-బతుకుబండి లాగేందుకు ప్రత్యామ్నాయం
-ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలో మోడీ సర్కార్ విఫలం
-సోషల్ మీడియాపై ఆధారపడుతున్న యువతరం
పూటగడవాలంటే ఏదోఒకపని కావాలి. ఎంత ఉన్నత చదువులు చదివినా, అర్హతకు తగిన ఉద్యోగం దొరకడం గగనం. నిరుద్యోగాన్ని రూపుమార్చేస్తానని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ మూడు సార్లు అదే పదవిలో కొనసాగినా, రోజురోజుకూ ఉద్యోగ, ఉపాధి అవకావాలు దిగజారుతున్నాయే తప్ప, యువతకు కోరుకున్న జీవితం లభించట్లేదు. ప్రభుత్వంలోని ఖాళీ పోస్టుల భర్తీలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టే విధానాలను అమల్లోకి తెస్తున్నదే తప్ప, నిరుద్యోగ నియంత్రణ చర్యలు శూన్యం. దీనితో యువతరమే ప్రత్యామ్నాయ జీవనోపాధిని వెతుక్కుంటోంది. సోషల్ మీడియాలో ‘రీల్స్’ చేయడాన్ని కూడా ఉపాధిగా ఎంచుకుంటోంది. దానికోసం అనేకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వీక్షకుల్ని ఆకర్షించేందుకు, కాస్తో కూస్తో ఆదాయం సంపాదించేందుకు అత్యంత ప్రమాదకరమైన ‘స్టంట్ల’కూ వెనుకాడట్లేదు. కోరి కోరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా, వారికి ఎలాంటి అధికారిక ఉపాధినీ కల్పించలేని మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తూ, కాలాన్ని నెట్టుకొస్తోంది.
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్- 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000- 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్ ఎంప్లారుమెంట్) తగ్గిపోయాయి. కోవిడ్ తర్వాత అసలు దేశంలో నిరుద్యోగ యువతను పట్టించుకున్న దాఖలాలే లేవు. చివరకు ఏం చేయాలో పాలుపోని నిరుద్యోగ యువత ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ‘రీల్స్’ తీసుకుంటూ సొంతంగా ఉపాధి పొందుతోంది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చేతిలో చిన్న కెమెరా పట్టుకుని ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటున్నారు. బారక్‌పూర్‌కు చెందిన హషి మృధ ఒకప్పుడు భారత సైన్యంలో చేరడం లేదా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడం అనే ఆలోచనతో ఉండేది. 19 ఏండ్లు వయసున్న ఆమెను ఆర్థిక కష్టాలు తన మనస్సును మార్చుకునేలా చేశాయి. ప్రస్తుతం ఆమె రీల్స్ చేస్తూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”నా తల్లి ఉదయం 4 గంటలకు నిద్రలేచి ప్రతిరోజూ పనికి వెళుతుంది. ఆమె మళ్లీ ఎప్పుడూ పని చేయనవసరం లేకుండా తగినంత సంపాదించాలనుకుంటున్నా. నేను అప్పుడప్పుడు రూ.400 నుంచి రూ.500 సంపాదిస్తాను. నా ఫాలోయింగ్ పెరిగిన తర్వాత, మరింత సంపాదించగలను” అని హషి ధైర్యంగా చెబుతోంది. ఈమె చేసిన వీడియో సమయం 10 నుంచి 15 సెకన్లుంటుంది. చీకి టూ-లైనర్‌లను బెల్టింగ్ చేస్తాయి.
ప్రతి పంచ్‌లైన్‌తో పాటు సౌండ్‌ట్రాక్ ,స్పెషల్ ఎఫెక్ట్‌లు సైతం ఆకట్టుకుంటున్నాయి. 23 ఏండ్ల ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి శౌర్జశిష్ సమంత టెక్ ఉద్యోగం చేస్తున్నారు. ‘ప్లాన్-ఎ’లో భాగంగా రీల్స్ చేస్తున్నారు. ”సుమారు రెండు సంవత్సరాల క్రితం, నేను నా బైక్ తీసుకున్నప్పుడు, దానితో రీల్స్ చేయడం ప్రారంభించా. వాటిలో కొన్ని మిలియన్ల వీక్షణలను సాధించా” అని చెప్పారు.నాడియాలోని నజీర్‌పూర్‌కు చెందిన అనుశ్రీ ఇప్పుడు వెరీ రీల్-మేకర్. ఉన్నతంగా చదువుకున్న ఆమె ఉద్యోగం దొరక్క రీల్స్ ద్వారా ఉపాధి పొందుతోంది. నాడియాలో ఆమె కోరుకున్న జీవితం అందలేదు. దాంతో తన నవజాత శిశువు, తన భర్తతో తన రోజువారీ జీవితం గురించి లిప్-సింకింగ్ వీడియోలు, వీడియో-బ్లాగులను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్‌బుక్ నుంచి సంపాదించడం అంత సులభం కాదని చెప్తుంది. హౌరాలోని గర్ భవానీపూర్ ఆర్పీ. ఇన్‌స్టిట్యూషన్‌లో ఫిజిక్స్ టీచర్ అయిన సౌమెన్ చక్రవర్తి సైడ్ హస్టిల్ కంటెంట్‌గా మారారు. ”నేను ప్రాథమిక భౌతిక శాస్త్ర భావనల గురించి రీల్స్ తయారు చేస్తాను” అని అంటున్నారు. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఉప్పు ఎందుకు కలపాలి, ఉరుములతో కూడిన తుఫానుల నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి .ఇలా ఇంట్రస్టింగ్ సబ్జెకులతో రీల్స్ చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరే కాదు.. చాలా మంది యువత రీల్స్‌పై ఆధారపడే జీవిస్తున్నారు. అంతేకాక నాలుగు కాసులు వెనకేసుకుని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వీరిలా ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నందుకు సంతోషంగా ఉన్నా, కేంద్రంలోని మోడీ సర్కార్ నిరుద్యోగుల్ని పెంచి పోషిస్తూ, ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండటాన్ని మాత్రం ప్రశ్నించకుండా ఉండలేం!!