– ఆర్‌టిజిఎస్ సమీక్షలో సిఎం చంద్రబాబు
అమరావతి : పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని, తద్వారా ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ఆర్‌టిజిఎస్‌పై ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని తెలిపారు. ప్రభుత్వ సేవల్లోనూ ఎఐ పాత్ర పెరగాలని, దీనిని వినియోగించుకొని గ్రీవెన్సులు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మనమిత్ర-వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు. వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, రహదారులు, ఆర్‌టిఎ, అగ్నిమాపకశాఖల పనితీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సిసిఎల్‌ఎ చీఫ్ కమిషనర్ జి జయలక్ష్మి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, ఐటి కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు, సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించండి
- Advertisement -
- Advertisement -



