Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రపంచ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పున:నిర్మాణం

ప్రపంచ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పున:నిర్మాణం

- Advertisement -

రూ.714.73 కోట్ల వ్యయం
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులా రైల్వే స్టేషన్‌
2026 డిసెంబరుకు పూర్తి : పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పున:నిర్మాణం చేయనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పున:నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్య ప్రకాష్‌: సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపాలకష్ణన్‌ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పరిపాలనా అధికారి/నిర్మాణం రణధీర్‌ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్‌ ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్‌ భవనం యొక్క రెండు వైపులా ఉన్న నిర్మాణ స్థలాలను మంత్రి సందర్శించారు . అభివద్ధి పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు. పని ప్రదేశాలలో చేపడుతున్న భద్రతా చర్యలను కూడా ఆయన సమీక్షించారు. అనంతరం స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ బ్రిటిష్‌ కాలంలో నిర్మించబడిందన్నారు. నేడది దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా ఉందని గుర్తు చేశారు. రోజుకు 1.97 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, 100కి పైగా రైళ్లు ఈ స్టేషన్‌ గుండా తిరుగుతున్నాయని వివరించారు. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి, రూ.714.73 కోట్ల వ్యయం చేస్తున్నట్టు ప్రకటించారు. సిగల్స్‌, ట్రాక్‌లు రైలు సేవలకు అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. రద్దీ సమయాల్లో గంటకు దాదాపు 23,000 మంది ప్రయాణిస్తు న్నారని తెలిపారు. విమానాశ్రయాలతో సమానంగా ప్రపంచ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. మూడెకరాల స్థలంలో డబుల్‌ స్టోరీ స్కై కాన్కోర్స్‌, 3,000 మంది ప్రయాణీకులకు వసతి కల్పించే సామర్థ్యంతో వెయిటింగ్‌ హాల్‌ కోసం స్థలం, కెఫెటేరియాలు, రెస్టారెంట్లు, రిటైల్‌ కేంద్రాలు, వినోద సౌకర్యాలు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 5000 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్‌, అధునాతన భద్రతా వ్యవస్థలు, రోజుకు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం మల్టీ-లెవల్‌ కార్‌ పార్కింగ్‌ పూర్తవుతుందన్నారు. సౌత్‌సైడ్‌ బ్లాక్‌ రాబోయే నాలుగు నెలల్లో పూర్తవుతుందన్నారు. నార్త్‌ సైడ్‌ భవనం, ప్లాట్‌ఫారమ్‌లు, కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ఫారమ్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టును డిసెంబర్‌ 2026 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక వేస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు, పని పూర్తయిన తర్వాత రోజుకు 2.7 లక్షల మంది ప్రయాణికులకు, గంటకు 32,500 మంది ప్రయాణికులకు వసతి కల్పించనున్నామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,337 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు వివరించారు. గత పదేండ్లల్లో తెలంగాణలో 346 కొత్త రైలు మార్గాలు, 487 కిలోమీటర్ల డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌ ప్రారంభించబడ్డాయని తెలిపారు. పదేండ్లల్లో రికార్డు స్థాయిలో 1959 కిలోమీటర్లు ట్రాక్‌ విద్యుదీకరించబడ్డాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -