Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'పుర'పోరుకు సిద్ధం

‘పుర’పోరుకు సిద్ధం

- Advertisement -

వచ్చేవారంలో నోటిఫికేషన్‌
‘పంచాయతీ’ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
గత ఎన్నికల్లో అన్ని మున్సిపాల్టీలు బీఆర్‌ఎస్‌వే…
ఈసారి విజయం ఎవరిదో?


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి. వచ్చే వారంలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మున్సిపాల్టీల్లో రిజర్వేషన్లు కూడా ఖరారైన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ విధానాన్ని అమలు చేశారో, పురపాలక పోరులోనూ అదే పద్ధతిని అమలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మహిళల వాటాను కూడా ఖరారు చేశారు. ఈసారి మున్సిపాల్టీల్లో బీసీలకు 31.4 శాతం సీట్లను కేటాయించారు.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా 2019 నాటి తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 నాటి జనాభాలెక్కల ఆధారంగా నిర్ణయించారు. రిజర్వేషన్ల ఖరారు ప్రారంభంకాగానే సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ వేదికగా పురపోరుకు సమరశంఖం పూరించారు. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్‌పార్టీకి కత్తిమీద సాములా మారింది. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆపార్టీ నుంచి రెబల్స్‌ పెద్దసంఖ్యలో పోటీలోకి దిగి, విజయం సాధించారు. ఇదే పరిస్థితి మున్సిపల్‌ ఎన్నికల్లో ఎదురైతే కాంగ్రెస్‌పార్టీకి గడ్డుకాలమే! 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాల్ని కైవసం చేసుకున్నారు. అలాగే వార్డుల్లోనూ బీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. ఈ సీన్‌ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో రిపీట్‌ అవుతోందో లేదో వేచిచూడాలి. అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ సహా అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వరుస ఓటములు చవిచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుడ్డికన్నా మెల్లమేలు అన్నట్టు ఆపార్టీ ఎంతో కొంత రికవరీ కాగలిగింది. అదే సమయంలో బీజేపీ అనూహ్యంగా ఎక్కువ స్థానాల్ని గెలిచింది. బీఆర్‌ఎస్‌ లోపాయికారిగా బీజేపీకి సహకారం అందిస్తుందని అధికార కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బాగానే వెళ్లినట్టు కనిపిస్తుంది. అదే నిజమైతే బీఆర్‌ఎస్‌ను బీజేపీ మింగేసే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాలంటూ బీజేపీ, ప్రధాని మోడీపై ధాటిగా విమర్శలు చేసి, హడావిడి చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రస్తుతం సంధికాలంలో ఉన్నారు. రాష్ట్రంలో తమ ప్రధాన శత్రువు కాంగ్రెస్‌పార్టీనే అయినా, బీజేపీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ‘టచ్‌ మీ నాట్‌’ అన్నట్టే వ్యవహరిస్తుండటం రాజకీయంగా ఆపార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీన్నే కాంగ్రెస్‌పార్టీ తమ ఆయుధంగా మార్చుకొని ప్రజల్లోకి ‘దొందూదొందే’ అనే ప్రచారాన్ని తీవ్రం చేస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్కసీటు కూడా గెలవలేకపోవడం, బీజేపీ ఏకంగా 8 చోట్ల విజయం సాధించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ‘అవయవదానం’ చేశారంటూ బీఆర్‌ఎస్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి పురపోరులో పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పట్టణ ఓటర్లు ఎటువైపు నిలుస్తారో వేచిచూడాలి!

ఇవీ పాతలెక్కలు
2021లో గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 248 వార్డులకు గానూ 181 బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్‌ 29 మంది వార్డు సభ్యులకే పరిమితమైంది. బీజేపీ 15 స్థానాల్లో గెలిచింది. సీపీఐ, సీపీఐ(ఎం) చెరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులన్నీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే దక్కాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికలు ఇక్కడే
రాష్ట్రంలోని 121 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మాత్రం ఇంకా గడువు ఉంది. అది పూర్తయ్యాకే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -