Thursday, March 5, 2026
E-PAPER
Homeజాతీయంతగ్గిన ధాన్యం కొనుగోలు

తగ్గిన ధాన్యం కొనుగోలు

- Advertisement -

ఫిబ్రవరిలో 17 శాతం పడిపోయిన తీరు
బీహార్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లోనూ అదే తీరు
దేశంలో ఈ పరిస్థితి ఆందోళనకరం
రైతుల నుంచి కొనుగోళ్లను పెంచాలి : నిపుణులు

న్యూఢిల్లీ : దేశంలో బఫర్‌ స్టాక్స్‌ కోసం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) సహా పారాస్టేటల్‌ సంస్థలు ఫిబ్రవరిలో బియ్యం కొనుగోళ్లు 17 శాతం తగ్గించాయి. బీహార్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెరుగుదల నమోదైంది. అయితే 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం కొనుగోళ్లు 463.06 లక్షల టన్నులకు చేరి, గతేడాది కంటే 1.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

2025-26 ఖరీఫ్‌ బియ్యం కొనుగోలు లక్ష్యం 477.49 లక్షల టన్నులుగా ఉంటే.. దాన్ని మాత్రం చేరలేకపోయింది. అక్టోబర్‌-ఫిబ్రవరి వరకు కొనుగోలు 463.06 లక్షల టన్నులుగా నమోదైంది. గతేడాది నమోదైన 454.36 లక్షల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువే. ఇక 2024-25లో ఖరీఫ్‌, రబీ మొత్తం కొనుగోలు 545.22 లక్షల టన్నులుగా ఉంది. 2026 ఫిబ్రవరి 1 నాటికి ఎఫ్‌సీఐ వద్ద బియ్యం నిల్వలు 74.04 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఏడాదికి కావాల్సింది సుమారు 41 మిలియన్‌ టన్నులు.

రాష్ట్రాల వారీగా పరిస్థితి
2024-25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో ధాన్యం కొనుగోళ్లు కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి, మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గాయి. తమిళనాడులో 16 లక్షల టన్నులు (23 శాతం పెరుగుదల), ఆంధ్రప్రదేశ్‌లో 27.38 లక్షల టన్నులు (88.4 శాతం), తెలంగాణలో 35.96 లక్షల టన్నులు (7 శాతం పెరుగుదల), యూపీలో 41.75 లక్షల టన్నులు (8 శాతం), మధ్యప్రదేశ్‌లో 34.67 లక్షల టన్నుల (18.9 శాతం) నమోదుతో పెరుగుదలను నమోదు చేశాయి. ఇక పంజాబ్‌లో 104.86 లక్షల టన్నులు (9.7 శాతం తగ్గుదల), హర్యానాలో 35.96 లక్షల టన్నులు (0.1 శాతం), పశ్చిమ బెంగాల్‌లో 13.64 లక్షల టన్నులు (26.4 శాతం), బీహార్‌లో 20.54 లక్షల టన్నుల (21.8 శాతం)తో ధాన్యం కొనుగోళ్లు పడిపోయిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

ఉత్పత్తి పరిస్థితి
వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 124.50 మిలియన్‌ టన్నులు ఉండొచ్చని తెలుస్తోంది. ఇది గతేడాది కంటే 1.4 శాతం ఎక్కువ. అలాగే ప్రభుత్వం 5.2 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ తయారీకి కేటాయించింది. ప్రస్తుతం ప్రభుత్వం బియ్యాన్ని టన్నుకు రూ.23,200కి విక్రయిస్తోంది. కానీ ఆ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం మొదలైన అన్ని ఖర్చులు కలిపితే ఒక టన్నుకు అసలు వ్యయం రూ.41,733.40గా ఉంటుందని అంచనా.

‘ధాన్యం కొనుగోళ్లు తగ్గడం ఆందోళనకరం’
మొత్తానికి ఫిబ్రవరిలో బియ్యం కొనుగోలు తగ్గినప్పటికీ… మొత్తం సీజన్‌ పరంగా పెద్దగా లోటు లేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లను జరిపి నిల్వలు పెంచుకోవడం ఆర్థిక భారంగా భావిస్తోందనీ, దీని ప్రభావం రైతులపై ఆర్థికంగా పడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గిపోవడం ఆందోళనకరమనీ, ఇది అక్కడి రైతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పుకునే మోడీ ప్రభుత్వం.. కొనుగోళ్లను పెంచాలని సూచిస్తున్నారు. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా వాస్తవ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రికార్డు స్థాయిలో నిల్వలు అంటూ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. మరోవైపు ఇథనాల్‌ కోసం బియ్యం మళ్లించడం వంటి నిర్ణయాలు కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -