Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగుల పోరాటాలకు ఎర్రజెండా అండ

నిరుద్యోగుల పోరాటాలకు ఎర్రజెండా అండ

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శ జాన్‌వెస్లీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఎక్కడ పోరాటాలు జరిగినా ఎర్రజెండా అండగా ఉంటుందనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో విడుదలైన తెలంగాణ నిరుద్యోగ బాకీ కార్డ్‌ ఆవిష్కరణ కేవలం ఆరంభం మాత్రమేననీ, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి యువత తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. అందుకే గ్యారంటీ కార్డులు కాస్తా బాకీ కార్డులు అవుతున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ నిరుద్యోగ బాకీ కార్డు’ ఆవిష్కరణ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎంపీ ఆర్‌. కష్ణయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఇచ్చిన మాట నిలుపుకో:హరీష్‌
హరీష్‌రావు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేశాడని చెప్పారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో అశోక్‌నగర్‌, సరూర్‌నగర్‌ స్టేడియంలో మీటింగులు పెట్టించారని వివరించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భతి అని మాయ మాటలు చెప్పారనీ, మోసం చేసారని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిడాన్ని విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌ అని జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేశారని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్‌ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ బోగస్‌ అని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బస్సు యాత్ర చేశారనీ, కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె అని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు ఆర్‌ కష్ణయ్య మాట్లాడుతూ జెన్కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్‌, ఇతర గ్రూప్స్‌ నోటిఫికేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రమొద్దు వైఖరి అవలంభిస్తున్నదని విమర్శించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేయాలనీ, ఈ నిరుద్యోగ జేఏసీ ఇక్కడితో ఆగిపోవద్దని సూచించారు. ప్రత్యక్ష పోరాటంలో మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే, పోరాటాలతోనే ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణలో ఎవరైనా బాకీ ఎగ్గొట్టితే నలుగురిలోకి గుంజుతామన్నారు. ఈ కాంగ్రెస్‌ నిరుద్యోగ బాకీకార్డును గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -