Monday, February 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగోదావరి జలాలపై చర్చకు సిద్ధం

గోదావరి జలాలపై చర్చకు సిద్ధం

- Advertisement -

దేవాదుల భూసేకరణకు రూ.600 కోట్లు
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను గాలికొదలం
రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం
చాలా గొప్పగా మేడారం నిర్వహణ : సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి / ములుగు
దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు రూ.600 కోట్లను కేటాయించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్దనున్న దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌ను సీఎం సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణ జాప్యంతో ప్రాజెక్టులు ఆపడానికి వీలులేదన్నారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

దేవాదుల ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుకు బడ్జెట్‌ సమావేశాలకు ముందే తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. మార్చిలో మంత్రివర్గ సమావేశంలో అన్ని అంచనాలకు ఆమోదం తెలుపనున్నట్టు స్పష్టం చేశారు. నెలలోపు దేవాదుల పంపుల మరమ్మతులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రామప్ప చెరువు నుంచి జంపన్నవాగుకు నీరందించే ప్రణాళికపై వెంటనే నివేదికను సమర్పించాలని అధికారులకు సూచించారు. రాబోయే రెండేండ్లలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.

గోదావరి జలాలపై ముఖాముఖి చర్చ
బడ్జెట్‌ సమావేశాల అనంతరం గోదావరి జలాలపై ముఖాముఖి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎం తెలిపారు. ఈ వివాదాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, మా తప్పులు ఏంటో, మీ తప్పులు ఏంటో చర్చిద్దామని బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి అన్నారు. మీది పదేండ్ల అనుభవమని, మాది రెండేండ్ల అనుభవమని, ఎవరేం చేశారో పూర్తిస్థాయి చర్చ చేద్దామని చెప్పారు. ఆరోపణలు చేస్తే అతికేట్టు ఉండాలని, చవకబారు ఆరోపణలు, విమర్శలు చేయొద్దని కేసీఆర్‌, హరీశ్‌రావుకు సీఎం సూచించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన సూచనలను రాసుకున్నామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. ఇప్పటికీ మాకు ఓటు వేయకపోవడం ప్రజలదే తప్పు అనే భావనలో ఉండటం సరైంది కాదని హితవు పలికారు. మీ తప్పులను సమీక్షించుకోండని సలహానిచ్చారు. సహేతుకమైన విమర్శలు చేయాలన్నారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలను తప్పుపట్టడం మానండని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. పిల్లి శాపనార్ధాలు పెడితే ఉట్టిపడదన్నారు.

కృష్ణా జలాలపై ఎన్నో అపోహలుండేవని, ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ పెట్టడం జరిగిందన్నారు. కేసీఆర్‌, హరీశ్‌రావు.. నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఏం జరిగింది.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్న ఈ రెండేండ్లలో ఏం జరిగిందనేది స్పష్టంగా చర్చ జరిగిందని చెప్పారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పామన్నారు. మీరు తప్పు చేశారనే ప్రజలు గుర్తించి శిక్షించారని తెలిపారు. గోదావరి జలాలపై అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసి ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులుండేవని, ఆ పదేండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారముందన్నారు. 2001లో దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6 వేల కోట్లు అని, అనంతరం అంచనాలు రూ.13,400 కోట్లకు, రూ.14,500 కోట్లకు పెరిగాయని, తాజాగా రూ.18,500 కోట్లకు అంచనాలు ఎగబాకాయని చెప్పారు. ఇకనైనా ఈ అంచనాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. గోదావరిపైనున్న తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు ఎన్ని ప్రాజెక్టులుంటే అన్ని ప్రాజెక్టుల పనులనూ సమీక్షించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క నీటిబొట్టును లిఫ్టు చేయకపోయినా దేశంలో గత రెండేండ్లలో వరిని అత్యధికంగా పండించడంలో, ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రమే నెంబర్‌ వన్‌గా ఉండేది కాదన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను గాలికొదిలేయం..
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గాలికొదిలేయబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణల్లో ఉన్న లోపాలను సరిదిద్ది భవిష్యత్తులో ప్రమాదాలు లేకుండా చేయడానికే సమయం పడుతుందన్నారు.

మరోమారు మేడారానికి..
మేడారం జాతరలో చిన్నచిన్న తప్పులున్నా చాలా గొప్పగా నిర్వహించినందుకు అధికారులను, మీడియాను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం మేడారంలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిద్దామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, సీఎం సలహదారులు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, తెల్లం వెంకట్రావు, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, నీటిపారుదల శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -