Thursday, July 24, 2025
E-PAPER
Homeజాతీయంచదువొకటి...కొలువొకటి

చదువొకటి…కొలువొకటి

- Advertisement -

– అర్హతలకు తగిన ఉద్యోగాల్లేవ్‌
– గ్రాడ్యుయేట్లకు తక్కువ నైపుణ్యస్థాయి జాబ్‌లు
– ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ :
దేశంలో చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం ఉండట్లేదు. పట్టభద్రులు సైతం అర్హతకు తగిన కొలువులు లేక తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి దేశంలోని విద్య, ఉద్యోగ అవకాశాల అసమతుల్య తను ఎత్తిచూపుతుంది. ఇదే అంశాన్ని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ కాంపిటీటివ్‌నెస్‌ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ నివేదిక తెలిపింది. ”భవిష్యత్తు కోసం నైపుణ్యాలు : భారతదేశ శ్రామికశక్తి ప్రకృతి దృశ్యాన్ని మార్చటం” అనే పేరుతో ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక కోసం 2017-18 నుంచి 2023-24 వరకు పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే డేటాను ఉపయోగించారు.
దేశంలో ప్రాంతీయ అసమానతలు
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. దేశంలో ప్రాంతీయ అసమానతలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. బీహార్‌, యూపీ వంటి రాష్ట్రాలు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ వాటాలలో వెనుకబడి ఉన్నాయి. ఇక చండీగఢ్‌, పుదుచ్చేరి, గోవా, కేరళ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీలు), రాష్ట్రాలు నైపుణ్యం కలిగినవారిని తగినంతగా ఉపయోగించుకోవటంలో ముందున్నాయి. గ్రాడ్యుయేట్లలో (విద్యా నైపుణ్యస్థాయి 3) 8.25 శాతం మంది మాత్రమే వారి అర్హతలకు సరిపోయే పాత్రల్లో ఉన్నారు. ఇక సగం మందికి పైగా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను చేస్తున్నారు.
శ్రామికశక్తి, గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఇది!
శ్రామికశక్తిలో 88 శాతం మంది తక్కువ నైపుణ్య ఉద్యోగాలైన వీధి విక్రయం, ఇంటి పని, మాన్యువల్‌ ఆపరేషన్లలో నిమగమై ఉన్నది. ఇక 50 శాతం కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు గుమాస్తాలు, మెషిన్‌ ఆపరేటర్లు, సేల్స్‌ వర్కర్లు (స్కిల్‌ లెవల్‌ 2) వంటి పాత్రలలో పని చేస్తున్నారు. 38.23 శాతం మంది గ్రాడ్యుయేట్లు స్కిల్‌ లెవల్‌ 4 ఉద్యోగాలలో ఉండగా.. 28.12 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు మిడ్‌-స్కిల్‌ వృత్తులలో ఉన్నారు. ఇది వారిలో ఉన్న ఉపయోగించని ప్రతిభను సూచిస్తుంది. నైపుణ్యస్థాయిని బట్టి వేతనాల వృద్ధి ఉంటున్నది. నైపుణ్య స్థాయి 1 కార్మికులు కనీసం వేతనాలను పొందుతున్నారు. ఇక నైపుణ్య స్థాయి 2లో ఉన్నవారు వార్షిక వేతన వృద్ధిని 5-6 శాతం చూశారు. నైపుణ్య స్థాయి 3, 4 నిపుణులు వేతనాల్లో 8-12 శాతం వృద్ధిని చూశారు. ఇది ఎక్కువ మంది కార్మికులను అధిక-సామర్థ్య పాత్రలలోకి తరలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నది. ఢిల్లీ, పుదుచ్చేరి, గోవాలలో మధ్యస్థ, అధిక-నైపుణ్య ఉద్యోగ వాటాలలో స్వల్ప పెరుగుదల కనిపించింది.దేశంలోని యువత, కార్మిక శక్తి ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని నివేదిక సూచనలు చేసింది. ఇందుకోసం ఒక కార్యచరణను రూపొందించాలనీ, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ సర్కారు దేశయువతను మోసం చేసి ఇప్పటికీ 11 ఏండ్లు అవుతున్నదని వారు గుర్తు చేస్తున్నారు. యువతకు ఒకవేళ ఉద్యోగాలు దొరికినా.. అవి వారి నైపుణ్యాలు, సామర్థ్యాలకు అనుగుణంగా ఉండటంలేవనీ, ఇందుకు తాజా నివేదిక ప్రత్యక్ష ఉదాహరణ అని వారు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -