Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంతెలంగాణకు నూతన డీజీపీని సిఫారసు చేయండి

తెలంగాణకు నూతన డీజీపీని సిఫారసు చేయండి

- Advertisement -

నాలుగు వారాల గడువిచ్చిన సీజేఐ
యూపీఎస్సీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
రాష్ట్రాల ట్రాప్‌లో పడొద్దని యూపీఎస్సీకి సూచన
రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సరిపోయే యాక్టింగ్‌/అడ్హాక్‌ డీపీపీ కోరుకుంటున్నారు
డీజీపీ నియామకాలకు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వని రాష్ట్రాలపై ధిక్కార చర్యలు

న్యూఢిల్లీ: నాలుగు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)ని సిఫారసు చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)కి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అర్హత కలిగిన ఐపీఎస్‌ అధికారుల జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్లో వారి పరస్పర ప్రతిభ (ఇంటర్‌-సే మెరిట్‌) ఆధారంగానే ఎంపిక జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ‘యాక్టింగ్‌ డీజీపీ’ల నియామకాలపై అసంతతప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాల ట్రాప్‌ లో పడొద్దని యూపీఎస్సీకి సూచించింది. ‘వారికి డీజీపీ వద్దు. వారికి సరిపోయే యాక్టింగ్‌ /అడ్హాక్‌ డీజీపీ లు కావాలి’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. తెలంగాణ డీజీపీ ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ గత నెల 29న యూపీఎస్సీ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. యూపీఎస్సీ తరపున సీనియర్‌ న్యాయవాది నరేశ్‌ కౌశిక్‌, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది శేషాద్రి నాయుడులు హాజరయ్యారు. న్యాయవాది నరేష్‌ కౌశిక్‌ వాదనలు వినిపిస్తూ ప్రకాశ్‌ సింగ్‌ కేసులో 2006 ఆదేశాల ప్రకారం డీపీపీ సిఫారసు కోసం రాష్ట్ర ప్రభుత్వం పేర్లను యూపీఎస్సీకి పంపుతుందన్నారు. ఇదే కేసులో 2018లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాలు ప్రస్తుత డీజీపీ పదవి విరమణకు మూడు నెలల ముందుగానే ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. దీనిపై యూపీఎస్సీ ప్యానెల్‌ కొత్త బాస్‌ ను రాష్ట్రానికి సిఫారసు చేస్తుందన్నారు. కానీ రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం చేస్తూ యాక్టింగ్‌ డీజీపీలను నియమిస్తున్నాయని అన్నారు.

అలాగే నూతన డీజీపీ ఎంపిక కోసం చేసే ప్రతిపాదనలకు నిర్దేశించిన మూడు నెలల తప్పని సరి వ్యవధిని తెలంగాణ పాటించలేదన్నారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న సీజేఐ, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన తెలంగాణపై ఎందుకు ధిక్కార కేసు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇందుకోసం 15 రోజులు గడువు ఇవ్వాలని కౌశిక్‌ కోరగా, భవిష్యత్‌ లో ఇటువంటి ఆదేశాల ఉల్లంఘన జరిగితే, న్యాయస్థానం ముందు విచారణకు వెళ్లే హక్కు యూపీఎస్సీకి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. అయితే… వాదనల ఆరంభంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ను అంగీకరిస్తే ఏం జరిగేదని సీజేఐ ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగిందని కాసేపు ఊహించుకుంటే తెలంగాణకు క్రియాశీల డీజీపీ ఉండరని సీజేఐ అన్నారు. ఇలాంటి పిటిషన్‌ ను దాఖలు చేసే ముందు ఈ పరిణామాన్ని ఎందుకు యూపీఎస్సీ మర్చిపోయిందని ప్రశ్నించారు.

యాక్టింగ్‌ డీజీపీల నియామకానికి ఊతం
‘దయచేసి రాష్ట్రాల ట్రాప్‌ లో పడొద్దు. వారికి డీజీపీ వద్దు. వారికి సరిపోయే యాక్టింగ్‌ డీజీపీ/అడ్హాక్‌ డీజీపీ కావాలి’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. కొత్త డీజీపీ నియామకాల్లో యూపీఎస్సీ వాదనలు పరిగణలోకి తీసుకోదగ్గవే అయినా… నియామకాల్లో తీవ్ర జాప్యం అడ్హాక్‌/యాక్టింగ్‌ డీజీపీల ఎంపికకు రాష్ట్రాలకు పరోక్షంగా ఊతం ఇస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎంపానెల్మెంట్‌ కమిటీ మీటింగ్‌(ఈసీఎం) వీలైనంత త్వరగా సమావేశపరిచి, తెలంగాణలో నూతన డీజీపీని సిఫారసు చేయాలని యూపీఎస్సీకి సీజేఐ బెంచ్‌ స్పష్టం చేసింది. మధ్యలో శేషాద్రి నాయుడు జోక్యం చేసుకొని, డీజీపీ నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2025 ఏప్రిల్‌ లోనే యూపీఎస్సీకి సిఫారసులు చేసినట్లు ధర్మాసనం దష్టికి తీసుకెళ్లారు. కానీ, యూపీఎస్సీ ఈ ప్రతిపాదనపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వాధించారు. అయితే, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న అధికారుల అర్హతను యూపీఎస్సీ నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. తదనుగుణంగా కొత్త డీజీపీ పేరును నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది.

యూపీఎస్సీకి ధిక్కార చర్యలు ప్రారంభించే స్వేచ్ఛ
డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రెగ్యులర్‌ డీజీపీ స్థానంలో యాక్టింగ్‌ లేదా అడ్హాక్‌ డీజీపీల నియామకం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాల ఆలస్యం వల్ల అర్హత కలిగిన సీనియర్‌ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. యాక్టింగ్‌/అడ్హాక్‌ డీజీపీ నియామక ధోరణినిపై అసమ్మతి వ్యక్తం చేస్తూ డీజీపీ నియామకాలకు ప్రతిపాదనలు పంపడానికి రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖ రాసే అధికారం ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు స్పందించకపోతే, యూపీఎస్సీ ధిక్కార చర్యలు ప్రారంభించే స్వేచ్ఛ ఉంటుందని తేల్చి చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -