసుకుంటాం అంటాడు సాయి. అన్నిటికీ ఏదో ఒకటి చేస్తున్నావు, మరి మంచి మార్కులు రావాలంటే ఏం చేస్తున్నావు అనగానే సాయి నుండి సమాధానం లేదు.
నీకేది కావాలనుకుంటే దానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి. ఖాళీగా ఉండి చదువుకోకుండా నన్ను మొక్కితే మార్కులు ఎలా వస్తాయి, ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలు నీతో బాటే ఉంటారు కదా వాళ్ళు చదువుతారు, నీవు చదవవు అంతే తేడా. నీవు కూడా వాళ్ళలాగా చదివి చూడు మార్కులు ఎందుకు రావు. చెప్పిన పాఠాలు శ్రద్దగా వినాలి, అర్థం కాకపోతే అడగాలి, మిత్రులతో చర్చించాలి, సమయం వథా చెయ్యకుండా చదివి చూడు, అంతేగాని ఏమీ చెయ్యకుండా నన్ను వేడుకుంటే మార్కులు ఎలా వస్తాయి అని చెప్పి దేవుడు మాయమైపోతాడు. లేచి చూసేసరికి అది కల అని అర్థం అవుతుంది సాయికి.
ఆరోజు నుండి బాగా చదివే తన మిత్రుల మాదిరిగా తాను కూడా చదవాలని అనుకుంటాడు. పాఠాలు శ్రద్దగా వింటూ సమయాన్ని వథా చెయ్యకుండా దేవుడు చెప్పినట్లు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధిస్తాడు, సంతోషంగా దేవుడికి దండం పెడతాడు సాయి.



