Sunday, March 29, 2026
E-PAPER
Homeబీజినెస్రియల్‌ ఎస్టేట్‌ మందగమనం

రియల్‌ ఎస్టేట్‌ మందగమనం

- Advertisement -

– గృహ విక్రయాలు 7 శాతం పతనం
– అన్‌రాక్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ :
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని తాకింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నివాస అమ్మకాలు 7 శాతం క్షీణించి 1,01,675 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం 2025 అక్టోబర్‌ – డిసెంబర్‌ కాలంలో 1.08.970 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గడిచిన త్రైమాసికంలో నివాస గృహాలు విలువ పరంగా కూడా 6 శాతం తగ్గుదలతో రూ.1.60 లక్షల కోట్ల నుంచి రూ.1.51 లక్షల కోట్లకు పడిపోయింది. అయితే.. గతేడాది ఇదే సమయంతో (జనవరి-మార్చి 2025) పోల్చితే మాత్రం విక్రయాలు 93,280 యూనిట్ల నుంచి 9 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మార్కెట్లో విక్రయాల కంటే కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో అమ్ముడుపోని ఇండ్ల నిల్వలు 4 శాతం పెరిగి 6 లక్షల యూనిట్లకు పైగా చేరడం ఈ రంగంలో మందగమనాన్ని స్పష్టం చేస్తోంది.
నగరాల వారీగా పరిశీలిస్తే.. ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), బెంగళూరు నగరాలు మొత్తం విక్రయాల్లో 48 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చెన్నై నివాస అమ్మకాల్లో 18 శాతం తగ్గుదల నమోదయ్యింది. హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల సరఫరా 46 శాతం పెరగడం విశేషం. హైదరాబాద్‌లో అమ్ముడు పోని గృహాలు 7 శాతం పెరగ్గా.. బెంగళూరులో ఇది 12 శాతంగా నమోదయ్యింది.

”ఇరాన్‌ యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి భారత నిర్మాణ రంగంపై స్వల్పకాలిక ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా మార్చి నెలలో చమురు ధరలు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు ఆకాశాన్నంటడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు భారత రియల్‌ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టే మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) యుద్ధ భయాల నేపథ్యంలో ప్రస్తుతానికి తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేయడం కూడా ఈ క్షీణతకు ప్రధాన కారణమైంది. దీర్ఘకాలికంగా మార్కెట్‌ పునాదులు బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.” అని అనరాక్‌ గ్రూప్‌ చైర్మెన్‌ అనూజ్‌ పురి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -