మహిళా వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి స్ఫూర్తి అవార్డ్స్
ఎస్వీకేలో ఘనంగా మహిళా వికలాంగుల ఉత్సవాలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
మహిళా వికలాంగుల పట్ల సమాజంలో కొనసాగుతున్న అసమానతలను ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎల్‌ఐసీ సంస్థ కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహిళా వికలాంగుల ఉత్సవాలను ఎల్‌ఐసీ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవాలందిస్తున్న 10 మంది మహిళా వికలాంగులకు స్ఫూర్తి అవార్డ్స్ ప్రదానం చేశారు.
మహిళా వికలాంగులతో ఆట పాట, మాట, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సమాజంలో వికలాంగుల పట్ల కొనసాగుతున్న వివక్షత, అసమానతలను అధిగమించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. చదువుకోవడం ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందన్నారు. విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఐసీ సంస్థ వికలాంగులతోపాటు సకలాంగుల కోసం అనేక బీమా సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. జీవిత బీమా చేసుకోవడం ద్వారా ధీమాగా జీవించొచ్చునని సూచించారు.
పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు : డాక్టర్ నళిని
మహిళా వికలాంగుల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ నళిని చెప్పారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడంలో మహిళా వికలాంగులకు అవగాహన ఉండటం లేదన్నారు. అనారోగ్యంతో ఆందోళనకు గురికాకుండా పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు కె.యశోద, అరిఫా, స్వామి, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, సాయి గీత, లలిత, భాగ్యలక్ష్మి, లలిత, రాధమ్మ, షాహిన్ బేగం, భాగయ్య, చంద్రమోహన్, భుజంగరెడ్డి, మేరీ, మల్లెపు నరసింహ, చెన్నయ్య, రాజు, బంగారయ్య పాల్గొన్నారు.
చిన్నచూపు తగదు : ఎం.అడివయ్య
వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు కల్పించిన హక్కులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. హక్కుల కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్ పెంచుతామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని కోరారు. మహిళా శక్తి పథకంలో మహిళా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వికలాంగుల పరిరక్షణకు కృషి చేయాలి : టి.జ్యోతి
వికలాంగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి అన్నారు. మహిళా వికలాంగుల పట్ల కొనసాగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, వివక్షతను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహిళా వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.



