Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవాస్తవ చరిత్రను భావి తరాలకు అందించాలి

వాస్తవ చరిత్రను భావి తరాలకు అందించాలి

- Advertisement -

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మతాల మధ్య జరగలేదు : రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్‌ రూరల్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవ చరిత్రను ముందు తరాలకు అందించాలని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పెన్షనర్స్‌ భవనంలో టీఎస్‌యూటీఎఫ్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-వాస్తవాలు, వక్రీకరణలు, అమరుల త్యాగాలు’ అనే అంశంపై నిర్వహించారు. టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.నర్సింలు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మల్లారెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆనాడు నిజాం సైన్యం అండతో గ్రామాల్లోని జగీద్దార్లు, జమీందార్లు, దేశముఖ్‌లు, భూస్వాములు పాలించేవారని తెలిపారు. వారి కారణంగా ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యారని.. అంటరానితనం, కుల వివక్ష, మహిళలపై లైంగికదాడులు నిత్యకృత్యంగా ఉండేవన్నారు.

దాడులు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఏకమే కమ్యూనిస్టుల నాయకత్వంలో 1946 నుంచి 1948 సెప్టెంబర్‌ 17 వరకు రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. ఈ కాలంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ నిజాంకు చెందిన 10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంపిణీ చేసిందన్నారు. తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైన తర్వాత పోరాటాల ద్వారా సాధించుకున్న ఫలాలను పొందడానికి అదే పోరాటాన్ని 1951లో రక్షిత కౌలుదారు చట్టం వచ్చేదాకా కొనసాగించినట్టు వివరించారు. ‘దున్నేవాడికే భూమి’ అని నినాదించి హక్కులు సాధించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు పి.వెంకటరమణ, తెలంగాణ గిరిజన సంఘం నేత శ్రీనునాయక్‌, టీజేఏసీ నేత జనార్ధన్‌, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు బిజీలి సత్యం, ఎల్‌.బాలయ్య, వి.కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీకాంత్‌, లక్ష్మీదేవమ్మ, అరుణ, ఎల్‌.రాములు, జి.శివారెడ్డి, వెంకటయ్య, రవికుమార్‌, వినీల్‌, నర్సింలు, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -