Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంరెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు

రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు

- Advertisement -

సీఐటీయూ అఖిల భారత మహాసభ ప్రచారం
విశాఖలోని గాజువాకలో ప్రదర్శన
విశాఖ :
విశాఖలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పాత గాజువాకలో ఆదివారం రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు జెండా ఊపి ప్రారంభించారు. పాత గాజువాక జంక్షన్‌ నుంచి కొత్తగాజువాక వరకు తిరిగి పాత గాజువాక వరకు రెడ్‌ షర్టులు, టోపీ ధరించి, సీఐటీయూ జెండా పట్టుకుని కవాతు నిర్వహించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికుల హక్కులు కాపాడాలని, మెడికల్‌ కాలేజీలు ప్రయివేటీకరణ రద్దు చేయాలని, డౌన్‌ డౌన్‌ క్యాపిటలిజం, అప్‌ అప్‌ సోషలిజం అనే నినాదాలతో కవాతు సాగింది. అనంతరం పాత గాజువాక జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వల్ల గాజువాక అభివృద్ధి చెందిందని తెలిపారు. సీఐటీయూ ఏపీ నాయకులు ఎం.రాంబాబు మాట్లాడుతూ, జనవరి 4వ తేదీన జరుగు బహిరంగసభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.

సీఐటీయూ మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మల్కాపురం నుంచి శ్రీహరిపురం మీదుగా కోరమండల్‌ గేట్‌ వరకు రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ఈ కవాతును డీవైఎఫ్‌ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్న, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు, సీఐటీయూ మల్కాపురం జోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి, హెచ్‌పీసీఎల్‌ కాంటాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జి.నరేష్‌ మాట్లాడుతూ, జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో జరిగే భారీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారని తెలిపారు.
సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జీవీఎంసీ 69వ వార్డు పరిధి అక్కిరెడ్డిపాలెంలో సీఐటీయూ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. విరాళాలు సేకరించారు.

భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన కొమ్మాది సాయిరాం కాలనీ కూడలి వద్ద సీఐటీయూ జెండాను సంఘం అధ్యక్షులు కావాల లక్ష్మణ ఆవిష్కరించారు.
అనకాపల్లి జిల్లా రావికమతంలో సీఐటీయూ నేతలు ప్రచారం చేపట్టారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో అంగన్వాడీలు, ఇతర కార్మికులు ప్రచారాన్ని నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వివి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పరవాడలో మండల పరిషత్‌ కార్యాలయం నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వరకు సీఐటీయూ ఆధ్వర్యాన ప్రచార ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -