”రమ్యా..! రమ్యా.! ఏం చేస్తున్నావ్…” రాములమ్మ పిలుపు. ఇంటి వెనకాల గులాబీ మొక్కకు పాదు శుభ్రం చేస్తున్న రమ్య… సైంటిఫిక్ నేమ్ రోజా గాల్లిక, ఫ్యామిలీ- రోజేన్, క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్, సింబల్ ఆఫ్ బ్యూటీ అండ్ లవ్.. అంటూ రోజా పువ్వు గురించి చదివింది గుర్తు చేసుకుంటుంది.
”నిన్నే పిలిచేది” ఈసారి పిలుపు పెద్దగా వినిపించింది.
”ఏంటమ్మా! ఒక్కసారి పిలిచి ఊరుకోవు” ఏంటో చెప్పు? అంటూ ముందుకు వచ్చి నిలబడ్డది రమ్య.
”మంచినీళ్లు అయిపోయినరు. సైకిల్ వేసుకొని పోయి ఆ మల్లేశం ప్లాంట్ దగ్గర క్యాన్లో నీళ్లు తీసుకొని రా”
”అక్కకు చెప్పొచ్చుగా అన్ని నేనే చేయాలా” రమ్య ఎదురు ప్రశ్న .
”అక్క మిషన్ షాపుకు పోయే టైం అయింది. ఒక్క మాట ఎదురు చెప్పకుండా పని చెయ్యవు ఎందుకు?” అనే అమ్మ మాట వింటూ, డబ్బాలో ఉన్న ఐదు రూపాయలు తీసుకొని సైకిల్ వెనుక కొండికి క్యాన్ తగిలించి, మంచి నీళ్ళు తేవడానికి వెళ్ళింది రమ్య.
”అమ్మా! నేను వెళ్తున్నా” రాధ బయలుదేరుతూ చెప్పింది.
”అన్నం బాక్స్ కవర్లో పెట్టుకున్నావా…?” లోపల్నుంచే అడిగింది అమ్మ. తీసుకెళ్తున్నా, అని చెప్పి బస్సు వచ్చేది చూసి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదికి పరిగెత్తింది రాధ.
రాధ డిగ్రీలో రెండు సబ్జెక్టులు తప్పింది. ఇంటి దగ్గర ఉంటే అందరూ పెళ్లి అంటున్నారని పక్కనే ఉన్న మండల కేంద్రంలో, లేడీస్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్లో చేరింది. ఇంకో నెలలో అయిపోగానే షాప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నది.
నీళ్ల క్యాన్ తెచ్చిన రమ్య దాన్ని మోయలేక అమ్మా! అని పిలిచింది. నీళ్ల క్యాన్ ఇంట్లో పెడుతూ… అమ్మ చెప్పిన పనికి కోపం వచ్చింది రమ్యకు. ఉదయం వెళ్లేటప్పుడు పెట్టొచ్చుగా అన్నం బాక్స్ నాన్నకు, అంటే.. నాలుగు గంటలకే వెళతాడు. అని చెప్తుంది. అందుకే కాలేజీకి సెలవు రావద్దు, అనుకుంటూ, సైకిల్‌ని ఇంటి ముందు కట్టిన దడికి అనించింది.
రమ్య నాన్న రాజయ్య. ఇంతకుముందు వడ్ల మిల్లులో పని చేసేవాడు. అది బాగా నడవక పోయేసరికి కొత్తగా వేస్తున్న హైవే రోడ్డు పనికి పోతున్నాడు. రమ్య అమ్మకు చదువు రాదు. నాన్న రెండవ తరగతి వరకు చదువుకున్నాడు. దిన పత్రికలు బాగా చదవగలడు. ఏ విధంగానైనా సరే రమ్యకు ఉద్యోగం వస్తుందని రాజయ్య నమ్మకం. దానికి ఒక బలమైన కారణం ఉంది. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. దానితో కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. రమ్యకు గోపాలపురం గ్రామ పెద్దలు రెండు వేల రూపాయలు బహుమతిగా కూడా ఇచ్చారు. నాన్నకు మధ్యాహ్నం అన్నం ఇవ్వడానికి వెళ్లగానే, ఎండలో ఎందుకు వచ్చినవ్, అమ్మా..! నేనే వచ్చేవాణ్ణిగా, నాన్న మాట పూర్తి కాకముందే నువ్వేమో నా గురించి, అమ్మేమో నీ గురించి, ఆలోచిస్తారు. నేను ఎవరు గురించి ఆలోచించాలో అర్థం కావట్లేదు. సరే కానీ బాక్స్ తీసుకో నాన్న, నేను వెళ్తున్నాను అని సైకిలెక్కి 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆగింది రమ్య.
రమ్యా లేమ్మా..! తొందరగా ఈరోజు కాలేజీ ఉంది తెలుసుగా?
రాధ లేచిందా..? పడుకొనే అడిగింది రమ్య.
దాని గురించి అడగకుండా ఒక్క పని అయినా చేసినవా? ముందు లేచి తయారవ్వు బస్సు టైం అవుతుంది. హడావుడిగా తయారైనా చాలా అందంగా ఉంది రమ్య. రోజా పువ్వు లేకుండా కాలేజీకి వెళ్లదు. 30 కిలోమీటర్లు దూరం ఉన్న కాలేజీకి పల్లె వెలుగులో ప్రయాణం. సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు వచ్చినయి. మంచిగా చదువుతుందని లెక్చరర్స్‌కు ప్రత్యేక అభిమానం.
కాలేజీకి వెళ్లేప్పటికే క్లాస్ జరుగుతూనే ఉంది. వరుసగా నాలుగు, తెలుగు కెమిస్ట్రీ, బోటనీ, జువాలజి క్లాసులు జరిగినరు.
రమ్యా..! పోయిన ఆదివారం తప్పించుకున్నావు. వచ్చే ఆదివారం ఎలాగైనా సినిమాకి వెళ్ళాలి అని మాట తీసుకుని అనూష, మాధవి ఒప్పించారు రమ్యను. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర అంతా కోలాహలంగా ఉంది. ఏం జరుగుతుందో అని ఆలోచించే లోపే పిలగాడు మంచిగనే ఉన్నాడు, అనే మాట వినిపించింది. రాధ పెళ్లి గురించి అని వెంటనే అర్థమయింది. పెద్దక్కను లారీ డ్రైవర్‌కు ఇవ్వవద్దని అందరూ అన్నప్పుడు నాన్న ఒప్పించి పెళ్లి చేశారు. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కనిపించేది. ఆదుకునేది పెద్దక్క రవళినే. రాధకు కూడా బస్సు డ్రైవర్ అయినా నాన్న స్థోమతకు తగ్గట్టుగానే పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాడు. కంగ్రాట్స్ అక్క అన్నది రమ్య వస్తూనే. రాధ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది.
రాజయ్యకు ముగ్గురు బిడ్డలే. అందుకే రమ్యను ”నువ్వేరా నా…కొడుకువి, నిన్ను నాతోనే ఉంచుకుంటాను, ఎక్కడికి పంపను” అనేవాడు.
”నువ్వు పంపించినా నేను వెళ్ళను నాన్నా నిన్ను అమ్మను చూసుకునేది నేనే కదా.!”
”నువ్వు బాగా చదివి ఉద్యోగం సంపాదించి మంచిగా బతికితే చాలు తల్లీ జీవితాంతం మమ్మల్ని చూసుకున్నట్లే లెక్క”.
”ఆ పని తప్పకుండా చేస్తాను నాన్న” అనడమే కాదు ఆ మాట ఎప్పుడు మనసులో మెదులుతూ ఉండేది రమ్యకు.
పెద్దక్క వచ్చిందంటే పండగే. నాకేం పని ఉండదు. హాయిగా తినడం, చదవడం, టీవీ చూడడం, అక్క పిల్లలతో ఆడుకోవడం. అందుకే అక్క ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. రాధ పెళ్లి కాబట్టి వారం ముందే వచ్చింది. పెళ్లి గోపాలపురం పాఠశాలలోనే, చాలా సాదాసీదాగా జరిగింది. చివరలో మగ పెళ్ళి వారు గొడవ చేసినా అది సద్దుమణిగింది. రాధ కళ్ళల్లో నీళ్ళు, నేను కూడా చాలా బాధపడ్డాను.
రెండు రోజుల తర్వాత రాధ అత్తారింటికి వెళ్ళింది. పోటీ పెట్టడానికి, కొట్టుకొని, తిట్టుకోవడానికి రాధ లేకపోవడం చాలా కష్టంగా తోచింది మనసుకు.
ఆ రోజు ఆదివారం పని అయిన తర్వాత సినిమా గురించి నాన్నకు ఎలాగైనా చెప్పాలనుకున్నది రమ్య. నీరసంగా ఉందని పనికి వెళ్లలేదు నాన్న. అమ్మ పొలంలో కలుపు తీయడానికి కూలికి వెళ్ళింది, సాయంత్రానికి కానీ రాదు. పని అంతా నా బాధ్యతే, త్వరగా బట్టలు ఉతకడం చేస్తున్నది. రమ్యా కొన్ని మంచి నీళ్లు ఇవ్వమ్మా..! అన్నాడు నాన్న. మంచి నీళ్ళు తెచ్చే లోపే మంచం కిందికి దిగి కూర్చున్నాడు. భయమేసింది. నాన్నా, ఏమైంది… నాన్న..? కొంచెం గుండె గుంజుతున్నట్టు ఉందమ్మా.. అమ్మకు ఫోన్చెరు అన్నాడు. అమ్మతో పాటు పనికిపోయిన పక్కింటి పెద్దమ్మకు ఫోన్ చేస్తే. నేను ఈ రోజు పనికి పోలేదు అన్నది. అక్కకు ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు నాన్నని తీసుకుని హాస్పిటల్కి వచ్చేరు. ఈ లోపు నేను చేరుకుంటా అన్నది.
ఇంట్లో ఉన్న వెయ్యి రూపాయలు తీసుకొని, ఆటోలో పట్టణ కేంద్రంలోని కమల హాస్పిటల్‌కు చేరుకుంది.
అమ్మకు ఎవరు చెప్పారో పెద్దక్క వచ్చిన పావుగంటకి చేరుకుంది హాస్పిటల్‌కు. పెద్దక్కని చూసిన రమ్యకు కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నయి. అమ్మ కళ్ళల్లో సముద్రాన్ని నింపుకుంది. పెద్దక్క కన్నీరు .. మున్నీరు అయ్యింది. ఉదయం నుండి ఏడ్చి ఏడ్చి రమ్య కళ్ళు వాచినయి.
గుండెపోటు స్టంట్ వేయాలన్నారు డాక్టర్… హైదరాబాద్ పెద్దాస్పత్రికి బాబాయి, అమ్మ తీసుకెళ్లారు. ఆపరేషన్కు మూడు లక్షలు అవుతాయన్నారు.
అయిన వాళ్ళందరూ ముఖం చాటేశారు. ఉన్న రెండు గుంటల జాగా అమ్మారు. డబ్బులు ఇంకా యాభైవేలు కావాలి. పెద్దక్క తెలిసిన వాళ్లందరినీ అడిగీ అడిగీ నీరసించి పోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంది.
అప్పుడు అర్థమైంది నాకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని, మా పాఠశాలలో నన్ను బాగా ప్రోత్సహించి నేను స్కూల్ ఫస్ట్ రావడానికి కారణమైన సాయికుమార్ సార్‌కు ఫోన్ చేసిన, ఏమైనా కానీ అని డైరెక్ట్‌గా విషయం చెప్పాలని అనుకున్నది.
”హలో సార్… నేను రమ్యను మాట్లాడుతున్నా. నాన్నకు హార్ట్ ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నాడు. యాభైవేల రూపాయలు కావాలి సార్, ఇరవై రోజుల్లో గోల్డ్ అమ్మేసి ఇస్తాం, సాయం చేయండి సార్” అన్నది.
రమ్య నేను ఒక గంటలో ఫోన్ చేసి చెప్తానమ్మా. గంట తర్వాత మళ్ళీ రమ్యానే ఫోన్ చేసింది.
ఏమైంది సార్, చూస్తానమ్మా టైం పడుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి వెంటనే అంటే కష్టం అన్నాడు.
అయినా నా పిచ్చి గానీ, చదువు చెప్పే సార్లు పుస్తకంలో పాఠాలు చెప్తారు గానీ ఆపదలో డబ్బులు, అదీ యాభైవేలు ఇస్తారా. అనవసరంగా అడిగాను అనుకుంది.
మరో ఐదు నిమిషాల్లో ఇంటి ముందు టూ వీలర్‌పై ఆగిన సాయికుమార్ సారును చూసిన రమ్యకు దుఃఖం ఆగలేదు. ముగ్గురమ్మాయిలు, తమ నాన్నను ఎలాగైనా బతికించుకోవాలి అనే బాధ తన మనసును కలిచి వేసింది. యాభైవేల రూపాయలు ఇచ్చి, రమ్య తలపై చేయి వేసి, ”నాన్నకు ఏమీ కాదు రా. డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి” అని ఓదార్చి బయలుదేరారు. అక్క వాళ్ళు నమ్మలేకపోయారు.
అందరం కలిసి హైదరాబాద్ వెళ్లినం ఆపరేషన్ సక్సెస్. సార్‌ను నేను దేవుడిగా భావించాను. హాస్పిటల్లో అందరూ ఉండొద్దు కాబట్టి పెద్దక్క అమ్మ ఉన్నారు.
నేను ఇంటికి వచ్చాను. పెద్దక్క పిల్లలు నాతోనే ఉన్నారు. ఇంకో మూడు రోజుల్లో నాన్న ఇంటికి వస్తాడు. మనసు తేలికపడి సంతోషంగా ఉంది. లేవగానే మామయ్య కొడుకు ఫోన్… ”నువ్వు రెడీ అయి ఉండు నేను బండి వేసుకొని వస్తున్నా”.
నిన్ననే నాన్నతో మాట్లాడాను. అయినా ఏదో కీడు శంకించింది. మనసు పరిపరివిధాల ఆలోచించసాగింది.
ఉదయం ఎనిమిది గంటల సమయం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని దేశం అంతా ఆనందంగా ఉంది. కానీ మా కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి దైన్యంగా ఉంది. కళ్ళు ఎడారులైన అమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పాపం ఒకరోజు ఐతే ఇంటికి వచ్చే వాళ్ళంటా. ఆపరేషన్ సక్సెస్ అయినా కిడ్నీలు చెడి పోవడం వల్ల చనిపోయాడట. చూడ్డానికి వచ్చిన వాళ్లకు పక్కింటి అనసూయ చెప్తుంది.
అక్క వాళ్లు తలకొరవి పెట్టడానికి బావ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నాన్నకు నా చేత తలకొరివి పెట్టించారు. తల కొరివి పెట్టి తీర్చుకొనేది కాదు నాన్న నీ రుణం.
అమ్మకు నేను తప్ప ఎవరూ లేరు. నాన్న జీవితం అంతా మమ్మల్ని చదివించి, అక్కల పెళ్ళి చేయడానికి సరిపోయింది. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో నాకు ఒకటే గుర్తు వచ్చింది… మనిషి జీవితంలో గెలవాలంటే చదువు ఒక్కటే ఆయుధం. బాగా చదివి ఉద్యోగం చేసి అమ్మను మంచిగా చూసుకోవాలి. తర్వాతే నా జీవితం అనుకుంది రమ్య. పదిహేను రోజుల తర్వాత రమ్య మళ్ళీ కాలేజీలో అడుగు పెట్టింది. భారంతో.. బాధ్యతతో… భవిష్యత్‌పై భరోసాతో.
ఆ సంవత్సరం డిగ్రీ పూర్తయింది రమ్యది. సాయికుమార్ సహాయంతో అమ్మను ఒప్పించి హైదరాబాద్ బస్సు ఎక్కింది రమ్య చదవడానికి.
డా||ఎం.ఎస్.7013 22 53 56