Saturday, November 22, 2025
E-PAPER
Homeమానవిసామాజిక మార్పుకు ప్రతిబింబాలు

సామాజిక మార్పుకు ప్రతిబింబాలు

- Advertisement -

‘అమ్మాయిలు వీళ్లేం చేయగలరు’ అనే వాళ్లకు ధీటైన సమాధానం ఇచ్చారు. పితృస్వామ్య సంకెళ్లను తెంచుకున్నారు. పరుషాధిక్య భావజాలాన్ని ధిక్కరించారు, లింగ వివక్షను ఎదిరించారు. ఓ క్రీడను అమ్మాయిల సాధికారతకు, గర్వానికి చిహ్నంగా మార్చారు. భారత మహిళా ఖోఖో ప్రపంచ కప్‌ ఛాంపియన్లుగా ఆటను పునర్నిర్వచించుకుంటున్నారు. వారు క్రీడా రంగంలో కేవలం ఓ చరిత్రను మాత్రమే సృష్టించలేదు, ఎంతో మంది యువతుల కలలను నిజం చేశారు. జట్టు సభ్యులైన నిర్మలా భాటి, ప్రియాంక ఇంగ్లే, మాగై మాఝి ఎత్తిన ‘మహిళల ఖోఖో మొదటి ప్రపంచ ట్రోఫీ’ నేడు ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. వారి ధైర్యం, సంకల్పం సామాజిక మార్పుకు ప్రతిబింబం. అడుగడుగునా అడ్డంకులు ఎదైనా ప్రపంచాన్ని జయించిన వారి విజయ గాథ నేటి మానవిలో…

టోర్నమెంట్‌లో ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత నిర్మలా భాటి తన సొంత ప్రాంతమైన రాజస్థాన్‌కు తిరిగి వచ్చినప్పుడు ఆమెకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ఆమెను అభినందించడానికి ముఖ్యమంత్రి కూడా ఫోన్‌ చేశారు. ఆ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఖోఖో ఆడుతున్న ఏకైక మహిళగా ఆమె గ్రామీణ, గిరిజన ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది.

ఒక్క పైసా ఖర్చు లేదనే…
రాజస్థాన్‌లోని పరేవాడి అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన నిర్మలా భాటి ఆరో తరగతి నుంచే ఖోఖో ఆడటం మొదలు పెట్టింది. చిన్నతనంలో క్రీడలంటే ఆసక్తి ఉన్న ఆమె పరిగెత్తే ఖోఖో, కబడ్డీపై ఆసక్తి పెంచుకుంది. ‘క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటలు ఆడాలంటే ప్రత్యేక పరికరాలు అవసరం. అందుకే నాకు ఖోఖో అంటే ఇష్టం. ఖోఖో ఆడటానికి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఖరీదైన పాదరక్షలు కొనాల్సిన అవసరం లేదు’ అంటూ నిర్మల చెప్పింది.

అనుమతి కోసం పోరాటం
ఒడిశాలోని రారుగడ్‌ జిల్లాకు దాదాపు 1,600 కిలోమీటర్ల దూరంలో నివసించే మాగై మాఝి తన పదేండ్ల వయసులో ఖోఖో ఆడటం ప్రారంభించింది. మొదట్లో ఆమెకు అథ్లెటిక్స్‌ అంటే ఎంతో ఇష్టం. అయితే తన కోచ్‌ ప్రోత్సాహంతో ఆమె ఖోఖోను ఎంచుకుంది. తాను ప్రాక్టీస్‌ చేసిన మైదానంలో మరో అమ్మాయి ద్వారా ఆమె ఈ ఆట పట్ల ప్రేరణ పొందింది. ప్రపంచ కప్‌ గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్న 26 ఏండ్ల ప్రియాంక ఇంగ్లే తన ఐదవ తరగతిలో ఖోఖో గురించి తెలుసుకుంది. పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవం సందర్భంగా పరుగులో మొదటి స్థానంలో నిలిచింది. అది చూసి కోచ్‌ ఆమెను ఖోఖో కోసం ఎంచుకున్నాడు. 16 ఏండ్లుగా ఆమె ఆడుతోంది. ఆడే అనుమతి కోసం పోరాడుతూనే వుంది.

ఎన్నో అన్నారు
ఖోఖో తారలుగా మారే మార్గంలో ఈ ముగ్గురు కుటుంబ వ్యతిరేక తను, చుట్టుపక్కల వారి నిందలను ఎదుర్కో వలసి వచ్చింది. ‘నేను ఖోఖో ఆడటం మొదలుపెట్టినప్పుడు మా చుట్టుపక్కల వారు మా అమ్మను ఎన్నో మాటలు అన్నారు. ‘ఆడపిల్లకు పొట్టి బట్టలు వేసి తిప్పితున్నావు ఎందుకు’ అంటూ నిందించారు. నా వల్ల ఇతర అమ్మాయిలు కూడా పాడైపోతారని వారి అభిప్రాయం’ అంటూ నిర్మలా భాటి గుర్తుచేసుకుంది. అయితే ఆమె తల్లిదండ్రుల మద్దతు ఆమెను ముందుకు తీసుకెళ్లింది. ‘నేను ఏ తప్పు చేయనని వారికి పూర్తి నమ్మకం ఉంది’ అని ఆమె జతచేసింది.

తల్లి నుండి మద్దతు
మాగై మొదట్లో తన తల్లికి అబద్ధం చెప్పేది. ‘నేను ఖోఖో ఆడతానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు వద్దన్నారు. చదువుపై దృష్టి పెట్టమ న్నారు. అందుకే అప్పుడు వాళ్లతో ఆటను వదిలివేస్తానని చెప్పాను, కానీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆటను కొనసాగించాను. నేను జాతీయ స్థాయికి ఎంపికైన తర్వాత నా కోచ్‌ ఇంట్లో వాళ్లను ఒప్పించాడు’ అని ఆమె చెప్పింది. అప్పటి నుండి ఆమెకు తల్లి నుండి తిరుగులేని మద్దతు లభించింది.

ఉత్తమ క్రీడాకారిణిగా
ప్రియాంక కూడా మంచి విద్యార్థి కాబట్టి ఆమె కుటుంబం కూడా ఆమెను చదువుపై దృష్టి పెట్టమంది. ‘నా కోచ్‌ ఇంటికి వచ్చి వారిని ఒప్పించాడు. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు అండర్‌-14 జూనియర్‌ నేషనల్స్‌లో ఆడాను. ఉత్తమ క్రీడాకారిణి అవార్డు కూడా గెలుచుకున్నాను. నా విజయం, నా దృఢ సంకల్పాన్ని చూసి కుటుంబం నన్ను ప్రోత్సహించింది. అప్పటి నుండి నేను 26 జాతీయ, రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడాను’ అని ఆమె చెప్పింది.

ప్రపంచ కప్‌ వైభవం
జనవరి 2025లో న్యూఢిల్లీలో జరిగిన మొదటి ఖోఖో ప్రపంచ కప్‌ 23 దేశాలను ఒకచోట చేర్చింది. 19 మహిళా జట్లు, 20 పురుషుల జట్లు ఉన్నాయి. ‘మహిళల ఖోఖో ప్రపంచ కప్‌ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌కే ప్రాధాన్యం ఉండేది. మొన్నటి వరకు మన స్వదేశీ ఆట ఖోఖోకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం నాకు బాధగా ఉండేది’ అని నిర్మలా భాటి అంటోంది.

ఎప్పుడూ చూడలేదు
ప్రియాంక జట్టుకు నాయకత్వం వహించడం తన మంచి అనుభవంగా ఆమె చెబుతోంది. ‘2023లో 4వ ఆసియా ఛాంపియన్‌షిప్‌ కోసం మేము నేపాల్‌తో ఫైనల్‌లో ఆడాము. అదే మమ్మల్ని ఆటకు సిద్ధం చేసింది. మా కోచ్‌లు నేపాల్‌తో ఎలా ఆడాలో మాకు చెప్పారు. అదే నేపాల్‌లో ఓడించి మేము ఖోఖో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాము’ అని ఆమె చెప్పింది. 20 ఏండ్ల వయసు కలిగిన మాగై ముగ్గురిలో చిన్నది. తాను జట్టుకు ఎంపికవుతానని అస్సలు ఊహించలేదు. ‘భారతదేశం తరపున ఆడటం నా కల, జట్టుకు ఎంపికై నప్పుడు చాలా సంతోషిం చాను. ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి సౌకర్యాన్ని చూడ లేదు. మైదా నం చాలా బాగుంది’ అంటూ ఆమె ఆశ్చర్య పోయింది.

కొంత మార్పు వచ్చింది
రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం తాను సాధించిన విజయంలో భాగం పంచుకోవడం నిర్మలా భాటి కళ్లారా చూసింది. ”ఈ మధ్య కాలంలో మన దేశ మహిళల ఖోఖో జట్టు ఎంతో మార్పు చెందింది. అంతకుముందు క్రీడాకారులకు తగినంత అవకాశాలు లేవు” అని నిర్మలా ఎత్తి చూపింది. ‘ఇప్పుడు కొంత వరకు మార్పు వచ్చింది. కళాశాలలు ఖోఖో ఆటకు ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు’ అని ఆమె చెబుతోంది. నిర్మలా ప్రస్తుతం పోస్టల్‌ విభాగంలో పనిచేస్తోంది. ప్రియాంక రాష్ట్ర ప్రభుత్వంలో క్లాస్‌ 2 స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. మాగై ఇంకా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయలేదు. కానీ ఆమె క్రీడా జీవితంపై దృష్టి సారించింది. వాస్తవానికి ఖోఖో శిక్షణ చాలా కఠినమైనది. దీనికి వేగం, ఓర్పు, బలం అవసరం. మార్చి నెలలో కాలు విరిగిన నిర్మలా త్వరగా కోలుకోవడానికి తన శిక్షణే కారణమని చెబుతుంది.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -