Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో రెబల్స్‌ బెడద

బీహార్‌లో రెబల్స్‌ బెడద

- Advertisement -

ప్రధాన పార్టీల్లో టెన్షన్‌..టెన్షన్‌
2020 సీన్‌ రిపీట్‌ అవుతుందా?

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్‌ షురూ అయ్యింది. ఈ క్రమంలో ఎన్డీఏ, మహాఘట్‌ బంధన్‌ కూటములు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నాయి. తమ పార్టీ తరఫున గెలిచే గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఒకవేళ తమకు పార్టీ నిరాకరిస్తే రెబెల్‌గా పోటీ చేసేందుకు కొందరు, ఇండిపెండెట్లు బరిలోకి దిగేందుకు ఇంకొందరు సిద్ధమవుతున్నారు. త్వరలో జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు 20కి పైగా సీట్లలో రెబల్స్‌ బరిలోకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగితే ఏయే పార్టీకి ఎంత నష్టం? గత ఎన్నికల్లో ఎంతమంది రెబల్స్‌ గెలిచారు? వంటి విషయాలపై ఆసక్తికరంగా మారింది.

గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట
రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి దించాలని కోరుకుంటాయి. కానీ ప్రతి సీటుకు చాలా మంది పోటీదారులు ఉంటారు. మరికొన్ని సార్లు పొత్తులో ఉన్న పార్టీ కోసం సీటు త్యాగం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా మందికి టికెట్లు దక్కవు. ఇలాంటి అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. ఇంకొందరు ఇండిపెండెంట్‌ లేదా రెబల్‌గా పోటీ చేస్తారు. ఈసారి బీహార్‌లో దాదాపు రెండు డజన్ల సీట్లలో ఈ పరిస్థితి కన్పిస్తోంది. 2020లో 11 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు, ఓటముల మధ్య ఉన్న తేడా 1,000 కంటే తక్కువ ఓట్లే. చాలా స్థానాల్లో స్వతంత్రులు, రెబల్స్‌ గెలుపు, ఓటములను ప్రభావితం చేశారు. ఈ 11 సీట్లలో పలువురు రెబల్‌ అభ్యర్థులు 40,000-50,000 ఓట్లు సాధించారు.

జేడీయూ అభ్యర్థికి రెబల్‌ దెబ్బ
2020లో మినాపుర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు అజయ్ కుమార్‌. ఆయన కమలం పార్టీ టికెట్‌ నిరాకరించడంతో లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 43,000 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు జేడీయూ అభ్యర్థి గెలుపును దెబ్బతీశాయి. ఆర్‌జేడీ అభ్యర్థి చేతిలో జేడీయూ అభ్యర్థి 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

బీజేపీ నేతకు తప్పని ఓటమి
2015లో బీజేపీ టికెట్‌పై లోఖా నుంచి పోటీ చేసిన ప్రమోద్‌ కుమార్‌ ప్రియదర్శికి 2020లో పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆయన ఎల్‌జేపీ నుంచి పోటీ చేసి 30,000 ఓట్లు పొందారు. ఈ స్థానంలో ఆర్‌జేడీ అభ్యర్థి చేతిలో జేడీయూ అభ్యర్థి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే 2015లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన అర్జున్‌ రామ్‌ 2020లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 14,400 ఓట్లు దక్కించుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఆర్‌జేడీ అభ్యర్థి చేతిలో బీజేపీ నేత 12,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2010, 2015లో బీజేపీ తరఫున కస్బాలో పోటీ చేసిన ప్రదీప్‌ కుమార్‌ దాస్‌కు 2020లో పార్టీ టికెట్‌ను నిరాకరించింది. దీంతో ఆయన ఎల్‌జేపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోగా 60,000 ఓట్లు సాధించారు. అలాగే, 2015లో కమలం పార్టీ తరఫున బరిలోకి దిగిన దిలీప్‌ వర్మకు 2020లో టికెట్‌ దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఆయన రెండో స్థానంలో నిలిచారు. జేడీయూ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆర్‌జేడీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు.

మంజిత్‌ సింగ్‌ 2015లో జేడీయూ తరఫున బైకుంత్‌పుర్‌లో పోటీ చేశారు. కానీ 2020లో పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో మంజిత్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 43,000 ఓట్లు సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మనోరంజన్‌ సింగ్‌ 2015 ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎక్మా నుంచి పోటీ చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ నిరాకరించడంతో తన భార్య సీతా దేవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. అక్కడ బీజేపీకి గుడ్‌ బై చెప్పి ఎల్‌జేపీ టికెట్‌ తరఫున పోటీ చేసిన కామేశ్వర్‌ సింగ్‌ 30,000 ఓట్లు సాధించారు. దీంతో సీతా దేవి 13,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

జేడీయూ టికెట్‌పై పోటీకి యత్నం
2020 జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చకై స్థానం నుంచి పోటీ చేసి సుమిత్‌ సింగ్‌ గెలిచారు. తరువాత ఆయన జేడీయూకు మద్దతు తెలిపారు. నితీశ్‌ ప్రభుత్వంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి జేడీయూ టికెట్‌ తో పోటీ చేయాలని సుమిత్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా, డుమ్రాన్‌, కర్హాగర్‌, అరా, మహువా, దానాపుర్‌, కుమ్రార్‌, దిఘా సహా అనేక స్థానాలకు బహుళ పోటీదారులు ఉన్నారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఎంతమంది తిరుగుబాటుదారులు ఎన్నికల్లో పోటీ చేస్తారో స్పష్టంగా తెలుస్తుంది.

‘కార్యకర్తలకు ఎప్పుడూ మొండిచెయ్యే’
అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలకు పారదర్శకత లేదని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్‌ బాగి అన్నారు. టికెట్‌ కేటాయింపు విషయానికి వస్తే ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే టికెట్ల కేటాయింపులో ధనబలం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పార్టీలు టికెట్లను అమ్ముతున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ఆరోపణ చాలా తరచుగా చిన్న పార్టీలపై వస్తుందని వెల్లడించారు. అందుకే చాలా మంది సీనియర్‌ నాయకులు తమ పార్టీ టికెట్‌ నిరాకరించినప్పుడు రెబల్స్‌గా మారి ఎన్నికల బరిలోకి దిగుతారని పేర్కొన్నారు. ”పలు కారణాల వల్ల ఎన్నికల్లో రెబల్స్‌ పెద్ద పెద్ద సంఖ్యలో పోటీ చేస్తారు. ఇదేమీ కొత్తే కాదు. ప్రతి ఏటా రెబల్స్‌ ఎన్నికల్లో పోటీ చేసి అనేక సీట్లలో గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తారు. ఈసారి కూడా రెబల్స్‌ 20కి పైగా సీట్లలో పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.” అని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్‌ బాగి పేర్కొన్నారు.

‘టికెట్‌ ఆశతో ఇతర పార్టీల్లోకి జంప్‌’
చాలా మంది నాయకులు టికెట్‌ ఆశతో ఇతర పార్టీలలో చేరుతారని, కానీ అది జరగనప్పుడు వారు తిరుగుబాటు చేస్తారని రాజకీయ నిపుణుడు సునీల్‌ పాండే అన్నారు. అదేవిధంగా కొన్నిసార్లు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్‌ లభించినప్పుడు, నాయకులు రెబల్‌గా మారి పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ”చాలా మంది ప్రముఖ నాయకులు తమకు లేదా వారి కుటుంబాలకు టికెట్‌ పొందాలనే ఆశతో ఒక పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలోకి చేరుతారు. ఎన్నికలకు ముందు ప్రతిసారీ ఇలా జరుగుతుంది. ఈసారి కూడా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.” అని సునీల్‌ పాండే వెల్లడించారు.

ఎన్నికల డేటా పరిశీలిస్తే..
2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డేటాను పరిశీలిస్తే, మొత్తం 34 మంది బీజేపీ అభ్యర్థులు, 26 మంది జేడీయూ అభ్యర్థులు రెబల్స్‌ గా పోటీ చేశారు. రెండు పార్టీలు పోటీ చేసిన సీట్లను పరిగణనలోకి తీసుకుంటే, బీజేపీ 2010లో 102, 2015లో 157, 2020లో 110 సీట్లలో పోటీ చేసింది. జేడీయూ 2010లో 141, 2015లో 101, 2020లో 115 సీట్లలో బరిలో దిగింది. ఈ మూడు ఎన్నికలలోనూ ఆర్‌జేడీ నాయకులు 12 మంది, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు మాత్రమే రెబల్స్‌?గా పోటీ చేశారు. ఆర్‌జేడీ 2010లో 168, 2015లో 101, 2020లో 144 స్థానాల్లో పోటీ చేసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ, మహాఘట్‌ బంధన్‌కు చెందిన 29 మంది రెబల్స్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇందులో 19 మంది ఎన్‌డీఏ, పది మంది మహాఘట్‌ బంధన్‌ రెబల్స్‌ ఉన్నారు.

ఈ సారి వారిలో కొందరికి టికెట్‌ కష్టమే!
బీహార్‌లో 70- 80 ఏండ్ల మధ్య వయసు గల 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి, ఈ ఎమ్మెల్యేలలో చాలా మందికి టికెట్లు దక్కకపోవచ్చు. దీంతో అనేక మంది నాయకులు తిరుగుబాటు వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రెబల్స్‌, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారు. అయితే, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయాల శాతం చాలా తక్కువగా ఉంది.

నేడు బీహార్‌లో రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ
త్వరలో ఎన్నికల షెడ్యూల్‌

నేడు బీహార్‌లో రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. త్వరలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు ఈ భేటీ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ నేతత్వం లోని ఈ బృందం బీహార్‌లో రెండు రోజుల పర్యటించనుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), జేడీయూ, ఆర్‌జేడీ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ పార్టీల నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులను సమావేశానికి పంపాలని, ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది. సెప్టెంబర్‌ 30న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 7.42 కోట్ల మంది ఓటర్ల వివరాలున్నాయి. అయితే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)తో 47 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోయాయి.

డిపాజిట్లూ దక్కలే..
2010లో 1,342 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో ఆరుగురు మాత్రమే గెలిచారు. 1,324 మంది డిపాజిట్లు కోల్పోయారు.
2015లో 1,150 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో నలుగురు మాత్రమే గెలిచారు. 1,132 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
2020లో 1,299 మంది స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకరు మాత్రమే గెలిచారు. 1,284 మందికి డిపాజిట్లు రాలేదు.
2020లో 1,299 మంది స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేశారు, ఒకరు మాత్రమే గెలిచారు. 1,284 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.

రెబల్స్‌ మళ్లీ దెబ్బకొట్టనున్నారా?
అయితే, త్వరలో జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెబల్‌ అభ్యర్థులు పెద్ద పార్టీలను కలవరపెడుతున్నారు. పాట్నాలోని బార్‌ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్‌ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. అక్కడ కరణ్‌ వీర్‌ సింగ్‌ యాదవ్‌ కూడా పోటీదారుల జాబితాలో ఉన్నారు. ఆయనకు పార్టీ టికెట్‌ లభించకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గైఘాట్‌ స్థానంలో జేడీయూ ఎమ్మెల్సీ దినేశ్‌ సింగ్‌ కుమార్తె కోమల్‌ సింగ్‌ గత ఎన్నికల్లో ఎల్‌జేపీ టికెట్‌పై పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు ఈసారి గైఘాట్‌ సీటును కోరుకుంటున్నారు. ఆ సీటు జేడీయూదేనని ఆయన చెబుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన ఎన్‌డీఏ సమావేశంలో కోమల్‌ సింగ్‌, మహేశ్వర్‌ ప్రసాద్‌ కుమారుడి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఎవరో ఒకరు రెబల్‌ లేదా ఇండిపెండెంట్‌గా బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -