అధ్యక్షుడు అజయ్ సింగ్‌పై అవిశ్వాసం
న్యూఢిల్లీ : ఓ వైపు గ్రేటర్ నోయిడాలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ జరుగుతుండగా.. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)లో ముసలం మొదలైంది. బిఎఫ్‌ఐ నూతన రాజ్యాంగం చట్టబద్దత సహా ఇతర అంశాలపై అధ్యక్షుడు అజయ్ సింగ్‌పై సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో 28 రాష్ట్రాల బాక్సింగ్ సంఘాలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్టు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రతులను వరల్డ్ బాక్సింగ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు పంపించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో అజయ్ సింగ్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఎన్నికలకు వరల్డ్ బాక్సింగ్, క్రీడాశాఖ, భారత ఒలింపిక్ సంఘం నుంచి పరిశీలకులు హాజరు కాలేదు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సరైన ప్రక్రియ పాటించలేదని,అందువల్ల ఈ తీర్మానం చెల్లదని బీఎఫ్‌ఐ వర్గాలు చెబుతున్నాయి.



