Thursday, May 22, 2025
Homeప్రధాన వార్తలుజీవితానికి చదువే కీలకం

జీవితానికి చదువే కీలకం

- Advertisement -

– మూసధోరణిలో పోవద్దు
– విద్యతో ఎదగాలి.. వినయంతో మెలగాలి
– అప్పుడే ఉన్నత శిఖరాలు చేరుకోగలం : గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేతలో మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రతి ఒక్కరి జీవితానికి చదువే కీలకమనీ, దాని ద్వారానే ఉన్నతశిఖరాలకు ఎదుగుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ (సీతక్క) నొక్కి చెప్పారు. మూసధోరణిలో చదివితే ప్రయోజనం ఉండదని సూచించారు. విలువలు, వినయం, సంస్కారం, సామాజిక స్పృహ, సమానత్వ భావన నేర్పించేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని ఆకాం క్షించారు. విద్యతో ఎదగాలి..వినయంతో మెలగాలి అని విద్యార్థులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల కొమ్రం ఆదివాసీ భవన్‌లో పదో తరగతి, ఇంటర్‌, ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆదివాసీ, గిరిజన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను మంత్రి సీతక్క అందజేశారు. ఆదివాసి పవన్‌ ప్రాంగణంలో ప్రతిష్టించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను మంత్రి దర్శించుకున్నారు. కొమ్రంభీమ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోయ, ఆదివాసీ, గిరిజన సాంప్రదాయ నృత్యాలను మంత్రి తిలకించారు. ఆదివాసీ గిరిజన పెయింటింగ్స్‌తో రూపొందించిన చీరను మంత్రి సీతక్కకు గిరిజన గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులు బహుకరించారు. కార్యక్రమంలో ట్రైకార్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌, గిరిజన ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కె.తిరుపతి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌, గిరిజన శాఖ కార్యదర్శి శరత్‌, గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ట్రైబల్‌ ఏరియాల్లో చదువు లేకపోవడంతో తమను చిన్నచూపు చూశారని తెలిపారు. ఇప్పుడు ప్రయివేటు విద్యాసంస్థల పిల్లలతో పోటీపడి గిరిజన విద్యార్థులు మార్కులు పొందుతున్నారని చెప్పారు. ఎస్టీలు అధికంగా ఉన్న ములుగు, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలు టెన్త్‌ ఇంటర్‌ ఫలితాల్లో మొదటి స్థానాల్లో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 ఏండ్ల తర్వాత డైట్‌, 16 ఏండ్ల తర్వాత కాస్మోటిక్‌ చార్జీలను పెంచామని చెప్పారు. ఇతర విద్యాసంస్థల కన్నా గిరిజన శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇంటర్‌లోనూ 90 శాతానికిపైగా మార్కులు సాధించేలా పని చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో ఎస్టీల ప్రత్యేక సంస్కృతిని కాపాడాలన్నారు. ఆదివాసీ గిరిజన విద్యార్థులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని సూచించారు. గిరిజన సమస్యలేవి ఉన్నా తనతో నేరుగా చెప్పొచ్చని హామీనిచ్చారు. ఐటీడీఏలను తిరిగి బలోపేతం చేయాలని సూచించారు. వందమంది అక్కజెళ్లెళ్లను హాస్టల్‌ తనకిచ్చిందనీ, ప్రస్తుత మీటింగ్‌లోనే తనకు చదువు చెప్పిన ఇద్దరు టీచర్లు ఉన్నారని గుర్తుచేశారు. వారి ప్రోద్బలంతోనే తాను ఈ స్థాయికి ఎదిగా నని చెప్పారు. పురస్కారాలు రాని విద్యార్థులు మరింత పట్టు దలతో ముందుకెళ్లి విజయం సాధించాలని మనోధైర్యాన్ని కల్పించారు. పే బ్యాక్‌ టు సొసైటీ సిద్ధాంతాన్ని ఆచరణలో చేసి చూపించాలని పిలుపునిచ్చారు. గురుకులాలు, గిరిజన విద్యా సంస్థల గౌరవాన్ని నిలబెట్టేలా విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు.

సమసమాజ స్థాపన కోసం రాజీవ్‌గాంధీ కృషి
మంత్రి డాక్టర్‌ సీతక్క

ప్రధానిగా రాజీవ్‌ గాంధీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపన కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో రాజీవ్‌గాంధీ 34వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన హయాంలోనే దేశంలో సాంకేతిక విప్లవం ప్రారంభమైం దనీ, కంప్యూటర్ల వినియోగానికి ఆయన ఊతమి చ్చారని గుర్తుచేశారు. రాజీవ్‌ గాంధీ ఆశయాలకను గుణంగానే రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ వంటి కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -