మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డ్రగ్స్ పరీక్షలకు తాను సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. మొయినాబాద్ ఫాం హౌస్ మాదక ద్రవ్యాల కేసు సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆయన స్పందించారు. మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడటం దురదుష్టకరమన్నారు. ”డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి నేను పూర్తిగా వ్యతిరేకం.
అలాంటి వారిని రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే నీచమైన రాజకీయాల కోసం బీఆర్‌ఎస్ పార్టీని ఇలాంటి వివాదాల్లోకి లాగుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను” అని కేటీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తాననీ ఆయన హెచ్చరించారు.



