కురిమిద్ద శ్రీనివాస్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాకారుల సమస్యలపై ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా, సామాజిక భద్రతా హామీలు లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని అన్నారు. కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తాగదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ, తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డు జారీ చేసి, కనీస పారితోషికాన్ని చట్టబద్ధం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి భద్రతా పథకాలు తక్షణమే అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో ప్రత్యేక సాంస్కృతిక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలని, సంస్కృతిక రంగానికి ప్రత్యేకంగా వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించాలని, దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో వృత్తి కళాకారులకు ప్రదర్శన అవకాసం కల్పించాలని, వృత్తి కళాకారులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని, యువతను సాంస్కృతిక రంగంలోకి ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు.
మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్, చిగుర్ల లింగం, జిల్లా సమితి సభ్యులు అన్నేమైన వెంకటేష్, ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షులు భూషిపాక నరసింహ, ఉపాధ్యక్షులు పిట్టల శంకర్ ఇంజా హేమలత, కట్ల యాదగిరి జిల్లా సహాయ కార్యదర్శి పోతు ప్రవీణ్, సోమ నర్సయ్య, మొగుళ్ల శేఖర్ రెడ్డి, మూల పోచయ్య, కళాకారులు మనోహర, జాను, శ్రీనివాస్, రాజప్ప, రేణుక, నవనీత,నవనీత, కృష్ణమ్మ, వసంత, కవిత, ఎలేంద్ర, లక్ష్మి లు పాల్గొన్నారు.



