Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపునర్విభజన గందరగోళం

పునర్విభజన గందరగోళం

- Advertisement -

– వార్డు చిన్నదైందని కొందరు.. పెద్దదైందని మరికొందరు
– కొన్ని డివిజన్‌లలో ఎక్కువ ఓట్లు..
– మరికొన్ని డివిజన్‌లలో తక్కువ ఓట్లు
– జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో నిలదీతకు రాజకీయ పార్టీలు సిద్ధం
– జోన్లు మార్చాలంటున్న విలీనమైన మున్సిపల్‌ కార్పొరేటర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో

జీహెచ్‌ఎంసీలో వార్డుల పునర్విభజన, జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. కొన్ని డివిజన్‌లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్‌లలో తక్కువ ఓట్లు ఉన్నాయంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విలీన మున్సిపాలిటీలు, నూతన వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు, జోనల్‌ కార్యాలయాలు ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయాయి.పునర్విభజనపై తమ అభ్యంతరా లను వ్యక్తం చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. గ్రేటర్‌లో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో భారీగా వార్డులు తగ్గిపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పా లంటూ డిమాండ్‌ చేశారు. 300 డివిజన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొన్ని వార్డులు రెండు నియోజకవర్గాల్లో చేర్చడంపైనా అభ్యంతరా లు వ్యక్తమయ్యాయి. తాజా పరిస్థితుల్లో మంగళవారం జరగనున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ వేదికగా తమ అభ్యంతరాలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే లీగల్‌గా పోరాటం చేస్తామంటూ పలువురు గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ బల్దియా కౌన్సిల్‌లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తీసుకోనున్నారు.

పట్టువీడని ప్రజాప్రతినిధులు
చాలో చోట్ల హద్దులు, కొత్త డివిజన్లపై జీహెచ్‌ఎంసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. బడంగ్‌పేట్‌ను చార్మినార్‌ జోన్‌లో కాకుండా ఎల్బీనగర్‌ జోన్‌లో కలపాలని కొందరు పట్టుబడుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం విలీన మున్సిపాలిటీలకు దగ్గరలో ఏర్పాటు చేయాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తున్నారు. తుర్కయాంజాల్‌, ఆదిభట్ల, మీర్‌పేట్‌, బడంగ్‌పేటను కలిపి బడంగ్‌పేట జోన్‌గా ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు. అక్కడక్కడా డివిజన్ల ఏర్పాటుపైనా ఆందోళన నెలకొంది. శివారు ప్రాంతాలను కలిసి ఫిర్జాదీగూడను రెండు డివిజన్లుగా విభజించారు. అయితే దాన్ని నాలుగు డివిజన్లుగా విభజించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు.
– పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్‌ డివిజన్‌లో కొంత భాగాన్ని విడదీసి వేరే వార్డులో విలీనం చేశారన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ప్రాంతంలో వేలాదిగా ప్రజలు, ఓటర్లున్నారని.. దానిని రెండు వార్డులుగా ఏర్పాటు చేయాలని కోరారు.
– అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో 1.20 లక్షలకు పైగా ఓటర్లుండగా అదనంగా కేవలం ఒకే వార్డు చేశారని, జనాభా ప్రాతిపదికన అదనంగా మరో రెండు వార్డులు కావాలని అభ్యర్థించారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అదనంగా మరో వార్డును ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్రజాప్రతినిధుల అభ్యంతరా లను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు
వార్డుల విభజనపై అధికార కాంగ్రెస్‌ కార్పొరేటర్లు సైతం మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో అధికారుల వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు. వార్డుల విభజన, పేర్లు ఫిక్స్‌ చేసే అంశంలో పలు మార్పులు తాము సూచించామని మేయర్‌, కమిషనర్లకు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశామన్నారు. వార్డుల పెంపు, జీహెచ్‌ఎంసీ విస్తరణపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, వార్డుల విభజన విషయంలో మాత్రం మంగళవారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో తమ అభిప్రాయాలను వినిపిస్తామన్నారు.

తొందరపాటు ఎందుకు.. : తలసాని
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాలో లోపాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో పలువురు పార్టీ నేతలు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ల పునర్విభజనలో తప్పిదాలను సరి చేయాల న్నారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డివిజన్ల పునర్విభజనలో తొందరపాటు ఎందుకని ప్రశ్నించారు.

విభజనపై కన్ఫ్యూజన్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌
జీహెచ్‌ఎంసీ విస్తరణ జరగడం బాగుంది కానీ తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. ముఖ్యంగా వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్‌ ఉందని తెలిపారు. కనీసం తమకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీ లిమిటేషన్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సమస్యలు గుర్తించాం : అరికెపూడి గాంధీ
డివిజన్ల విభజనపై సమస్యలు ఉన్నాయనే అంశాలను గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. కొన్ని డివిజన్‌లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్‌లలో తక్కువ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రతి విషయాన్ని మేయర్‌, కమిషనర్‌లకు వివరించామన్నారు. కౌన్సిల్‌ లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని తెలి పారు. వార్డులు మార్పు చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని అన్నారు. హద్దులు తెలియ కుండా అధికారులు వాటిని ఖరారు చేశారన్నారు.

అభ్యంతరాలన్నీ సభ దృష్టికి..
వార్డుల విభజనలో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 1400కుపైగా అభ్యంతరాలు వచ్చాయి. అందులో వార్డుల విస్తరణపై ఫిర్యాదులు, సలహాలు కూడా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను నేరుగా కలిసిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అధిక సంఖ్యలో ఫిర్యాదులు వార్డుల సరిహద్దుల విషయంలో వచ్చాయి. శివారు ప్రాంతాల్లో ఉన్న మేజర్‌ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపారు. ఈ అంశమే రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో ఎక్కువ మందికి అవకాశం వచ్చేలా వార్డుల విభజన, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. మంగళవారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో తమ అభ్యంతరాలన్నింటినీ సభ దృష్టికి తీసుకొస్తామంటున్నారు. సరైన పద్ధతిలో ప్రభుత్వం స్పందించకుంటే కోర్టులను ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. రెండ్రోజుల కిందట బీజేపీ, ఎంఐఎం నేతలు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, దానం నాగేందర్‌, మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కమిషనర్‌ను, మేయర్‌ను కలిసి వార్డుల విభజనపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -